Gouravelli: అర్థరాత్రి గుడాటిపల్లిని చుట్టుముట్టిన పోలీసులు

Gouravelli: అర్థరాత్రి గుడాటిపల్లిని చుట్టుముట్టిన పోలీసులు
  •     ఎక్కడికక్కడ   నిర్వాసితుల నిర్బంధం
  •     పహారా మధ్య కట్ట పనులు
  •     బాధితులు తిరగబడడంతో తోపులాట, పలువురికి గాయాలు

హుస్నాబాద్, వెలుగు: నిర్వాసితుల సమస్యలను పక్కనపెట్టి ప్రాజెక్టు పూర్తి చేయాలనే రాష్ట్ర సర్కార్ తీరుతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి మరోసారి వణికిపోయింది. గౌరవెల్లి ప్రాజెక్టులో మునిగిపోతున్న ఆ ఊరు పోలీసుల ముట్టడితో కన్నీళ్లుపెట్టింది. అర్ధరాత్రి వందలాది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి నిర్వాసితులను నిర్బంధించారు. 9 ఎక్స్​కవేటర్లతో హుస్నాబాద్ నుంచి రామవరం వెళ్లే రోడ్డులో బాటను మూసేస్తూ ప్రాజెక్టు కట్ట పనులను మొదలుపెట్టారు. ఆ దరిదాపుల్లోకి ఎవరినీ రానివ్వలేదు. భూములు కోల్పోయి, పరిహారం రాక, ఆందోళన చేస్తున్న నిర్వాసితుల కుటుంబాల ఆడ బిడ్డలను అరెస్టు చేశారు.

మమ్ముల్ని బొందవెట్టి నీళ్లు పారించుకోండ్రి

గుడాటిపల్లి, గౌరవెల్లి, మరో 6 తండాల నుంచి దాదాపు 120 మంది మహిళలు 4 నెలల నుంచి గుడాటిపల్లిలోని ప్రాజెక్టు కట్ట వద్ద ఆందోళన చేస్తున్నారు. భూములు కోల్పోయిన వారిలో ఇంకా కొంత మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రాలేదని, అధికారుల తప్పిదంతో గెజిట్‌‌లో కొందరి పేర్లు గల్లంతయ్యాయని, తమకు పరిహారం ఇవ్వాలని వారంతా కొట్లాడుతున్నారు. ఎంతోకాలంగా సమస్యలు చెప్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి గ్రామస్తులు నిద్రపోతున్న సమయంలో ఐదు బస్సులు, పోలీసు వాహనాల్లో గుడాటిపల్లి వచ్చిన వందలాది మంది పోలీసులు.. గ్రామాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. దీంతో శనివారం కట్ట పనులు జరుగుతున్న ప్రాంతంలో గ్రామస్తులు బైఠాయించారు. మంత్రి వచ్చి  సమస్యల పరిష్కారంపై హామీ ఇస్తేనే కదులుతామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూములు, ఇండ్లు పోయి గోసపడుతున్నమని, తాము దౌర్జన్యం చేస్తలేమని, చట్ట ప్రకారం తమకు రావాల్సిన పరిహారాన్ని అడుగుతున్నామని పోలీసులను వేడుకున్నారు. పరిహారం ఇవ్వాలని, లేకుంటే తమను ప్రాజెక్టుల బొందవెట్టి నీళ్లు పారించుకోండ్రని కన్నీళ్లుపెట్టుకున్నారు. అయినా పోలీసులు వినిపించుకోకుండా బలవంతంగా లాగేశారు. ఈ క్రమంలో బాధితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మహిళలకు గాయాలయ్యాయి. పెండ్యాల సౌజన్య చేతికి గాయం కావడంతో ఆమెను హుస్నాబాద్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆందోళన చేస్తున్న సుమారు 150 మందిని వాహనాల్లో కోహెడ, మద్దూరులోని స్టేషన్లకు తరలించి అరెస్టు చేసినట్లు సమాచారం. మిగతా వారిని చెదరగొట్టి పంపారు.

పెండ్లి అయి సెటిల్ అయినవాళ్లకు పరిహారమెలా వస్తది: ఆర్డీవో

గుడాటిపల్లి ఘటనపై హుస్నాబాద్ ఇన్​చార్జి ఆర్డీవో అనంతరెడ్డి ‘వెలుగు’తో మాట్లాడారు. పెండ్లి అయి వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన మహిళలు పరిహారం కోసం ఆందోళన చేస్తున్నారని, వాళ్లకు పరిహారం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. గెజిట్‌‌లో పేర్లు ఉన్న వాళ్లకు పరిహారం వచ్చిందని, గెజిట్‌‌లో పేర్లు లేనివాళ్లు పరిహారం కావాలని అడగడం సమంజసం కాదన్నారు. దాదాపు నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని, పెండింగ్​లో ఉన్నవాళ్లందరికీ పరిహారం ఇస్తున్నామన్నారు.

గుడాటిపల్లి సర్పంచ్ ఆమరణ నిరాహార దీక్ష

నిర్వాసితులను పోలీసులు అకారణంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుడాటిపల్లి సర్పంచ్ బద్ధం రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. పెండ్లి అయిన యువతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, మిగిలిన వారికి పరిహారం ఇవ్వాలని శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే.. సర్కార్ పోలీసులను పెట్టి దౌర్జన్యంగా అరెస్టు చేయించిందని అన్నారు. తామేమైనా నేరస్తులమా అని ప్రశ్నించారు. న్యాయం జరిగేదాకా పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోబోమని, పరిహారం ఇచ్చిన తర్వాతే ఆమరణ దీక్ష విరమిస్తామని సర్పంచితో పాటు నల్ల మహేందర్, సుంకరి అజయ్ అన్నారు.