
మెదక్ టౌన్, వెలుగు: రైతులు అవసరం మేరకు పంటలకు ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం హవేలీ ఘనపూర్‌లోని రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఒకప్పటి మాదిరిగా కోళ్ల ఎరువు, వర్మి కంపోస్ట్, చెరువు మట్టి వాడే పరిస్థితులు లేనందున పచ్చిరొట్ట ఎరువులను వాడాలని సూచించారు. పంట మార్పిడి చేయడం వల్ల తెగుళ్ల సమస్య తగ్గుతుందన్నారు.
పంటలకు సంబంధించిన అవశేషాలను తగలబెట్టకుండా కలియదున్నాలన్నారు. అనంతరం రసాయనాలు, ఎరువుల వాడకాన్ని గురించి రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఎరువులు కొనే సమయంలో తప్పకుండా రశీదు తీసుకోవాలని, పంటలకు తక్కువ నీటిని వాడుకుంటూ శాస్త్రీయ విధానంలో వ్యవసాయం చేయాలని సూచించారు. శాస్త్రవేత్త శోభ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్‌సింగ్, ఏడీఏ విజయనిర్మల, ఎంఏవో బాల్‌రెడ్డి, ఏవోలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
సలహాలతో అధిక దిగుబడి సాధించాలి
పటాన్చెరు: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. పటాన్చెరు మండల పరిధిలోని చిన్న కంజర్లలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిదాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో వివిధ శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంపై అవగాహన కల్పించి రైతులను చైతన్యవంతులను చేయడం వల్ల పంటలలో మంచి దిగుబడి సాధించవచ్చన్నారు.