యూరియాను బ్లాక్చేస్తే కేసులు

యూరియాను బ్లాక్చేస్తే కేసులు
  • వ్యాపారులు, డీలర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్​ గోపి హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: యూరియాను బ్లాక్​చేసి, ఎక్కువ రేటుకు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు పెట్టి జైలుకు పంపుతామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపి హెచ్చరించారు. రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువులను కొందరు డీలర్లు అక్రమంగా నిల్వ చేస్తున్నారని, రైతులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే ఫిర్యాదులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల జిల్లా స్థాయిలో అధికారులు అక్రమ నిల్వలపై నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు.

మరోవైపు ఎరువుల కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే యూరియాను రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామని గోపి తెలిపారు. కొన్ని జిల్లాల్లో రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నప్పటికీ, వరుస క్రమంలో పంపిణీ జరుగుతుందని భరోసా ఇచ్చారు. అక్రమ నిల్వలు, అధిక ధరలపై ఫిర్యాదు చేయడానికి వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు 89777-41771 నంబర్‌‌‌‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ రజత్ కుమార్ మిశ్రా, అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ శాఖ సెక్రటరీ దేవేశ్ చతుర్వేది, రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు గోపి తెలిపారు. కేంద్ర తనిఖీ బృందాలు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు.