
అగ్నిపథ్ స్కీమ్ ను రాత్రికి రాత్రి ప్రవేశపెట్టలేదని, దాని వెనుక ఎంతో మేధోమథనం, ఎన్నో సమావేశాలు, కమిటీల నివేదికలు దాగి ఉన్నాయని రక్షణశాఖ సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ను ప్రవేశపెట్టడానికి ముందు దానిపై త్రివిధ దళాలు 150, రక్షణ శాఖ 60, కేంద్ర ప్రభుత్వం 44 సమావేశాలు నిర్వహించి గంటల తరబడి మేధోమథనం చేశాయని చెప్పారు. మంగళవారం న్యూఢిల్లీలో త్రివిధ దళాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్నిపథ్ కోసం సైనికుల భర్తీ పద్ధతిలో ఎలాంటి మార్పూ ఉండదని, గతంలోలాగే ఇకపైనా భర్తీ జరుగుతుందని తేల్చి చెప్పారు. సైనిక రెజిమెంట్లలోనూ ఎలాంటి మార్పు ఉండదన్నారు. దేశ సైనిక అవసరాలకు అనుగుణంగా అగ్నిపథ్ ను తీసుకొచ్చామే తప్ప.. విదేశాలను కాపీ కొట్టలేదన్నారు. ‘ఇండియన్ ప్రాబ్లమ్స్.. ఇండియన్ సొల్యూషన్స్ అనే కోణంలోనే పనిచేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
దేశీయ అవసరాలను అధ్యయనం చేసి..
తొలుత దేశీయ అవసరాలను అధ్యయనం చేసి, చివరగా.. విదేశాల్లో సైనికుల భర్తీ, శిక్షణ ప్రక్రియలు ఎలా ఉన్నాయనే సమాచారాన్ని సేకరించి విశ్లేషించామని అనిల్ పురి వివరించారు. అమెరికాలో 17 ఏళ్లకు, బ్రిటన్ లో 16 ఏళ్లకు, చైనా, ఇజ్రాయెల్ లలో 18 ఏళ్లకు సైన్యంలోకి తీసుకుంటున్నారని చెప్పారు. భారత సైన్యంపై అధ్యయనం చేసిన ప్రభుత్వ కమిటీలన్నీ సైనికుల సగటు వయసు 30 ఏళ్లు ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నాయని అనిల్ పురి గుర్తు చేశారు. ఈనేపథ్యంలోనే అగ్నిపథ్ ద్వారా 17.5 నుంచి 21 ఏళ్లలోపు వారినే సైన్యంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అరుణ్ సింగ్ కమిటీ (1989), కార్గిల్ రివ్యూ కమిటీ (2000), జాతీయ భద్రతా వ్యవస్థపై కేంద్ర మంత్రుల బృందం (2001), 6వ పే కమిషన్ (2006), షెకాట్కర్ కమిటీ (2016) నివేదికల్లో సైన్యంలో యూత్ ఫుల్ నెస్ ఉండాలనే అంశం కూడా ఉందన్నారు. దాన్ని అనుసరించే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ కు శ్రీకారం చుట్టిందని అనిల్ పురి తెలిపారు.