రైతుబంధు ఇస్తలే బీమా అందట్లే.. కౌలు రైతుల గోడు 

రైతుబంధు ఇస్తలే బీమా అందట్లే.. కౌలు రైతుల గోడు 
  • రైతు స్వరాజ్య వేదిక పబ్లిక్‌‌ హియరింగ్‌‌లో కౌలు రైతుల గోడు 
  • పంట పండించుడు కంటే అమ్ముడే కష్టమైతున్నదని ఆవేదన 
  • కౌలు రైతులను సర్కార్ గుర్తించాలని వక్తల డిమాండ్ 
  • 22 లక్షల మంది కౌలు రైతులు ఏకం కావాలని పిలుపు  

హైదరాబాద్‌‌, వెలుగు:‘‘రాష్ట్రంలో పంట పండించడం కన్నా అమ్ముకునుడే కష్టమైతంది.. రైతు బీమా లేదు.. పెట్టుబడి సాయం రాదు.. పంట నష్టపోతే పరిహారమూ అందట్లేదు..’’ అంటూ కౌలు రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదమిచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా.. తమను కనీసం రైతులుగా కూడా గుర్తించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను అమ్ముకోవాలన్నా తిప్పలు పడాల్సివస్తోందని వాపోయారు. 


పంట నష్టపోయి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల మహిళలు కూడా తమ దుస్థితిని చెప్పుకుని విలపించారు. రైతు స్వరాజ్య వేదిక అధ్వర్యంలో మంగళవారం బషీర్‌‌బాగ్ ప్రెస్‌‌క్లబ్‌‌లో ‘కౌలు రైతుల సమస్యలపై పబ్లిక్ హియరింగ్’ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా15 జిల్లాల నుంచి వచ్చిన120 మంది కౌలు రైతులు సమావేశంలో తమ కష్టాలను చెప్పుకున్నారు. రైతు ఉద్యమ నేతలు ప్రొఫెసర్‌‌ యోగేంద్ర యాదవ్‌‌, కవిత కురుగంటి, సజయ, టి. గోపాల్‌‌రావు కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌‌ కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌‌, కొండల్‌‌ సంధానకర్తలుగా వ్యవహరించారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి వారు తెలుసుకున్నారు. 

కౌలు రైతులు ఇప్పుడే కొట్లాడాలె.. 

రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించాలని వక్తలు ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చిందని, కౌలు రైతులు గట్టిగా కొట్లాడితేనే కష్టాలు తీరతాయన్నారు. కౌలు రైతులంతా ఏకమై సంఘంగా ఏర్పడితేనే ప్రభుత్వం తలవంచొచ్చన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంటను అమ్ముకునే స్వేచ్చ ఉండాలని, పంట నష్టపోతే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. భూమి ఉన్నోళ్లే రైతు అనటం సరికాదని.. పొలంలో కష్టపడి పనిచేసే వాళ్లే నిజమైన రైతులని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన కౌలు రైతు చట్టం (2011) అమలు చేయాలని కోరారు. కౌలు రైతుల గుర్తింపు కార్డులకు విలువ లేకుండా పోయిందని, దీంతో పంట నష్టపోయినా, రైతు మరణించినా ఎలాంటి సాయం అందడంలేదన్నారు. బ్యాంక్ లోన్లు అందక ప్రైవేట్ అప్పులతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో విధిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌలు రైతులు సలాం సోమీ (ఆదిలాబాద్), కరువ మంజుల (వికారాబాద్), కొప్పుల అలివేలు (నల్లగొండ), సిలివేరి సదానందం( కరీంనగర్), నకిరేకంటి సైదులు (యోగి) (సూర్యాపేట) తదితరులు తమ కష్టాలు చెప్పుకున్నారు.   

సర్కార్ ఐదేండ్లకోసారి పాలిచ్చే ఆవు

సర్కారు ఐదేండ్లకు ఒక్కసారి పాలిచ్చే ఆవులాంటిది. తమను గుర్తిస్తేనే ఓటేస్తామని కౌలు రైతులు తెగేసి చెప్పాలి. కిసాన్‌‌ క్రెడిట్‌‌ కార్డులాగా ప్రతి కౌలు రైతుకు కార్డులు ఇవ్వాలి. సాగు చేసే నిజమైన రైతులకే ప్రభుత్వ పథకాలు అందాలి. పంట అమ్ముకుంటే కౌలురైతులకు వారి అకౌంట్ల లోనే పైసలు వేయాలి. కౌలురైతులను గుర్తించిన తర్వాతే అందరికీ రైతుబంధు వంటి పథకాలు అమలుచేయాలి.  
- ప్రొఫెసర్‌‌ యోగేంద్ర యాదవ్ 

ఓటును అమ్ముకోవద్దు

ఓటును అమ్ముకోబోమని కౌలు రైతులు తీర్మానాలు చేసుకోవాలి. ఎలక్షన్​కు ముందు బీర్లు, బిర్యానీ లు, పైసలు పంచుతారు. వాటన్నింటినీ తిరస్కరిస్తేనే మీ సమస్యలను గుర్తిస్తారు. ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వే చేసిన రాష్ట్ర సర్కారుకు కౌలురైతులు ఎంత మంది ఉన్నరు.. వారి కష్టాలేంటి అనేది సర్వే చేసి తెలుసుకునేందుకు సగం రోజు కూడా పట్టదు. రైతు స్వరాజ్యవేదికను ప్రభుత్వం చులకనగా చూడటం దారుణం.
- ఆర్‌‌ఎస్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌ 

ఒకటే యూరియా బస్తా ఇస్తున్నరు 

కౌలుకు చేస్తే ఒక్క గింజ మొలవలే. అప్పుల బాధ ఏగలేక నా భర్త రాజు 2019లో ఆత్మహత్య చేసుకు న్నడు. కౌలు రైతులకు కూడా బీమా అందించాలి. పాస్‌‌బుక్‌‌ పట్టుకొని పోతేనే కొంటున్నరు. పాస్‌‌బుక్‌‌ జిరాక్స్‌‌ ఇస్తేనే ఎకరానికి ఒకటే యూరియా బస్తా ఇస్తున్నరు. 
- మోతె మమత, రామన్న పేట గ్రామం   

పంటకు గిట్టుబాటు ధర ఇయ్యాలే 

30 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేసినం. నార్లు ముదిరిపోయి పంటలు బాగా రావడం లేదు. లేబర్‌‌ చార్జీలు పెరిగిపోయినయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి.  
- ఖాజా, కౌలు రైతు,
అనంతరాపురం, గద్వాల జిల్లా

అప్పు రాకుండా చేసిన్రు 

నేను 30 ఏండ్లుగా కౌలు చేస్తున్నా. ఈ యేడు 20 ఎకరాలు కౌలుకు పట్టిన. పత్తి, కంది పంటలు వేస్తున్నా. ఒక్క ఏడాది మాత్రమే కౌలు కార్డు ఇచ్చిన్రు. ఆ తర్వాత కార్డు గుంజుకున్నరు. అప్పు రాకుండా చేసిన్రు. పంట నష్టం వస్తే.. భూమి యజమానులకే పరిహారం పైలసు ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదు.  
- సలాం సూన్‌‌ జీ, ఆదివాసీ కౌలు రైతు, ఆదిలాబాద్‌‌ 

పెట్టిన పెట్టుబడి రాక  రెండేండ్ల కిందట పురుగుల మందు తాగి నా భర్త రవీందర్‌‌ (35) సచ్చిపోయిండు. సొంత భూమి లేదు. కౌలు రైతు అయినందుకు బీమా రాలేదు. ముగ్గురు పిల్లలున్నరు. నా భర్త చనిపోయినప్పుడు 3 లక్షలు అప్పు ఉంటే ఇప్పుడు 6 లక్షలు అయింది. కూలీ పనులు, కౌలు చేసి ఒక లక్ష అప్పు తీర్చిన. ప్రైవేటుకు అప్పులు తీసుకొని పంటలు వేస్తున్న. 
- కురువ మంజుల, తొండపల్లి గ్రామం, పరిగి మండలం, వికారాబాద్‌‌ జిల్లా