
- ఫస్ట్ విడతలో 8,86,522 చీరలు
- ఒక్కొక్కరికి రెండు చీరలు
- బతుకమ్మ పండగకు ముందే పంపిణీ
- ఉమ్మడి జిల్లా మహిళా సంఘాల్లో 7,43,107 సభ్యులు
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా కానుక ఇవ్వనుంది. ఒక్కో మహిళకు రెండు చీరల చొప్పున ఇవ్వనున్నారు. ఈ కానుకకు సంబంధించి సమాఖ్య సంఘాల మహిళల జాబితాను సెర్ఫ్, మెప్మా రూపొందించాయి. ముందుగా ఫస్ట్ విడతకు సంబంధించిన చీరలు ఒకటి రెండ్రోజుల్లో రానున్నాయి.
గత సర్కారు హయాంలో నాసిరకం చీరలు
బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల్లో పేరున్న మహిళలకు బతుకమ్మ చీరలు అందించింది. అయితే కొందరికి అందకున్నా.. చాలా మంది ఈ చీరలు తీసుకున్నారు. అయితే తీసుకున్న వారు సైతం ఈ చీరలు నాసిరకంగా ఉన్నాయని ఉపయోగించలేదు. రైతులయితే వీటిని జొన్న, మొక్కజొన్న వంటి చేన్ల వద్దకు పక్షులు రాకుండా ఉంచడానికి ఉపయోగించారు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. వీటిని షోలాపూర్లో కిలోచొప్పున కొనుగోలు చేశారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
సంఘాల మహిళలకే చీరలు
బతుకమ్మ, దసరా కానుకగా మంచి నాణ్యమైన చీరలు మహిళలకు కానుకగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'ఇందిరా మహిళా శక్తి' పేరుతో ఒక్కో మహిళకు రెండు చీరలు ఇస్తామని తెలిపారు. అయితే వీటి ధర ఒక్కొక్కటి రూ.800 ఉంటుందని అంటున్నారు. బతుకమ్మ ఉత్సవాలకు సమయం దగ్గరపడడం, దసరా పండుగ దగ్గరకు వస్తున్నందున చీరలు తయారీ ఊపందుకుంది. అయితే సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సెర్ఫ్, మెఫ్మా సంఘాల్లోని సభ్యులైన మహిళల జాబితా తయారు చేసి హయ్యర్ ఆఫీసర్లకు పంపించాయి.
ఫస్ట్ విడతలో 8,86,522 చీరలు
సిరిసిల్లలో తయారవుతున్న చీరలు జిల్లాలకు రెండ్రోజుల్లో వస్తాయని సమాచారం అందడంతో ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మహిళకు రెండేసి చీరల చొప్పున పంపిణీ చేయనున్నారు. ఫస్ట్ విడతలో ఉమ్మడి జిల్లాకు 8,86,522 చీరలు రానున్నాయి. వచ్చిన చీరలను యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం మండలం మైలారం, రామన్నపేటలోని అగ్రికల్చర్ మార్కెట్ గోదాములను ఎంపిక చేశారు. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేటలో కమ్యూనిటీ హాల్, మార్కెట్ గోదాముతో పాటు హుజూర్నగర్ మార్కెట్గోదాముల్లో వచ్చిన స్టాక్ నిల్వ చేయనున్నారు. అక్కడి నుంచే చీరలను నిల్వ చేయడంతో పాటు మండలాలు, మున్సిపాలిటీల వారీగా డిస్పాచ్ చేస్తారు.
- జిల్లా సభ్యులు ఫస్ట్ విడతలో..
- యాదాద్రి 1,91,811 3,00,000
- నల్గొండ 3,66,522 3,66,522
- సూర్యాపేట 1,84,774 2,20,000