
క్షయ లేదా టీబీ ప్రమాదకరమైనది. ప్రధానంగా ఊపిరితిత్తులకు వచ్చే టీబీ అంటువ్యాధి ‘మైకోబ్యాక్టీరియమ్ ట్యుబర్‌క్యులోసిస్’ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన రోగులు దగ్గడం, తుమ్మడంలాంటివి చేసినపుడు సమీపంలో ఉన్న ఇతరులకు సోకుతుంది. చికిత్సలో భాగంగా నాలుగు- రకాల యాంటీ బ్యాక్టీరియల్ మందుల కలయికతో టీబీని నయం చేస్తారు.
ఇలాంటి ట్యుబర్‌క్యులోసిస్ లేదా టీబీ వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స, కట్టడికి భవిష్యత్తు ప్రణాళికలలాంటి అంశాలను అధ్యయనం చేసి 29 అక్టోబర్ 2024న ఐరాస- డబ్ల్యూహెచ్ఓ సంస్థ ‘గ్లోబల్ టిబి రిపోర్ట్- 2024’ను జెనీవాలో విడుదల చేసింది. టీబీ వ్యాధి భారం భారత్‌లో క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టం అవుతున్నప్పటికీ ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో టీబీ కేసులు అత్యధికంగా నమోదుకావడం కొంత కలవరపరిచే అంశం.
ప్రపంచ క్షయవ్యాధి లేదా ట్యుబర్‌క్యులోసిస్ (టీబీ) కేసుల్లో అత్యధిక సంఖ్యలో 26 శాతం వరకు భారత్‌లోనే ఉన్నాయని, 55.9 శాతం ప్రపంచ టీబీ కేసులు కేవలం ఐదు దేశాల్లోనే నమోదు అవుతున్నాయని తాజాగా డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక 2024 (గ్లోబల్ టిబి రిపోర్ట్ - 2024)’ స్పష్టం చేస్తున్నది.
భారత్‌లో 26 శాతం, ఇండోనేషియాలో 10 శాతం, చైనాలో 6.8 శాతం, ఫిలిప్పీన్స్‌లో 6.8 శాతం, పాకిస్తాన్‌లో 6.3 శాతం టీబీ కేసులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’తో పాటు ‘నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్’, ‘మల్టీ-డ్రగ్- రెసిస్టెన్ట్ టీబీ(ఎండిఆర్-టిబి)’ కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా టీబీ కేసులు తగ్గడం లేదా చికిత్స అందుబాటులోకి రావడం గమనించారు.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి-