అగ్రహారం గుట్టలు హాంఫట్

అగ్రహారం గుట్టలు హాంఫట్
  • అక్రమంగా మట్టి తరలింపు
  • ప్రభుత్వ భూమినే పట్టా చేసుకుంటున్న రియల్టర్లు

సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం గుట్టను కొంత మంది పట్టా చేసుకున్నరు. సర్వే నంబర్ 383/1/3 లో 20.27 ఎకరాలు,391/లో 18.37 ఎకరాలు ప్రభుత్వ భూమే అయినా.. బై నంబర్లతో దుప్పలి వంశీకృష్ణ, యాచమనేని చంద్రమోహన్ రావు, యాచమనేని సునీత, ఏనుగు ఆలియాస్ పీచర హరిప్రియ, ద్యావనపల్లి జయశ్రీల పేరుమీద 78.24 ఎకరాలు పట్టా భములున్నాయి. ఆ గుట్టను ఇప్పుడు కొల్లగొట్టి చదును చేస్తూ ప్లాట్లుగా మారుస్తున్నారు.  

గుట్టపై పట్టాభూములు

197  సీలింగ్ యాక్ట్ లో భాగంగా భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న  భూములను ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసి పట్టాలు కూడా ఇచ్చింది. యాభై ఏండ్ల కింద అగ్రహారం గుట్ట వద్ద నివసిస్తూ,  గుట్ట బండను కొట్టుకునే ఒడ్డరెలకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆ  సీలింగ్ భూమిని అమ్మడం, కొనటం నేరమైనా  కొంత మంది అధికారుల చేతివాటంతో కొనుగోలు చేశారు.  ఇప్పటికి అగ్రహారం గుట్ట మీదున్న భూముల్లో పట్టా భూమి ఎక్కడుందో,ప్రభుత్వ భూమి ఎక్కడుందో  క్లారిటి కనిపించడం లేదు.  సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత వేములవాడ, సిరిసిల్ల పట్టణాలు వేగంగా అభివృద్ధి  చెందుతున్నాయి. గుట్ట దగ్గర చీర్లవంచ ఆర్​అండ్ ఆర్ కాలనీ ఏర్పడింది. రోడ్డుకు  ఇరువైపులా ఇండ్లను కూడా కట్టుకుంటున్నారు. దీంతో  గుట్టను మొత్తం చదును చేస్తూ గుట్ట కింద భాగంలో ఉన్న  భూములను చేజిక్కించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.  ఈ భూములకు   పట్టాలు సృష్టించి అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు   జిల్లాలో అక్రమ మైనింగ్ కూడా  సాగుతోంది. గుట్టలను చదును చేసి మట్టి, మొరం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టరేట్ కు కూత వేటు దూరంలో  గుట్టను తవ్వుతున్నా   అధికారులు పట్టించుకోవడం లేదు.  నాంపల్లి గుట్టను కొల్ల గొట్టడం పై అధికారులకు ఫిర్యాదు లు అందినా.. అప్పడు  హడావుడి చేసి ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. 

అసైన్డ్ భూముల అమ్మకాలు

అగ్రహారం   వద్ద పలు సర్వేనంబర్లలో 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే 1977లో సీలింగ్ యాక్ట్  ద్వారా నాంపల్లి గుట్టను ఆనుకున్న  తెట్టకుంట ప్రాంత పేదలకు రెవెన్యూ శాఖ అధికారులు కేటాయించారు.  ఈ భూములను అమ్మడం కొనడం నేరమే అయినా గుట్టు చప్పుడు కాకుండా   కొందరు పట్టా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.  

ప్రభుత్వ భూమిని కాపాడుతాం

అగ్రహారం గుట్ట పై ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడుతాం. గుట్టపై సర్కార్​ భూమి ఉంది. కలెక్టర్ ఆదేశాలతో  ఇటీవలే సర్వే చేశాం. సర్వే వివరాలను  కలెక్టర్ కు అందజేశాం. నివేదిక సమర్పించాం.ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తాం.–రాజు, తహసీల్దార్​,  వేములవాడ అర్బన్