ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే, ఆ పార్టీ ప్రతినిధి అశుతోష్ రంకాకు ముంబై పోలీసులు షాకిచ్చారు. ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ దగ్గర అనుమతి లేకుండా నిరసన చేపట్టిన కేసులో వీరిద్దరిపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. నిందితులు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉందన్న అనుమానంతోనే ముందుజాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు ముంబై పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
ఓటర్ల జాబితాలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 2026, అక్టోబర్ 2న దాదర్‌లోని శివాజీ పార్క్ వద్ద చలో ముంబై పేరుతో సీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల సమస్యల కారణంగా సీజేపీ నిరసనకు ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ సీజేపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
దీంతో అనుమతి లేకుండా 4 వేల మందికి పైగా ప్రజలతో గుమిగూడి నినాదాలు చేసినందుకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాతో పాటు మరో 400 మందికి పైగా మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా నిందితులు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు లండన్ బయలుదేరిన సౌరవ్ దాస్‌ను ఈ లుకౌట్ నోటీసు కారణంగానే ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై అతడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ముంబై పోలీసుల అభ్యర్థన మేరకే ఈ నోటీసు జారీ అయినట్లు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
