
- బెంగళూరు సహా దక్షిణాది ప్రాంతాల్లో నిరసనలు
- ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
- 50 మందికిపైగా అరెస్టు
బెంగళూరు : కావేరీ నదీ జలాల వివాదంతో కర్నాటక అట్టుడికింది. అరెస్టులు, ఆందోళనల మధ్య శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగింది. దీంతో జన జీవనం స్తంభించింది. బెంగళూరు, ఇతర దక్షిణాది ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. స్కూళ్లు, కాలేజీలు, షాపులు, ఆఫీసులు, హోటళ్లు.. అన్నీ మూతబడ్డాయి. బెంగళూరు అర్బన్, మాండ్యా, మైసూరు, చామరాజనగర, రామనగర, హాసన్ జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, నిరసనలు, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో 50 మందికిపైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
కావేరీ బేసిన్ జిల్లాల్లో..
తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలంటూ కావేరీ జల నియంత్రణ కమిటీ ఇచ్చిన ఆదేశాలకు నిరసనగా ‘కన్నడ ఒక్కూట’ సంస్థ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదయం ఆరు నుంచే మొదలైన బంద్‌కు 1,900 కు పైగా అసోసియేషన్లు మద్దతు ఇచ్చాయి. కావేరీ బేసిన్ జిల్లాల్లో హోటళ్లు, విద్య, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. మైసూరులో బస్టాండ్ ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. చిక్కమంగళూరు, చిత్రదుర్గలలో ఆందోళనకారులు తమిళనాడు సీఎం స్టాలిన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
22 విమానాలు రద్దు
బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 22 విమానాలు, రావాల్సిన 22 విమానాలను రద్దు చేశారు. ఆపరేషనల్ కారణాల నేపథ్యంలో ప్రయాణికులకు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేశామని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. కేఎస్ఆర్‌టీసీ పరిమిత సంఖ్యలోనే బస్సులను నడిపింది. మైసూరు, మాండ్యా, చామరాజనగర తదితర జిల్లాల్లో చాలా వరకు బస్సులను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాశారు. బెంగళూరులోని ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు.
కన్నడ సినీ ఇండస్ట్రీ మద్దతు
రాష్ట్రవ్యాప్త బంద్‌కు కన్నడ సినీ పరిశ్రమ మద్దతు ఇచ్చింది. బెంగళూరులో జరిగిన ధర్నాలో నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు, టెక్నీషిన్లు పాల్గొన్నారు. సినీ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ పిలుపు మేరకు సాయంత్రం వరకు థియేటర్లను మూసివేశారు.
బంద్ అవసరం లేదు : శివకుమార్
కర్నాటక ప్రయోజనాలను తమ ప్రభుత్వం పరిరక్షిస్తున్నదని, రాష్ట్రంలో బంద్ అవసరమే లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ‘‘బంద్ సమయంలో ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతా శాంతియుతంగానే సాగింది. వాహనాలు తిరిగాయి. షాపులు యథావిధిగా తెరిచే ఉన్నాయి” అని చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ కూడా డీకే శివకుమార్ వద్దే ఉంది.
మావాళ్లను రిలీజ్ చేయండి : కుమార స్వామి
నిరసనల సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. కన్నడ కుటుంబం ఐక్యత.. పొరుగు రాష్ట్రానికి మేల్కొలుపు కావాలన్నారు. ‘‘కావేరి పోరాటానికి కర్నాటక మొత్తం స్పందిస్తున్నది. నేటి బంద్‌కు అన్ని వర్గాలు మద్దతిచ్చాయి” అని ట్వీట్ చేశారు. భూమి, భాష, నీటి విషయంలో ప్రతి ఒక్కరు ఏకం కావాలన్నారు.