ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర : కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ

ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర : కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ
  • వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ

మెదక్​టౌన్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. ఆదివారం మెదక్​ పట్టణంలోని కేవల్​ కిషన్​ భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం బాధ్యుడు దేవయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలకు సమయానికి డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయన్నారు.

ఫొటో విధానాన్ని ప్రవేశపెట్టి కూలీలకు జాబు కార్డులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో లక్షల జాబ్ కార్డులు తొలగించారని, 2014 నుంచి ప్రతీసారి బడ్జెట్ లో నిధులు తగ్గిస్తున్నాయని ఆరోపించారు. కూలీ రేట్లు, పని రోజులు పెంచకుండా పథకాన్ని రద్దు చేయాడానికి కుట్రపన్నుతున్నాయన్నారు.

ఉపాధి పథకాన్ని మున్సిపల్ కేంద్రాల్లో అమలు చేయాలని, కూలీలకు రూ.600 పెంచాలని, 200 రోజులు పని కల్పించాలని, పెండింగ్​ కూలీ డబ్బులు చెల్లించాలని,  ప్రతికూలీకి జాబ్​ కార్డు మంజూరు చేయాలని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న మెదక్​కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నాగమణి, లక్ష్మీనర్సయ్య, ఐలయ్య, రామస్వామి, పోచమ్మ, సంతోష్   తదితరులు పాల్గొన్నారు.