వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు!.. మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్​

వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు!.. మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్​
  • మార్కెట్​ పాలక వర్గాలు, అధికారులతో కుమ్మక్కు
  • యార్డ్​లకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్​
  • తప్ప, తాలు, తేమ, డిమాండ్​ తగ్గిందనే సాకులు
  • పంటలేవైనా దళారులు చెప్పిందే రేటు
  • వడ్లు,  మక్కలు, మిర్చి, పల్లి అన్నింటిదీ అదే పరిస్థితి
  • దోపిడీకి గురవుతున్న అన్నదాతలు

హైదరాబాద్/నెట్​వర్క్​​, వెలుగు: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లను మిల్లర్లు, దళారులు, అడ్తిదారులు శాసిస్తున్నారు. మార్కెట్​కమిటీల పాలకవర్గాలను, అధికారులను మచ్చిక చేసుకొని రైతులను దోపిడీ చేస్తున్నారు. పంట కొనుగోళ్ల సీజన్​ ప్రారంభం కాగానే రంగంలోకి దిగే  ట్రేడర్లు, కమీషన్​ ఏజెంట్లు.. మద్దతుధర, వీలైతే అంతకంటే ఎక్కువ రేటు పెట్టి రైతులను ఆకట్టుకుంటున్నారు.

తీరా పంట మార్కెట్​కు పోటెత్తాక  రేట్లను అమాంతం తగ్గిస్తున్నారు. వ్యాపారుల దోపిడీని గుర్తిస్తున్న రైతులు ధర వచ్చేదాకా దాచుకుందామని పోతే అప్పటికే కోల్డ్​ స్టోరేజీలను, గోడౌన్లను కబ్జా పెడ్తున్నారు.  దీంతో మార్కెట్​కు వ్యయప్రయాసలతో దిగుబడులను తీసుకువచ్చే రైతులు తిరిగి వెనక్కి తీసుకెళ్లలేక అగ్గువసగ్గువకు అమ్ముకొని నిండా మునుగుతున్నారు.  వడ్లు , మక్కలు, మిర్చి, పల్లి, పసుపు, పత్తి.. ఇలా పంటలేవైనా రాష్ట్రంలో దళారులు పెట్టిందే రేటు అన్నట్లుగా పరిస్థితి ఉంది.  

గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల సపోర్ట్​తో వ్యాపారులు ఆడింది ఆట.. పాడింది పాటగా తయారైంది. తాజాగా, అక్రమార్కులపై కొత్త సర్కారు  కొరడా ఝులిపిస్తుండడంతో పలువురు ట్రేడర్లు మార్కెట్లలో కొనుగోళ్లను బంద్​పెట్టి బ్లాక్​ మెయిల్​కు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చట్టాలకు మరింత పదునుపెట్టి వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్​ వ్యక్తమవుతోంది.  

మాఫియాలా మారిన మిల్లర్లు.. 

గత బీఆర్ఎస్​హయాంలో ప్రజాప్రతినిధులతో అంటకాగిన మెజారిటీ మిల్లర్లు మాఫియాలా మారారు. కస్టమ్​మిల్లింగ్​రైస్​ కోసం సర్కారు కేటాయించే లక్షల టన్నుల  ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. ఇది చాలదన్నట్టు కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను సర్కారు కొనకపోవడం మిల్లర్లకు వరంగా మారింది. ప్రస్తుతం ఈ సీజన్​లో కేంద్రం ఏ గ్రేడ్ వడ్లకు 2,203, కామన్ రకానికి 2,183 మద్దతు ధర ప్రకటించింది.

మార్కెట్​లో సన్నవడ్లకు కొరత ఉండడంతో మిల్లర్లు రంగంలోకి దిగి, సీజన్​ ప్రారంభంలో క్వింటాల్​కు రూ.2,600 దాకా పెట్టారు. వారం, పది రోజుల్లో మార్కెట్​కు వడ్లు పోటెత్తగానే ఏకంగా రూ.400 నుంచి రూ.600 దాకా తగ్గించి, ప్రస్తుతం  రూ.2200 నుంచి రూ.2వేల దాకా కొంటున్నారు. బయట బియ్యాన్ని మాత్రం క్వింటాల్​కు రూ.6 వేల నుంచి రూ.7,500 దాకా అమ్ముకొని కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు. బీఆర్ఎస్​హయాంలో మిల్లుల పై విజిలెన్స్ తనిఖీలు బంద్​పెట్టడం,  ట్రేడింగ్ లైసెన్స్ ఎత్తేయడం, వడ్ల నిల్వ పెట్టుకొనే కెపాసిటీపై ఉన్న  ఆంక్షలు ఎత్తేయడమే మిల్లర్ల దోపిడీకి కారణమనే అభిప్రాయాలున్నాయి. మిల్లర్లపై గత బీఆర్ఎస్​ సర్కారు ఉదాసీనత వల్ల నేడు అటు రైతులతోపాటు ఇటు వినియోగదారులు కూడా మునుగుతున్నారు. 

మిర్చికి రేటు పెట్టరు.. దాచుకోనియ్యరు.. 

వరంగల్‍ , ఖమ్మం మిర్చి మార్కెట్లలో వ్యాపారులు, ఆడ్తిదారులు ఒక్కటై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మిర్చి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్‍ లేదని చెప్తూ గడిచిన రెండు నెలలుగా రేటు తగ్గిస్తున్నారు. కనీసం పంటను కొన్ని నెలలపాటు దాచుకుందామని వెళ్తున్న రైతులకు కోల్డ్ స్టోరేజీలు కూడా దొరకనివ్వకుండా బ్లాక్​ చేస్తున్నారు. మార్కెట్లలో ఉదయం పెట్టే జెండా పాటకు.. రైతులకు కట్టించే ధరకు ఏకంగా రూ.10 వేల తేడా ఉంటోంది.  

ఉదాహరణకు.. చపాట రకాని (దొడ్డు మిర్చి)కి ఎనుమాముల మార్కెట్లో సగటున రూ.27వేల నుంచి రూ. 28 వేల జెండా పాట పెడుతున్నారు. తీరా అడ్తిదారులు రైతుల నుంచి కొనుగోలు చేసే సమయంలో క్వాలిటీ లేదనే సాకుతో క్వింటాల్‍ చపాట మిర్చికి కేవలం రూ.14  వేల నుంచి రూ.15 వేలు మాత్రమే కట్టిస్తున్నారు. ఇదే చపాట రకానికి నాగ్​పూర్​ మార్కెట్​లో రూ.26 వేలు పెడ్తున్నారని తెలిసిన ఇక్కడి రైతులు.. కొద్దిరోజులుగా పంట అమ్ముకునేందుకు అక్కడిదాకా వెళ్లడాన్ని బట్టి ఇక్కడి మన వ్యాపారుల దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ఆయా మార్కెట్లలో రైతులు ఆందోళనకు దిగుతున్నా న్యాయం జరగడం లేదు.  గత నెలలో ఖమ్మం మార్కెట్​లో రూ.19 వేలు జెండా పాటగా నిర్ణయించి, 13 వేలకు కొనడాన్ని  తట్టుకోలేక పలువురు రైతులు ఖమ్మం మార్కెట్ యార్డులో బైఠాయించారు. మూడు నాలుగు గంటల ఆందోళన తర్వాత అధికారులు, వ్యాపారులతో చర్చలు జరిపి మళ్లీ కొనుగోళ్లు జరిపించారు. ఇది జరిగి రెండు రోజులు గడవకముందే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో పల్లి రైతులు విలవిల 

పల్లి రైతులు ప్రతిసారి ట్రేడర్లు, కమీషన్​ ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. మన రాష్ట్రంలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​నగర్​జిల్లాల్లో పల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉమ్మడి పాలమూరులో గత వానకాలం 3.80 లక్షల ఎకరాల్లో పల్లి సాగైంది. డిసెంబరు చివరి వారం నుంచి పంట మార్కెట్​కు రాగా,  మొదట ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ రూ.6,377 కంటే ఎక్కువ  రూ.8,300 నుంచి రూ.9,200 వరకు చెల్లించారు.  మార్కెట్​లోకి పల్లి రావడం పెరగ్గానే వ్యూహం ప్రకారం ధర తగ్గించారు. జనవరి రెండో వారం తర్వాత  రేట్లు డౌన్ చేస్తూ వచ్చారు.

రోజూ క్వింటాల్​కు రూ.100 నుంచి రూ.300 వరకు తగ్గిస్తూ ఫైనల్​గా మేలు రకం పల్లికి రూ.5 వేల కు తెచ్చి రైతులను మోసం చేశారు.  దీనికితోడు పంటను మార్కెట్​కు తెస్తే అన్ని ఖర్చులు రైతులే భరించాల్సి వస్తోంది. కాంటాల సమయంలో హమాలీలు, చాట కూలీలకు కలిపి రూ.2 వేల వరకు ఇవ్వాల్సి వస్తోంది. వేరుశనగను కుప్పలుగా పోసినందుకు ఆ స్థానానికి అద్దె కింద కుప్పకు రూ.250 నుంచి రూ.300 వరకు మార్కెట్​కు కడుతున్నారు. కాంటా జోకేటోళ్లకు సంచికి రూ.5, ట్రేడర్ల నుంచి గోనె సంచులను తీసుకున్నందుకు ఒకదానికి అద్దె కింద రూ.6  కడుతున్నారు. ఇవి కాకుండా కమీషన్ ఏజెంట్​కు నూటికి రూ.5 చొప్పున చెల్లిస్తున్నారు.  

మామిడి రూ.40వేలకు డమాల్ 

మామిడి మార్కెట్​లోనూ దళారుల రాజ్యం నడుస్తోంది. నెల కిందే మామిడి సీజన్ మొదలు కాగా,​హైదరాబాద్​ బాట సింగారం మార్కెట్​లో టన్నుకు  రూ.70 వేల నుంచి 90 వేలకు పైగా రేటు పెట్టిన వ్యాపారులు ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో గిట్టుబాటు కాక మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన జగిత్యాల చల్​గల్ మ్యాంగో మార్కెట్​లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నెల 15  నుంచి మార్కెట్​లో మామిడి కోనుగోళ్లు మొదలు కాగా, మొదట్లో క్వింటాల్​కు రూ. 5,500 నుంచి రూ. 6,500  దాకా పెట్టిన కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ. 4 వేలు కూడా పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్​​జిల్లాలకు చెందిన రైతులు  మహారాష్ట్రలోని నాగ్​పూర్​కు పంటను తీసుకెళ్తున్నారు.

పసుపునూ వదల్లే.. 

ఈ సీజన్​లో రూ.20 వేల దాకా పలికిన పసుపు రేటు వ్యాపారుల మాయాజాలంతో క్రమంగా తగ్గిపోతోంది. పసుపు మార్కెట్​కు కేరాఫ్​గా చెప్పుకునే నిజామాబాద్​ గంజ్​లో బుధవారం క్వింటాల్ పసుపు రేట్ రూ.13 వేలు పలకగా, సేమ్​ టైం మహారాష్ట్ర సాంగ్లీలో మాత్రం రూ.16,500 ధర ఉన్నది. నెల కింద ఊహించని రీతిలో సాంగ్లీలో రూ.20 వేలకు మించి రేట్ చెల్లించినా మన దగ్గర మాత్రం ఆ ధర పెట్టలేదు. పైగా నిజామాబాద్, మెట్​పల్లి లాంటి మార్కెట్లలో  పసుపు కొనే ట్రేడర్లు 2 శాతం కమీషన్​తో పాటు తక్షణ బిల్ పేమెంట్​ పేరుతో ఒకటిన్నర శాతం కోత పెడ్తారు. మహారాష్ట్ర లోని సాంగ్లీలో అసలు కమీషన్, కటింగ్ లేదు. దీంతో ఈ సీజన్​లో చాలా మంది రైతులు మహారాష్ట్రలోని సాంగ్లికి వెళ్లి  పసుపు అమ్ముకుంటున్నారు.

రూ. 8,500 ధర అంటే పోయిన.. రూ. 6,100లే పెట్టిన్రు.. 

నాకున్న ఆరు ఎకరాల్లో పల్లి వేసిన. దాదాపు రూ.3.20 లక్షల దాకా పెట్టుబడి పెట్టిన. 57 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ.8,500 ధర పెడ్తన్రని చెప్తే నిజమే అనుకొన్న. పంటను తీసుకొని పాలమూరు మార్కెట్​కు పోతే క్వింటాల్​కు రూ.6.100 మాత్రమే చెల్లించిన్రు. మొత్తం లాస్ అయిన. పల్లి విత్తనాలు కొనేటప్పుడు వాళ్లు చెప్పినంతకు ఒక్క రూపాయి దిగలే. కానీ, పంట అమ్ముకునేటప్పుడు రేటు తగ్గించి మోసం చేసిన్రు. ఇంత అన్యాయం ఉంటదా?
- ఎం.లక్ష్మీ, అమ్మాపూర్ గ్రామం, చిన్నచింతకుంట, మహబూబ్​నగర్​ జిల్లా

ఇక్కడ తక్కువ.. నాగ్​పూర్​లో ఎక్కువ.. 

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వ్యాపారులు మిర్చి రైతులను నిలువునా ముంచుతున్రు. డిమాండ్ తగ్గిందని, క్వాలిటీ లేదని రేటు తగ్గించిన్రు. జెండా పాట  రూ.21 వేలు ఉంటే రూ.14 వేలే కట్టిస్తున్రు.  దాసుకుందా మంటే  కోల్డ్ స్టోరేజీలు ఖాళీ లేవంటున్నరు. నాగ్​పూర్​కు కొంటపోతే క్వింటాల్​కు రూ.26 వేలు ఇస్తున్నరు. ఇక్కడ సాధ్యం కానిది.. అక్కడ ఎట్లా సాధ్యమైతది! వ్యాపారులు, అధికారుల దగ్గరే మోసమున్నది.
- రాజమల్లు, 
దుగ్గొండి, గోపాలపురం, వరంగల్

ఒకదశలో క్వింటాల్ 14 వేల దాకా పలికిన  పత్తి .. ఈ సీజన్​లో పంట దిగుబడులు మార్కెట్​కు పోటెత్తగానే రూ.7 వేలకు పడిపోయింది. సీసీఐ అధికారులు తేమ పేరుతో కొర్రీలు పెట్టగానే  వ్యాపారులు సిండికేటయ్యి రేటు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజల రేట్లు పడిపోయాయనే సాకులు చెప్పి అడ్డికి పావుశేరు కొన్నారు. మహబూబ్​నగర్​, ఆదిలాబాద్ ​లాంటి జిల్లాల్లో నైతే  క్వింటాకు  రూ.6,500 రేటు పెట్టారు. 

ఇటీవల వరంగల్​లోని ఎనుమాముల మార్కెట్​కు మిర్చి పోటెత్తింది. ఉదయం కుప్పల దగ్గరికి వచ్చిన వ్యాపారులు చపాట రకం మిర్చికి  రూ.28 వేల జెండా పాట పెట్టి, రెండు మూడు కుప్పలు కొని వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన అడ్తిదారులు కుప్పల చుట్టూ తిరిగి క్వాలిటీ లేదని పెదవి విరిచి  రూ.14 వేలకు ఇవ్వాలని అడిగారు. ఒప్పుకోని రైతులు కోల్డ్​స్టోరేజెస్​లో దాచుకుందామని వెళ్తే వాటిని వ్యాపారులు అప్పటికే బ్లాక్​చేసి పెట్టుకున్నారు.