రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 1.. కూటమి సర్కార్‎పై షర్మిల ఫైర్

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 1.. కూటమి సర్కార్‎పై షర్మిల ఫైర్

అమరావతి: రాష్ట్రంలోని కూటమి సర్కార్‎పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి 2 లక్షల అప్పు ఉందని.. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో  ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. ప్రతి ఏడాది వెయ్యి కంటే పైగా నమోదు రైతుల ఆత్మహత్యలు కావడం బాధాకరమన్నారు. రైతులు చనిపోతున్నా.. కారణాలు, పరిష్కారాలు కనుగొనడంలో శూన్యమని ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతుల సమస్యలు కొండత.. ప్రభుత్వ పథకాలు గోరంత ఉన్నాయని అన్నారు. చంద్రబాబు ఇచ్చే అన్నదాత సుఖీభవ 20 వేలు ఏ మూలకు సరిపోవని.. రైతుల పథకాలు అన్ని బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పంట నష్టపరిహారం లేదు.. సబ్సిడీ పథకాలు లేవు, బోనస్‎లు లేవు. వ్యవసాయంలో సాయం పోయింది. రాష్ట్రంలో రైతుకి భరోసా లేదు. రైతు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు. కనీసం రైతులను పరామర్శించే వాడు లేడు. రాష్ట్రంలో ఏ పంటకు కనీస మద్దతు ధర అందడం లేదు. మిరప, పొగాకు, జొన్నలు, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని.. రైతులకు ఎంఎస్‎పీ విషయంలో అన్యాయం జరుగుతుంటే కేంద్రంలో ఇంకా బీజేపీకి బాబు మద్దతు ఇస్తున్నాడని.. ఇప్పటికైనా సీఎం ఆలోచన చేసుకోవాలని సూచించారు. 

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం:

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు షర్మిల. వైసీపీ హయంలో కాలేజీలు పూర్తి కాకుంటే అవి మీరు పూర్తి చేయాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే మెడికల్ సీట్లు 2600 ఉన్నాయని.. కొత్తగా నిర్మాణంలో ఉన్న కాలేజీలు పూర్తి అయితే మరో 2500 సీట్లు అందుబాటులో వస్తాయని తెలిపారు. ప్రైవేటీకరణ పేరుతో మంత్రి నారాయణ లాంటి వాళ్లకు కాలేజీలు అప్పజెప్పాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ చేస్తే మెడికల్ విద్య భారం అవుతుందని..పేద బిడ్డలకు తక్కువ ధరకే చదువుకొనే వెసులుబాటు ఉండదన్నారు. 

►ALSO READ | నా కొడుకు రాజకీయాల్లోకి రాకముందే వైసీపీ భయపడుతోంది: షర్మిల

మెడికల్ విద్యను ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతారని.. వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు షర్మిల. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ రంగంలో నడపాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే మరీ జనాలకు ఆ పథకాలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. మెజారిటీ పథకాలు అమలు చేయకుండా సూపర్ ఫ్లాప్ చేశారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ బిడ్డలకు 3 వేల భృతి లేదు.. 20 లక్షల ఉద్యోగాలు లేవని విమర్శించారు. కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అని అభివర్ణించారు.