వానాకాలం సాగు కోటిన్నర ఎకరాలు ..ఇప్పటి వరకు 4.18 లక్షల ఎకరాల్లో సాగైన పంటలు

వానాకాలం సాగు కోటిన్నర ఎకరాలు ..ఇప్పటి వరకు 4.18 లక్షల ఎకరాల్లో సాగైన పంటలు
  • ఇప్పటి వరకు 4.18 లక్షల ఎకరాల్లో సాగైన పంటలు..
  •     అత్యధికంగా 3.25 లక్షల ఎకరాల్లో పత్తి వేసిన రైతులు
  •     వరి సాగు లక్ష్యం 45 లక్షల ఎకరాలు
  •     ప్రభుత్వానికి నివేదిక అందించిన అగ్రికల్చర్​ ఆఫీసర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  ఈ ఏడాది వానాకాలం సీజన్​లో కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవ సాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే, ఇప్పటి వరకు నామమాత్రంగానే పంటలు సాగయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.18 లక్షల ఎకరాల్లోనే సాగు విస్తీర్ణం నమోదైంది. గతేడాది జూన్‌‌‌‌‌‌‌‌ 22  నాటికి 11.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దీనికి రుతుపవనాల ఆలస్యమే కారణంగా తెలుస్తున్నది. కాగా, ఈసారి 70 లక్షల నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని సర్కారు టార్గెట్​గా పెట్టుకుంది. అయితే, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 3.25 లక్షల ఎకరాల్లో కాటన్‌‌‌‌‌‌‌‌ సాగైనట్లు తాజా నివేదికలో వెల్లడ యింది. కంది సాగు టార్గెట్‌‌‌‌‌‌‌‌ 15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 29,056  ఎకరాల్లో పంట వేసి నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. సోయాబీన్‌‌‌‌‌‌‌‌ సాధారణ సాగు లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8,840 ఎకరాల్లో సాగైంది. వరి టార్గెట్‌‌‌‌‌‌‌‌ 45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 16,408 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 32,070 ఎకరాల్లో కందితో పాటు పెసలు, మినుముల తదితర  పప్పుధాన్యాల పంటలు సాగయ్యాయి. ఇవి కాకుండా 7,525 ఎకరాల్లో మొక్కజొన్న , జొన్న, సజ్జ ఇతర పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

7.18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు..

ఉద్యాన పంటల్లో అన్ని రకాల పండ్ల సాగు 4.37 లక్షల ఎకరాల్లో నమోదైంది. ఆయిల్‌‌‌‌‌‌‌‌పాం 1.54 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇతర కూరగాయల పంటలు 1.27 లక్షల ఎకరాల్లో సాగు  జరిగినట్లు గుర్తించింది. ఇలా అన్నీ కలిపి 7.18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు జరిగినట్లు తమ  నివేదికలో పేర్కొన్నది.   

పంటల సాగులో  కుమ్రం భీమ్ జిల్లా టాప్‌‌‌‌‌‌‌‌..

ఇప్పటి వరకు కుమ్రం భీమ్​ జిల్లాలో అధికంగా పంటల సాగు జరిగింది. ఈ జిల్లా రైతులు 98,696 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.  ఆ తర్వాత నారాయణపేట జిల్లాలో 81,380 ఎకరాల్లో, వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 38,770, వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 28,671, ఖమ్మం జిల్లాలో 24,032, గద్వాల జిల్లాలో 23,244, నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 23,025 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి సాగు కొమురంభీం జిల్లాలోనే అధికంగా నమోదైంది. 84,430 ఎకరాల్లో రైతులు పత్తి వేశారు. అలాగే, నారాయణపేట జిల్లాలో 67,440 ఎకరాల్లో, వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 33,923 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 

ALSO READ:గురుకులాలపై బాధ్యతేది? : పాపని నాగరాజు

పది జిల్లాల్లో మొదలుకాని సాగు

రాష్ట్రంలో ప్రతియేటా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మినహా 32 జిల్లాల్లో పంటల సాగు జరుగుతుంది. కానీ, ఈయేడాది ఇప్పటి వరకు 22 జిల్లాల్లోనే వానాకాలం సాగు నమోదైంది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, హనుమకొండ, ములుగు, మేడ్చల్‌‌‌‌‌‌‌‌,  నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు పంటల సాగు నమోదు కాలేదు. రుతు పవనాల రాక ఆలస్యం కావడంతోనే జాప్యం జరిగినట్లు తెలుస్తున్నది. అయితే, తాజాగా రుతుపవనాలు విస్తరించి, గడిచిన నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో వానలు పడుతుండడంతో ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. ఈసారి ప్రధానంగా పత్తి సాగుపై రైతులు దృష్టిసారించారు. మరోవైపు వరి నార్లు పోయడం ఊపందుకుంది. ప్రస్తుతం కొంతమంది వరినాట్లు షురూ చేసినా.. 
వచ్చే నెల నుంచే వేగం పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు.