వర్షాల నుంచి పంటలను కాపాడుకోండి.. రైతులకు అగ్రికల్చర్​ వర్సిటీ సూచనలు

వర్షాల నుంచి పంటలను కాపాడుకోండి.. రైతులకు అగ్రికల్చర్​ వర్సిటీ సూచనలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి పంటలను కాపాడుకోవాలని రైతులకు అగ్రికల్చర్​ యూనివర్సిటీ సూచించింది. వర్షం వల్ల పంటల్లోకి నీరు చేరి సాగు వృథా అయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. ఇటీవల కురిసిన వానలకు పంటలు కొట్టుకుపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో  వర్షం బారినుంచి పంటను కాపాడుకోవడానికి రైతులకు వర్సిటీ పలు సూచనలు చేసింది. 

వరి మడులకు కాలువలు 

వర్షాల మూలంగా వరి సాగుకు వాతావరణం అనుకూలంగా మారింది. ఇది వరకే నార్లు పోసుకున్న రైతాంగం వెంటనే నాట్లు పూర్తి చేసుకోవాలి. ఇంకా నార్లు మొదలు పెట్టని రైతులు దమ్ము చేసిన పొలాల్లో నేరుగా విత్తనాలు జల్లుకోవాలి. వర్షాల నేపథ్యంలో  వరి మడుల్లో నిల్వ ఉన్న నీటిని ప్రత్యేకంగా కాలువలు ఏర్పాటు చేసి తొలగించాలి. వరికి వచ్చే ఉల్లికోడు మొగిపురుగు తాకిడిని తగ్గించడానికి కార్బోఫ్యూరాన్ గుళికలు వాడాలి. ముదురు నార్లతో నాట్లు వేయవద్దు. తప్పనిసరి పరిస్థితులలో ముదురు నార్లతో నాటు వేసినప్పుడు నత్రజనిలో 2/3 వంతు అంటే ఒకటిన్నర (1 1/2) బస్తా యూరియా సూచించిన భాస్వరం, పొటాష్​లను నాటుకు ముందుగా వేసుకోవాలి. భాస్వర సంబంధిత ఎరువులను దుక్కిలో వేయని రైతులు.. పంట వేసి 20 రోజులు దాటితే  ఈ ఎరువును వేస్తే ప్రయోజనం ఉండదు. భూమిలో అధిక తేమ ఉన్నందున, అంతరకృషి చేయలేని రైతులు పంటలో కలుపు 2 నుంచి-4 ఆకుల దశలో ఉండగా కలుపు మందులను  పిచికారి చేయాలి. అలాగే.. వర్షాల వల్ల పత్తికి కూడా తెగులు సోకే ప్రమాదముంది. దీని నివారణకు ఒక ఎకరానికి పైరిథయోబాక్ సోడియం + క్విజలాఫాప్ ఈథైల్ 500 మి.లీ. స్ప్రే చేయాలి. సోయాచిక్కుడు ఎకరానికి ఇమాజితాఫిర్ + ప్రొపాక్విజోఫాప్‌‌‌‌ 800 మి.లీ., లేదా ఇమాజితాఫిర్ +ఫిర్ క్విజలాఫాప్ ఈథైల్ 175 మి.లీ. స్ప్రే చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.