బిగ్ బాస్ హౌస్ లో కొన్ని మెమొరీస్.. బోలెడన్ని ఎమోషన్స్

బిగ్ బాస్ హౌస్ లో కొన్ని మెమొరీస్.. బోలెడన్ని ఎమోషన్స్

రోజూ గొడవలు, వాదనలతో వేడెక్కిపోయే తెలుగు బిగ్‌బాస్ హౌస్ ఒక్కసారిగా చల్లబడిపోయింది. బేబీస్ టాస్క్ ముగిసిపోవడంతో దాని రిలేటెడ్‌గానే మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. తమ బేబీస్‌ని వదలడానికి అందరూ బాధపడ్డారు కనుక.. మీ లైఫ్‌లో నిజంగా ఓ బేబీ ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని తోటి సభ్యులతోటి, ప్రేక్షకులతోటి పంచుకోమన్నాడు. అంతే.. ఒక్కసారిగా హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది.

కొన్ని మెమొరీస్.. బోలెడన్ని ఎమోషన్స్
బాలాదిత్య ఒక్కో కార్డ్ తీస్తుంటే.. అందులో పేరున్న వాళ్లు తమ జ్ఞాపకాలను పంచుకోవడం మొదలుపెట్టారు. పిల్లలంటేనే ఇష్టం ఉండని తాను తన కూతురు పుట్టిన తర్వాత పూర్తిగా మారిపోయానని, తనపైనే ప్రాణం పెట్టుకున్నానని ఆదిరెడ్డి చెప్పాడు. ముందు పిల్లల్ని వద్దనుకున్న తాను కన్సీవ్ అయ్యాక ఆ ఆనందాన్ని ఫీలవడం స్టార్ట్ చేశానని, అయితే.. థైరాయిడ్‌ని కంట్రోల్ చేయకపోవడంతో బిడ్డను పోగొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి ఎమోషనల్ అయ్యింది సుదీప. తన చెల్లెలి బిడ్డను కొన్నాళ్లు తన దగ్గర ఉంచుకున్నానని, తిరిగివ్వడానికి మనసు రాలేదని, ఎప్పటికైనా తనకీ ఓ బిడ్డ వస్తుందనే ఆశతో బతుకుతున్నానని చెప్పింది. చిన్నప్పటి నుంచీ నాన్న అనే పిలుపు తెలియని తాను నాన్నను కాబోతున్నాననే ఆనందంలో ఉన్నానని, అందుకే బేబీని స్టోర్‌‌ రూమ్‌లో పెట్టేయమంటే తట్టుకోలేకపోయానని చెప్పాడు రేవంత్. కళ్లముందే తన తల్లి మంటల్లో కాలిపోవడం చూశానని, ఆ తర్వాత ఆమె తనకి ఇద్దరు కవల పిల్లల రూపంలో పుట్టిందని చెప్పిన చంటి.. తల్లిదండ్రులు లేని జీవితం దారుణంగా ఉంటుందని, ఎవ్వరూ తమ పిల్లల్ని వదిలిపెట్టకూడదని అన్నాడు. శ్రీసత్య తన అనుభవాన్ని షేర్ చేసుకోకపోయినా.. తల్లిదండ్రుల విలువ గురించి మాట్లాడింది. ఎలాంటి సమయంలోనైనా తోడుండేది పేరెంట్సే అని, వాళ్లేదైనా చెబితే వినాలని అంది. ఆత్మహత్య తప్పు అని, తాను ఆ స్థితి నుంచే వచ్చానని కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాత కూడా ఒకరిద్దరితో పేరెంట్స్ విషయంలో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది సత్య. డబ్బు లేకపోతే అందరూ మనల్ని వదిలేసి పోతారని, తల్లిదండ్రులు మాత్రమే మనవెంట వచ్చి మనతోపాటు రోడ్డు మీద నిలబడతారని అంది. ఇక మెరీనా, రోహిత్‌లు కూడా హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం వల్ల తమ బేబీని రిమూవ్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి చాలా బాధపడ్డారు.

కీర్తి కన్నీటి కథ
ప్రపంచంలో ఓ మనిషికి ఇన్ని కష్టాలు ఉంటాయా అనిపిస్తుంది కీర్తి కథ వింటే. అమ్మా నాన్నలు, అన్నా వదినలు, మేనకోడలితో ఆనందంగా బతికే ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులైపోయిన దుర్ఘటనను అందరితో పంచుకుంది కీర్తి. టెంపుల్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో కీర్తి, ఆమె తండ్రి తప్ప అందరూ స్పాట్‌లోనే చనిపోయారు. హాస్పిటల్‌లో ఉన్న కీర్తికి స్పృహ వచ్చిన తర్వాతి రోజు తండ్రి కూడా కన్నుమూశాడు. ఆ షాక్ తట్టుకోలేక కీర్తి కోమాలోకి వెళ్లిపోయింది. 32 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు నేను బతికినందుకు సంతోషించడానికి అక్కడ ఒక్క మనిషి కూడా లేడంటూ కీర్తి ఏడుస్తూ చెబుతుంటే మిగతా సభ్యులు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత తన ఒంటరితనాన్ని మర్చిపోడానికి ఓ పాపను అడాప్ట్ చేసుకున్నానని, తాను బిగ్‌బాస్‌కి వచ్చే ముందే ఆమె కూడా చనిపోయిందని, కనీసం తనకి పెళ్లైతే ఒక బిడ్డ పుడుతుందనే ఆశ కూడా లేదని, యాక్సిడెంట్‌ జరిగినప్పుడు డ్యామేజ్ అయిన తన గర్భ సంచిని తీసేశారని చెబుతూ ఆమె ఆవేదన చెందుతుంటే ఏడుపు ఆగలేదెవ్వరికీ. అంత జరిగినా తాను ఎవరు జాలినీ కోరుకోనని చెప్పకనే చెప్పింది. తన కథ విని ఎవరూ బాధపడొద్దని, తన దగ్గరకు వచ్చి ఇవేమీ మాట్లాడొద్దని ఆమె చెప్పడంతో ఇంకెవ్వరూ ఆ టాపిక్ తీసుకురాలేదు. 

ఎన్నికల సందడి
కెప్టెన్సీ పోటీదారులంతా ప్రచారం మొదలుపెట్టారు. తమకు ఓటేయమంటూ ఎవరి పద్ధతిలో వాళ్లు అడిగారు. ఆడపిల్ల గెలిచి తీరాలని, అమ్మాయిలందరూ కలిసి తనను గెలిపించాలని ఇనయా కోరింది. చంటి కొన్ని ఫన్నీ ప్రమాణాలు చేశాడు. బెల్ కొట్టినా గంటసేపు పడుకోనిస్తానన్నాడు. రాత్రిపూట ఫుడ్ దొంగిలించే వారిని ఓ పట్టు పడతానన్నాడు. ఇక సూర్య తనదైన శైలిలో అభ్యర్థించాడు. రాజ్ అయితే తాను నామినేషన్‌లో ఉన్నానని, ఒక్కసారి అవకాశమిస్తే బాగుంటుందని సింపతీ కార్డ్ తీశాడు. ఆ తర్వాత ఇద్దరిద్దరిని పిలిచి ఎవరికి ఓటు వేస్తారో డిసైడ్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పాడు. ఎవరూ కొట్టుకోకుండా కూల్‌గానే నిర్ణయాలు తీసుకున్నారు. టైమ్ అయిపోవడంతో అప్పటికి టాస్క్ ఆపేశాడు బిగ్‌బాస్. తర్వాతి రోజు వరకు ప్రచారం చేసుకోమని చెప్పాడు. ఆల్రెడీ రాజ్‌కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అయితే ఇనయా, చంటి, సూర్య కలిసి రాజ్‌కే చాన్స్ ఇద్దామనే నిర్ణయానికి వచ్చారు. అతనిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామన్నారు. 

సరికొత్త పంచాయతీ
హౌస్‌లో రేవంత్ గురించి జరిగినన్ని పంచాయితీలు ఎవరి గురించీ జరగవు. ఇవాళ్టి ఎపిసోడ్‌లో మరోసారి వేడి చర్చ జరిగింది. రేవంత్ కామెడీ ఓవర్ బోర్డ్ అవుతోందని హౌస్‌మేట్స్ కొందరు కంప్లయింట్ చేశారు. అందులో అర్జున్ కూడా ఉన్నాడు. నువ్వు నా ఫ్రెండ్‌వి కదా, అలా ఎలా అంటావ్, జోక్ చేయడం తప్పా అని రేవంత్ అంటున్నాడు. మనమొచ్చి మరీ ఎక్కువకాలం కూడా అవ్వలేదు, ఇంతలోనే అంతలా జోక్ చేయాల్సిన అవసరం లేదు అని అర్జున్ అంటున్నాడు. మాటా మాటా పెరిగింది. మాట్లాడుకోవడం కాస్తా పోట్లాడుకునే స్థాయికి వెళ్తూ ఉండటంతో రేవంత్‌ రయ్యిన లేచి వెళ్లిపోయాడు. అర్జున్‌ కూడా పెద్ద ఫీలవ్వకుండా లైట్ తీసుకున్నాడు. ఆ తర్వాత వాసంతి దగ్గర ఇదే టాపిక్‌ గురించి చర్చకు తెర తీశాడు రేవంత్. అలా మాట్లాడటం అందరికీ నచ్చదని, తాను కూడా ఓసారి బాధపడ్డానని ఆమె చెప్పింది. దాంతో నేను జోక్ చేసినప్పుడు అవతలివాళ్లు మాట్లాడకపోవడంతో వాళ్లు నాకు క్లోజ్ కనుక పాజిటివ్‌గా తీసుకుంటున్నారని అనుకున్నానని, అంతే తప్ప ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదని సంజాయిషీ ఇచ్చుకున్నాడు రేవంత్. ఎలిమినేషన్ల రోజు చేసిన కామెంట్‌కి ఇప్పటి వరకు అర్థాలు వెతుకుతూనే ఉన్న రేవంత్‌కి.. తన నోరు కాస్త కంట్రోల్ అయితే ఈ కష్టాలన్నీ తప్పుతాయని ఎప్పటికి అర్థమవుతుందో ఏమో.

చూస్తుంటే అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇవాళ్టి ఎపిసోడ్‌లో కూడా మనోడి ఫ్రస్ట్రేషన్‌ పీక్స్ లో ఉండబోతోందని ప్రోమోలో చూపించారు. పనులు చేసే విషయంలో అతనిలో ఏదో అసంతృప్తి తలెత్తినట్టు, వ్యతిరేకిస్తున్నట్టు, బాధపడుతున్నట్టు చూపించారు. వాటన్నింటి వెనుక కథేమిటో నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు.