శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు..

కలియుగ వైకుంఠం తిరుమలలో త్వరలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు జరుగునున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై గురువారం ( సెప్టెంబర్ 11 ) సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శాఖలవారీగా ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని అన్నారు ఈవో అనిల్ కుమార్. 

ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లపై వివరణ ఇచ్చారు. ఈవో మాట్లాడుతూ, పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని...  బ్రహ్మోత్సవాల సమయంలో మాడ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనంగా అవసరమైనంత సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు.  గరుడ వాహనం రోజున సీనియర్ అధికారులకు మాడవీధుల్లో విధులు కేటాయించి భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించాలని అన్నారు. గ్యాలరీలల్లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలని అన్నారు వెంకయ్య చౌదరి. 

బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అవసరమైన మేరకు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని...  భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. నాదనీరాజనం వేదికపై పేరొందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. దాదాపు 3వేల 500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమర్థవంతంగా పని చేసే శ్రీవారి సేవకులను గుర్తించి బ్రహ్మోత్సవాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.

►ALSO READ | రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 1.. కూటమి సర్కార్‎పై షర్మిల ఫైర్

పోలీసులతో సమన్యయం చేసుకుని కామన్ కమాండ్ సెంటర్ ద్వారా తిరుమలలోని భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాంగింగ్ విరివిగా చేపట్టరన్నారు. 4వేల సీసీ కెమెరాలతో పాటు అదనంగా అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాల్లో మరింత అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

విద్యుత్ విభాగంలో సమస్యలు తలెత్తకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని.. భక్తులు స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు ఎస్వీబీసీ ద్వారా హెచ్ డీ క్వాలిటీ ప్రసారాలు అందించాలని అన్నారు వెంకయ్య చౌదరి. భక్తుల సౌకర్యార్థం అవసరమైన అంబులెన్సులు, మెడికల్, పారా మెడికల్ బృందాలను సిద్ధం ఉంచుకోవాలని ఆదేశించారు.