బీమా డబ్బుల కోసం 20 మందిని చంపేశాడు!!

బీమా డబ్బుల కోసం 20 మందిని చంపేశాడు!!
  • తప్పుడు డెత్ సర్టిఫికేట్లతో రూ. 2 కోట్లు డ్రా
  • చనిపోయిన వారిని బతికున్నట్టు క్రియేట్ చేసి రైతుబంధు
  • బినామీ బ్యాంక్ అకౌంట్లలోకి పైసలు 
  • కొందుర్గు ఏఈవో గోరేటి శ్రీశైలం నిర్వాకం
  • ఎల్ఐసీ ఆఫీసర్ల ఫిర్యాదుతో దర్యాప్తు

హైదరాబాద్: బీమా డబ్బుల కోసం బతికి ఉన్న 20 మంది రైతులు చనిపోయినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించాడు ఓ వ్యవసాయ విస్తరణాధికారి. అలాగే చనిపోయిన రైతులు బతికే ఉన్నట్టు నివేదికలు సమర్పించి వారి పేరిట రైతుబంధు సొమ్మును  ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. భార్య, స్నేహితులు, బంధువుల పేరిట దాదాపు 50 ఖాతాలు తెరిచి రూ. 2 కోట్ల గోల్ మాల్ కు పాల్పడ్డాడు. ఇలా సంపాదించిన డబ్బుతో భూములు కొనుగోలు చేశాడు. సర్కారు తనకు ఇచ్చిన అధికారిని ఇలా దుర్వినియోగానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా కొందుర్గులో చోటు చేసుకుంది. 

కొందుర్గు మండలం వెంకిర్యాల ,తంగళ్ళపల్లి, అగిర్యాల ,చిన్న ఎల్కిచేర్ల గ్రామాలకు ఏఈవో గోరేటి శ్రీశైలం ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రామాలకు చెందిన రైతులు చెందిన సుమారు 20 మంది రైతులు చనిపోయినట్టుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వం తరఫున వచ్చిన రైతుబీమా సాయం రూ. కోటిని తన ఖాతాల్లో వేసుకున్నాడు. ఈ ఖాతాలు వేరే వారి పేరిట ఓపెన్ చేసి డెబిట్ కార్డులు మాత్రం తన వద్దే పెట్టుకున్నాడు. అఫీషియల్ మెస్సేజ్ వచ్చిన వెంటనే డబ్బలు డ్రా చేసేవాడు. ఎల్ఐసీ అధికారుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి.
 
చనిపోయిన వారిపేరిట రైతుబంధు

కొందుర్గు మండలంలో రైతుబంధులోనూ భారీ గోల్ మాల్ జరిగింది. రైతుబంధుకు దరఖాస్తు చేసుకోని, చనిపోయిన రైతులకు సంబంధించిన పాస్ బుక్ లు, ఆధార్ కార్డులను తీసుకొన్న శ్రీశైలం తనకు ప్రభుత్వం ఇచ్చిన లాగిన్ ఐడీని దుర్వినియోగం చేశారు. దాదాపు రెండు వేల మందికి సంబంధించిన రైతుబంధు సొమ్ము కాజేసినట్టు తెలుస్తోంది. వారి పేరిట రైతుబంధుకు దరఖాస్తు చేసి నాలుగేండ్లుగా యాసంగి, వానకాలం పంట పెట్టుబడి సొమ్మును తనఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలా రూ. కోటి వరకు కాజేశాడు. 

భూముల కొనుగోలు

శ్రీశైలం ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తుమ్మలపల్లి వద్ద 8.5 ఎకరాలు, కొందుర్గు వద్ద 2.5 ఎకరాల జాగా కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసును సైబరాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు శ్రీశైలంతోపాటు అతడికి సహకరించిన ఓదెల వీరస్వామిని అరెస్టు చేశామని సైబరాబాద్ కమిషన్ అవినాశ్ మొహంతి తెలిపారు.