
హైదరాబాద్ నగర ప్రజలు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా కేంద్రీకృత అభివృద్ధిని, హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తరుణంలో ప్రస్తుత సమస్యలకు ఒక బృహత్ ప్రణాళికతో పరిష్కారం చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే, బృహత్ ప్రణాళికల పూర్వ తయారీ పద్ధతులు, దాని ఉద్దేశాలు, ప్రస్తుత పాలకుల ఆలోచనలు నిరాశాజనకంగా ఉన్నాయి.
హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికల చరిత్ర నుంచి పాలకులు పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇదివరకు ఉన్న దాదాపు 7 వివిధ ప్రాంతీయ (నగరంలోనే) ప్రణాళికలను కలిపి కొత్త మాస్టర్ ప్లాన్ తయారుచేస్తున్నామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఎ) ఉన్నతాధికారులు గత కొన్ని ఏండ్ల నుంచి ప్రకటిస్తున్నారు. ఇప్పటికీ అది తయారుకాలేదు. ఎందుకు అనేది మనం లోతుల్లోకి వెళితే కాని అర్థంకాదు.
అసలు నగర ప్రణాళికల తయారీలో అంతర్గత లోపాలు అనేకం ఉన్నాయి. వాటిని గుర్తించి, సరిదిద్దే ప్రయత్నం కూడా జరగటం లేదు. మ్యాపుల మీద ప్రణాళికలు తయారుచేస్తూ బృహత్ ప్రణాళికలకు కీలకమైన విధానాలు, ప్రాజెక్టులు, వాటి మధ్య అనుసంధానం వంటి అంశాలను విస్మరిస్తూ, రియల్ ఎస్టేట్ ‘అభివృద్ధి’ మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఇంకొక రెండు దశాబ్దాలకు సరిపడా ఆదాయం ప్రభుత్వానికి, హెచ్ఎండీఏకు, జీహెచ్ఎంసీకు సమకూర్చేపని ముందట పెట్టుకున్నది.
కొరవడిన దూరదృష్టి
2012లో తయారుచేసి ప్రస్తుతం అమలులో ఉన్న బృహత్ ప్రణాళికతో సంబంధం లేకుండా గత 11 ఏండ్లలో దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు నగరాభివృద్ధికి సాధించామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం.. పెరుగుతున్న నగర సమస్యలను, పరిష్కార ప్రణాళికలను, ప్రాజెక్టులను సమీకృత దృష్టితో చూడడం లేదు. దూరదృష్టి కొరవడింది.
సామాన్యుల గురించి ఆలోచించడమే లేదు. విదేశీ నగరాలను సందర్శించి, అక్కడి వసతులను, జీవనాన్ని చూసి ఆకర్షితులై తిరిగివచ్చి అవే ఇక్కడ చేద్దామని తలచి భంగపడిన పాలకులకు ఏనాడూ కొదవలేదు. నగర పౌరుల వసతికి, సుఖమయమైన జీవనం కొనసాగింపుకు ఏర్పాటు చేసిన సంస్థలు అప్పులు, అవినీతి తదితర సమస్యలతో నిర్వీర్యం అవుతుంటే వాటిని ప్రక్షాళన చేయకుండా, తగిన రాజకీయ ప్రక్రియ చేపట్టకుండా అనేక రూపాలలో ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
గతంలో హైదరాబాద్ నగరం చుట్టూ కొన్ని శివారు ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికలు తయారుచేశారు. 2012లో చేసినది విస్తృతి పరంగా అతి పెద్దది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరించి, ఆ విస్తరించిన పరిధికి ఒక మహా ప్రణాళిక తయారు చేసినప్పుడు కూడా వివిధ ప్రాంతీయ ప్రణాళికలను దానికి అనుసంధానం చేయలేదు. కనీసం సమీక్షించలేదు. విశ్లేషణ చేయలేదు. హైదరాబాద్ నగరంలో సమస్యలు అలాగే ఉన్నాయి. ఇంకా జటిలం అయ్యాయి.
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ సంకుచితం!
హైదరాబాద్ నగర పాలక సంస్థకు మహా నగర ప్రణాళికకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నది. ఎప్పుడో తయారుచేసిన హైదరాబాద్ నగర ప్రణాళిక 2012లో కూడా ఆలోచించలేదు. దాని చుట్టూ ఉన్న భూమికి సంబంధించి ప్రణాళిక చేసిందే తప్పితే నగరంలో సమస్యల పరిష్కారానికి తగిన ఆలోచన ఆనాడు చేయలేదు. ఈనాడు కూడా చేస్తున్నట్టు లేదు. నగర ప్రణాళిక నగరంలో అభివృద్ధిని నిర్వచిస్తూ, సమస్యలకు తగిన పరిష్కారాలను చేపట్టాల్సి ఉండగా మాస్టర్ ప్లాన్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదు.
దీనికి ప్రధాన కారణం రెండు సంస్థలు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తమ పరిధిలోనే సంకుచితంగా పనిచేయడం, అనుసంధానం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించకపోవటం. మహా నగర ప్రణాళిక తయారీలో పాటించాల్సిన విధి విధానాలు కూడా పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రణాళికలను తయారు చేయడానికి మార్గదర్శకాలు ఇచ్చినా వాటిని పట్టించుకోవడం లేదు.
మహా నగర ప్రణాళిక టెండర్ ప్రక్రియ ద్వారా ఏదో ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెబుతున్నారు. సాధారణంగా ఇవి స్థానికేతర సంస్థలు. వీరికి హైదరాబాద్ నగరం గురించి లేశమాత్రమైన అవగాహన ఉండదు. అర్బన్ డిజైన్ మీద అవగాహన ఉన్నవారికి పని కల్పిస్తే ‘స్థానిక’ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మహా నగర ప్రణాళిక ఉండే అవకాశం ఉన్నది.
ఉపగ్రహ చిత్రాల ద్వారా ప్రణాళిక
హైదరాబాద్ నగరం మొదట 1995 నాటి మాస్టర్ ప్లానులో 179 చదరపు కిలోమీటర్లు ఉండగా తరువాత విస్తరించి 625 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి గ్రేటర్ హైదరాబాద్ పేరిట మాస్టర్ ప్లాన్ తయారయ్యింది. అయితే, ఇందులో 179 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సమస్యలకు పరిష్కారం చూపలేదు. తదుపరి ‘హుడా’ను మార్చి 2008లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్అథారిటీ ఏర్పాటు చేసి2013 నాటికి 7,257 చదరపు కిలోమీటర్లకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు అయ్యింది.
కనీస డేటా లేకుండా, అధ్యయనం లేకుండా, ప్రాథమిక సమాచారం సేకరించకుండా కేవలం ఉపగ్రహ చిత్రాల ద్వారా ప్రణాళిక సిద్ధం అయ్యింది. ఈ ప్రణాళిక 2031 వరకు జరగాల్సిన ‘అభివృద్ధిని’ నిర్దేశిస్తుందన్నారు. అప్పటి నగర సమస్యల జాబితాను కూడా ప్రస్తావించలేదు. 2012-–13 మాస్టర్ ప్లాన్ లో పరిగణించిన నగర జనాభా ఊహాజనితమే. 2011 జనగణన తరువాత మళ్లీ జనగణన జరగలేదు. అయినా ఒక ప్రణాళిక తయారుచేయడానికి ఇప్పుడు పూనుకున్నది తెలంగాణ ప్రభుత్వం.
ప్రభుత్వం మారింది..
గత 8 ఏండ్లుగా ప్రస్తుత మాస్టర్ ప్లాన్ సవరిస్తామని, తప్పులను సరిదిద్దుతామని, వివిధ ‘చిన్న’ మాస్టర్ ప్లాన్లను కలిపి ఒక మహా ప్రణాళిక తయారు చేస్తున్నామని మునిసిపల్ శాఖ అధికారులు ప్రకటించారు. ఆ కాలంలో హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి అధిపతిని కూడా నియమించలేదు. ప్రభుత్వం మారింది.
మళ్లీ పాత పాట సరికొత్త పల్లవితో ఎత్తుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తృతం చేస్తూ హెచ్ఎండీఏ పరిధిని భారీస్థాయిలో పెంచుతూ ఒక జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏకంగా 10,500 చదరపు కిలోమీటర్లకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని పెంచినా అందులో ఫ్యూచర్ సిటీ అని ఇంకొక ప్రాంతాన్ని కూడా ప్రకటించింది.
ఇప్పుడు తయారుచేస్తున్న కొత్త మాస్టర్ ప్లాన్ 2047 నాటికి ఏ ప్రాంత అభివృద్ధికి పరిమితం చేస్తారో తెలియదు. ఇక రాబోయే బృహత్ ప్రణాళిక ప్రకటించిన ప్రాజెక్టులకు అనుగుణంగా తయారు అవుతుందా? నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు రాబోయే బృహత్ ప్రణాళిక ఒక సమగ్ర పరిష్కారంగా కాకుండా సమస్యాత్మకంగా మారేలా ఉంది.
జీవో 111 ప్రాంతం పర్యావరణ అనుకూలం
ఫ్యూచర్ సిటీ బదులు జీవో111 ప్రాంతంలో పర్యావరణ అనుకూల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తే మొత్తం నగరం, మూసీ పరీవాహక ప్రాంతానికి ఉపయోగం ఉంటుంది. ఫ్యూచర్ సిటీ పేరిట 1.83 లక్షల ఎకరాలను వ్యవసాయం నుంచి మళ్లించే బదులు 1.32 లక్షల ఎకరాలు జీవో 111 ప్రాంత అభివృద్ధి ప్రత్యేక ప్రణాళిక రచించడం ద్వారా హైదరాబాద్ నైరుతి ప్రాంతంలో అడ్డదిడ్డంగా జరుగుతున్న మార్పుకు అడ్డుకట్ట వేయగలుగుతాం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను, మూసీనదిని, సహజ నీటి పరీవాహక ప్రాంతాన్ని కాపాడుకుంటూ సమతుల్య, పర్యావరణ అనుకూల అభివృద్ధి ప్రణాళికలు రచించాల్సిన ఆవశ్యకత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది.
విస్తృత సంప్రదింపులతో ప్రణాళిక
లాభాపేక్షతో కూడిన లక్ష్యాలు హెచ్ఎండీఏకు పనికిరావు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కలిసి నగర నీరు, భూమి, గాలి, ఆహారం, ఇండ్లు, వరదలు, మురికినీరు, కాలుష్యం, జీవన ప్రమాణాలు, రవాణా, తదితర సమస్యలకు పరిష్కారం చూపే సుస్థిర ప్రణాళిక తయారీకి ప్రజల సహకారం, నిపుణుల సూచనలతో, విస్తృత సంప్రదింపులతో అడుగులు వేయాలి. బృహత్ ప్రణాళిక తయారు చేసేముందు దాని మూల ఉద్దేశాల మీద చర్చ జరిగితే బాగుంటుంది.
తెలంగాణ రాష్ట్రంతోపాటు హైదరాబాద్ నగరానికి, నిర్వచించిన అభివృద్ధి ప్రాంతానికి కీలకంగా కావలసింది భూమి వినియోగ ప్రణాళిక. రవాణా వసతుల-ఆధారంగా అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్) స్థానంలో సుస్థిర నీటి వనరుల వ్యవస్థ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నాంది పలికితే బాగుంటుంది.
- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్-