లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. 10 మందికి తీవ్ర గాయాలు

లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. 10 మందికి తీవ్ర గాయాలు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం (సెప్టెంబర్ 11) రాత్రి కాకోరి ప్రాంతంలో అతివేగంగా దూసుకెళ్లిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అధికారుల ప్రకారం ప్రకారం.. ప్రమాదానికి గురైన బస్సు హార్డోయ్ నుంచి బయలుదేరింది. లక్నోలోని కాకోరి ప్రాంతం దగ్గరకు రాగానే డ్రైవర్ అకస్మాత్తుగా బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు నీటి ట్యాంకర్‌ను ఢీకొట్టి 20 అడుగుల లోతైన గుంటలో పడిపోయింది. బస్సులోని ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారని లక్నో పోలీస్ కమిషనర్ అమరేంద్ర సింగ్ సెంగర్ ధృవీకరించారు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు  చేపట్టారని ఆయన తెలిపారు. గాయపడిన వారిని కాకోరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. జిల్లా అధికారులను వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులందరికీ మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆకాంక్షించారు.