ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై.. ఇంటి స్థలం కోసమే దాడి చేశాడా?

 ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై.. ఇంటి స్థలం కోసమే దాడి చేశాడా?
  • సెల్ఫీ తీసుకుంటానని పక్కకు చేరి కత్తితో కడుపులో పొడిచిన యువకుడు
  • సిద్దిపేట జిల్లా సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఘటన
  • ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్​కు తరలింపు
  • యశోద హాస్పిటల్​లో ఎంపీని పరామర్శించిన సీఎం కేసీఆర్
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఓ యూట్యూబ్​ చానల్​లో రిపోర్టర్​గా పనిచేస్తున్న ఘటని రాజు(38) అనే యువకుడు ఎంపీపై కత్తితో దాడి చేశాడు. ప్రభాకర్​రెడ్డి కడుపులో కత్తి దిగడంతో ఆయనను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లారు. జర్నలిస్టుల ఇంటి జాగ కోసం రెండు నెలలుగా ఎంపీ చుట్టూ తిరుగుతున్న రాజు, ఆయన నుంచి స్పందనలేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి వెళ్లారు. 

అక్కడ ప్రచారం ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం1.30 గంటలకు అక్కడే ఒక పాస్టర్ ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వచ్చారు. వాహనంలోకి ఎక్కే సమయంలో అక్కడికి చేరుకున్న రాజు సెల్ఫీ తీసుకుంటానని ఆయనకు దగ్గరగా వెళ్లాడు. కుడి చేతితో సెల్ఫీ తీసుకుంటూ ఎడమ చేతితో తన వద్ద ఉన్న కత్తితో ప్రభాకర్​రెడ్డి పొట్టలో పొడిచాడు. నొప్పితో ఎంపీ అమ్మా.. అని అరవగా, గన్ మెన్ గుర్తించి రాజు చేతిలోని కత్తిని లాక్కోగా ఆయనకూ స్వల్ప గాయమైంది. ఈ దాడిలో ఎంపీ ప్రభాకర్​రెడ్డి కడుపులో కుడిభాగంలో గాయమై రక్తం కారుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు వాహనంలో హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్లు ఫస్ట్​ఎయిడ్​ చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. హత్యాయత్నం చేసిన రాజును బీఆర్ఎస్ శ్రేణులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దాడి విషయం తెలియగానే మంత్రి హరీశ్​రావు ఎంపీ అనుచరులతో మాట్లాడి యశోద ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. దాడికి పాల్పడ్డ ఘటని రాజు మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన వాడుగా  గుర్తించారు. సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటని రాజుపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ మొదలుపెట్టామని చెప్పారు. 

ఇంటి స్థలం కోసమే దాడి చేశాడా?

ఓ యూట్యూబ్​ చానల్​లో రిపోర్టర్​గా పనిచేస్తున్న రాజు.. జర్నలిస్ట్ కోటాలో ఇంటి స్థలం దక్కకపోవడం, రెండు నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోకపోవడం వల్లే ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తనకు ఇంటి స్థలం కేటాయించాలని కొంత కాలంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కోరుతూ వస్తున్నాడు. ఎంపీ ఆధ్వర్యంలో మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 376లోని ఐదు ఎకరాల్లో 80 ప్లాట్లు చేసి పేదలకు ఇటీవల ఇండ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇందులో మండలానికి చెందిన13 మంది రిపోర్టర్లకు ఇండ్ల జాగాలు ఇవ్వగా, ఘటని రాజుకు మాత్రం కేటాయించలేదు. అధికారులను కలిస్తే ఎంపీతో ఫోన్ చేయించాలని సూచించారు. దీంతో  రెండు నెలలుగా ఇంటి స్థలం కోసం రాజు ఎంపీ చుట్టూ తిరుగుతున్నాడు. సోమవారం ఉదయం ఎంపీ స్వగ్రామమైన పోతారం వెళ్లి ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా కొందరు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కుటుంబంలో గొడవల కారణంగా రాజు కొంతకాలంగా భార్యకు దూరంగా పిల్లలతో కలిసి ఉంటున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు. దళిత బంధు రాకపోవడం, ఇంటి స్థలం దక్కకపోవడంతో  రాజు ఎంపీపై హత్యా యత్నం చేశాడని భావిస్తున్నారు. కాగా, మాజీ మంత్రి ముత్యం రెడ్డి మరణించే వరకు కాంగ్రెస్​ కార్యకర్తగా పనిచేసిన రాజు.. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీశ్​రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై  దాడిని నిరసిస్తూ దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఘటని రాజు బీజేపీకి చెందిన కార్యకర్త అని సోషల్​మీడియాలో ప్రచారం కావడంతో దుబ్బాకలో రాస్తారోకో నిర్వహించి, ఎమ్మెల్యే బీజెపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా కొద్ది సేపు దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దౌల్తాబాద్ మండలం సూరంపల్లితోపాటు భూంపల్లి, మిరుదొడ్డిల్లో రాస్తారోకో నిర్వహించగా మండల కేంద్రమైన తొగుటలో బీఆర్ఎస్ శ్రేణులు బంద్ పాటించాయి. ఎంపీపై దాడిని నిరసిస్తూ దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లో  మంగళవారం బంద్​కు బీఆర్ఎస్​ పిలుపునిచ్చింది.