నాలుగో రోజూ ఆగని నిరసనలు

నాలుగో రోజూ ఆగని నిరసనలు
  • అనేక రాష్ట్రాల్లో కొనసాగిన ‘అగ్నిపథ్’ ఆందోళనలు 
  • బీహార్, యూపీలో రైల్వే స్టేషన్, పోలీస్ 
  • ఔట్ పోస్టులపై దాడి 
  • అనేక చోట్ల రోడ్లు బ్లాక్.. వెహికల్స్ ధ్వంసం

న్యూఢిల్లీ: అగ్నిపథ్ ఆందోళనలు శనివారం కూడా కొనసాగాయి. దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పలు చోట్ల రైల్వే స్టేషన్లపై దాడులు జరిగాయి. యూపీ, బీహార్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు.  

బీహార్, యూపీలో అదే సీన్   

బీహార్, యూపీలో నాలుగో రోజూ నిరసనలు జరిగాయి. పాట్నా సహా అనేక చోట్ల నిరసనకారులు రాళ్లదాడులకు పాల్పడ్డారు. తారేగణా రైల్వే స్టేషన్‌‌కు నిప్పు పెట్టారు. ఓ పోలీసు జీపును దహనం చేశారు. జర్నలిస్టులపై దాడులు చేశారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దానాపూర్​లో నిరసనకారులు అంబులెన్స్​లోని పేషెంట్, అటెండెంట్లతోపాటు తనపై దాడి చేశారని డ్రైవర్ చెప్పాడు. జహానాబాద్ జిల్లాలోని ఓ పోలీస్ ఔట్ పోస్ట్‌‌పై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. యూపీలోని జైన్ పూర్ లో పోలీసు జీపు, బస్సుకు నిప్పు పెట్టారు. జౌన్ పూర్- – ప్రయాగ్ రాజ్ హైవేపై వెహికల్స్​ను ధ్వంసం చేశారు. విధ్వంసానికి దిగిన వాళ్లపై గ్యాంగ్ స్టర్ యాక్ట్ ప్రయోగిస్తామని పోలీసులు చెప్పారు.   

ఒడిశాలో 60 కి.మీ. పరుగెత్తి నిరసన 

అగ్నిపథ్​ను రద్దు చేయాలంటూ ఒడిశాలో నిరసనలు కొనసాగాయి. నబరంగాపూర్ కు చెందిన నవీన్ బిశ్వాస్ అనే యువకుడు 60 కిలోమీటర్లు పరుగెత్తి నిరసన తెలిపాడు. తాను ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో ఇదివరకే ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యానని, రిటన్ టెస్ట్ రాయాల్సి ఉందన్నాడు. ఫిజికల్ టెస్టులు పాసైన అభ్యర్థులు బరంపూర్‌‌‌‌లో ధర్నా చేశారు.  

మిగతా రాష్ట్రాల్లో ఇలా.. 

పంజాబ్​లోని లూథియానా పోలీస్ స్టేషన్​ను నిరసనకారులు ధ్వంసం చేశారు. హర్యానాలో మహేంద్రగఢ్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన యువకులు వెహికల్స్ ను ధ్వంసం చేశారు. కేరళలో తిరువనంతపురం, కోజికోడ్​లో భారీ ర్యాలీలు నిర్వహించారు. కర్నాటకలోని ధార్వాడ్​లో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరసనల కారణంగా శనివారం 369 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.