
దేశంలోని 4,130కుపైగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒక్క మహదేవపుర అసెంబ్లీ స్థానంలో చోటు చేసుకున్న ఓటర్ల జాబితా అక్రమాలను చూసిన తర్వాత..మన ఓటరు జాబితాలు తప్పుల తడకలా? లేక దొంగ ఓటర్ల పనా? అవన్నీ దొంగ ఓట్లే అని దేశ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కుండ బద్దలు కొట్టినట్టు బయటపెట్టారు. ఆ తర్వాత అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల వ్యవస్థను పర్యవేక్షిస్తున్న రాజ్యాంగబద్ధసంస్థ స్పందన చూస్తే వారికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదనే అనిపిస్తున్నది.
నాడు 19వ శతాబ్దం మొదటి దశకంలో మింటో మార్లే సంస్కరణలతో వలసవాదులకు దేశంలో తొలిసారి ఓటుహక్కు కల్పించినా.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో కాకుండా తమకు వందిమాగధులుగా ఉండే భూస్వాములకు, తమకు జీహుజూర్ అనే వ్యాపారులకు కల్పించి యావత్ ప్రపంచానికి మాత్రం మేం భారతీయులకు మంచి చేస్తున్నాం అని చెప్పుకున్నారు నాటి బ్రిటీషర్లు. ఇపుడు దేశాన్నేలుతున్న పార్టీ ప్రభావంలో ఈసీ పనిచేస్తున్నదని రాహుల్‌గాంధీ చేసిన గంభీరమైన ఆరోపణ అందరినీ ఆలోచింపజేస్తున్నది.
ప్రజాస్వామికవాదుల్లో నిర్వేదం
బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానంలో 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 32,707 ఓట్ల మెజారిటీతో గెలిచిన తీరును రాహుల్ ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఆ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆరింట్లో కాంగ్రెస్ ఆధిక్యతను సాధించింది. అదీ ఏదో అరకొరగా కాదు ఏకంగా 82వేల పైచిలుకు మెజారిటీ. కానీ, ఒక్క మహదేవపురలో మాత్రం బీజేపీ వెయ్యి కాదు పదివేలు కాదు ఏకంగా 1,14,046 ఓట్ల మెజారిటీ సాధించడం ఎలా సాధ్యమైంది? దీన్ని రాహుల్ గాంధీ సవివరంగా సాక్ష్యాలను బయటపెడుతుంటే ఆశ్చర్యపోవడం యావత్ ప్రజాస్వామికవాదుల వంతయింది.
మహదేవపురలోని మొత్తం ఆరున్నర లక్షల మంది ఓటర్లలో ఏకంగా లక్షపైచిలుకు తప్పుడు ఓట్లు నమోదయ్యాయి. అందులోనూ ఓ సింగిల్ బెడ్రూం ఇంట్లో 80 ఓట్లు, ఒకే గదిలో 46 ఓట్లు ఇలా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా బల్క్ ఓటర్లు 10,452 మంది ఉన్నారు. ఇలా కనీసం ఎక్కడున్నారో చెప్పలేని ఇంటి గుర్తుల చిరునామాలతో 40,009 ఓట్లు. ఒకే వ్యక్తికి మూడు నాలుగు చోట్ల ఓటుహక్కుతో 11,965 డూప్లికేట్ ఓట్లు, ఫొటో గుర్తుపట్టలేనివిధంగా 4,132 ఓట్లు, కొత్తవారితోపాటు లిస్టులో పేరు చేర్చేందుకు ఉపయోగించే ఫారం 6ను దుర్వినియోగపర్చినవి 33,692 ఓట్లు ఉన్నట్టు అంకెలతో సహా సాక్ష్యాధారాలను జాతి ముందుంచారు రాహుల్ గాంధీ. ఈ గణాంకాలు చూస్తే... బెంగళూరు సెంట్రల్లో బీజేపీని గెలిపించింది ప్రజలేనా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది!
ఈసీ నిబద్ధతపై అనుమానాలు!
సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్ష నేత చెప్పినా..భారత ఎన్నికల సంఘం మాత్రం రాహుల్ గాంధీపై ఒక రాజకీయ పార్టీలా అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది. సుమోటోగా తీసుకోవాల్సింది పోయి, లిఖిత పూర్వక ఫిర్యాదుతోపాటు ఆధారాల్ని సమర్పించమంటుంది. ఇక్కడే ఈసీ నిబద్ధతపై దేశ పౌరుల్లో అనుమానాలు కలిగిస్తాయి. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో ఉన్న సర్వ స్వతంత్రత ఎంత బలమైనదో టీఎన్ శేషన్ వంటి అధికారులు నిరూపించారు. ఇప్పటి ఈసీ మాత్రం ఫిర్యాదుదారుడినే ఆధారాలు సమర్పించమని ఎదురు ప్రశ్నించడంలోని ఔచిత్యం ప్రజలకు అర్థంకాని విషయంగా మారింది. ఇక దర్యాప్తు చేయాల్సిన సంస్థే బీజేపీ చేస్తున్న ఆరోపణలకు దగ్గరగా మాట్లాడటం.. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎన్నికల్లో ఈ రెండింటి మధ్య బంధంపై ప్రజలకు ఆనుమానాలు కలిగించే అవకాశం ఉంటుంది.
ఎన్నికల సంస్కరణలు
1951 మొదటి ఎన్నికల నుంచి ఇప్పటివరకూ ఎన్నో సంస్కరణలు జరిగాయి. 1989లో ఓటు హక్కును 18 ఏండ్లు నిండినవారికి ఇవ్వడం మొదలు 1990లో ఓటరు గుర్తింపు కార్డుల పరిచయం, 2009లో ఈవీఎం మిషన్ల ప్రవేశం, 2019లో వీవీ స్లిప్పులు వంటివి జరిగాయి. చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లను ప్రధాని, ప్రతిపక్షనేత, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కూడిన కమిటీ ఎన్నుకునేది. కానీ, మోదీ ప్రభుత్వం 2023లో సీజేఐ స్థానంలో కేబినెట్ మంత్రిని తీసుకొచ్చి ఈసీ సభ్యుల పారదర్శకత ఎన్నిక ప్రక్రియకు పాతరేసింది.
నకిలీ చిరునామాలతో, ఫొటోలతో, ఆధార్లతో ఓటుహక్కును ఎలా పొందగలుగుతున్నారు? ఇలా ఓటర్ల జాబితాలన్నీ తప్పులతడకలుగా మారితే, ప్రజాతీర్పులకు ఉన్న విలువేమిటి అనే నైతిక ప్రశ్న కు జవాబుదారీగా ఉండాల్సింది మన ఎన్నికల సంఘమే. కాబట్టి రాహుల్ గాంధీ లేవనెత్తిన అన్ని రకాల అనుమానాలకు ఈసీ సమాధానాలు ఇవ్వాలి తప్ప దాటవేయకూడదు.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీఈవో, టిసాట్ నెట్వర్క్-