
- రాజస్థాన్‌లో ఈడీ సోదాలు కలకలం
- పేపర్ లీక్ కేసులో కాంగ్రెస్ లీడర్ల ఇండ్లలో తనిఖీలు
- ఫెమా కేసులో గెహ్లాట్ కుమారుడికి సమన్లు
- విచారణకు రావాలని ఆదేశాలు
జైపూర్ : అసెంబ్లీ ఎన్నికల ముందు రాజస్థాన్ లో ఈడీ సోదాలు కలకలం రేపాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఈడీ అధికారులు గురువారం తనిఖీలు చేశారు. రాజస్థాన్సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో ఆయనకు సమన్లు ఇచ్చింది. ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు అక్టోబరు 27న తమ వద్ద హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
పరీక్షా పత్రం లీక్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేపట్టింది. జైపూర్‌లో గోవింద్ సింగ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసులు, మహువా కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా నివాసం సహా పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఈడీ తనిఖీలు మొదలు పెట్టింది. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది.
ఎగ్జామ్పేపర్ లీక్ కేసు
రాజస్థాన్ పబ్లిక్సర్వీస్కమిషన్ నిర్వహించే సీనియర్గ్రేడ్2 టీచర్పరీక్షలకు సంబంధించి జనరల్నాలెడ్జ్ప్రశ్న పత్రం లీక్‌చేసి కొందరు అభ్యర్థుల వద్ద రూ.8 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసు కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా మనీ లాండరీంగ్కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో రాజస్థాన్పబ్లిక్సర్వీస్కమిషన్మాజీ సభ్యుడు బాబూలాల్కటారతోపాటు అనిల్కుమార్మీనా, భూపేంద్ర శరణ్ అనే మరో ఇద్దరు వ్యక్తులను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ కేసులో భాగంగానే కాంగ్రెస్నేతల ఇండ్లలో సోదాలు చేసింది.
ఫెమా కేసులో గెహ్లాట్ కుమారుడికి
గెహ్లాట్ కుమారుడు వైభవ్ మారిషస్‌కు చెందిన ‘శివ్నార్హోల్డింగ్స్’ అనే షెల్‌కంపెనీ ఏర్పాటు చేసి అక్రమంగా నిధులు మళ్లించారని ఇద్దరు వ్యక్తులు వైభవ్‌పై 2015లో ఫిర్యాదు చేశారు. 2006లో ప్రారంభమైన ఆ కంపెనీ 2011లో ట్రిటన్అనే ఓ హోటల్ 2500 షేర్లను రూ.39,900కు కొన్నదని, ఆ షేర్విలువ నిజానికి రూ.100 మాత్రమే అని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. రంగంలోకి దిగిన ఈడీ ఫెమా నిబంధనలను ఉల్లంఘిస్తూ, శివనార్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి భారీ ప్రీమియంతో ట్రైటన్ హోటల్స్ కు ఎఫ్‌డీఐలు వచ్చినట్లు దర్యాప్తులో గుర్తించింది. అందులో భాగంగానే ఆయనకు సమన్లు జారీ చేస్తూ విచారణకు రావాలని కోరింది.
ఇది కుట్ర : వైభవ్
ఈడీ సమన్లపై వైభవ్గెహ్లాట్స్పందిస్తూ.. ‘ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర. వారు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ఇలాంటివి జరుగుతాయని మాకు తెలుసు. మా నాన్న అశోక్ గెహ్లాట్‌ను టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అందుకే నాకు సమన్లు పంపారు. నేను ఇప్పటికే వివరణలు ఇచ్చాను. ఈడీ అడిగినప్పుడల్లా సహకరిస్తాను’ అని చెప్పారు.
ఈడీ విశ్వసనీయతను కాపాడుకోవాలి : గెహ్లాట్
ఈడీ దాడులు ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన గెహ్లాట్తన ప్రభుత్వాన్ని పడగొట్టలేనందుకే.. కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థలను ఎన్నికల ముందు శిక్షణ ఇచ్చి పంపిందని విమర్శించారు. ‘‘ఈడీ ఒక జాతీయ ఏజెన్సీ. అలాంటి ఏజెన్సీలు విశ్వసనీయతను కాపాడుకోవాలి. ప్రశ్న నా కొడుకు గురించి మాత్రమే కాదు.. ఎన్నికల ముందు ప్రతిపక్షాలను చూసే పద్ధతి ఇది కాదు. వైభవ్‌కు లగ్జరీ హోటల్స్ఉన్నాయన్న మాట అవాస్తవం. లగ్జరీ హోటల్స్ఉంటే నేను ఒక్కసారైనా ఫ్రీగా స్టే చేసి ఉండే వాడిని కదా? వైభవ్‌కు ట్యాక్సీ కంపెనీ మాత్రమే ఉన్నది”అని ఆయన స్పష్టం చేశారు.
కావాలనే రాజకీయం చేస్తున్నరు : గజేంద్ర సింగ్షకావత్
పరీక్ష పేపర్ లీక్ కేసులో ‘పెద్ద చేప’లను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ఈడీ చర్యను అశోక్ గెహ్లాట్, ఇతర కాంగ్రెస్ నేతలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కౌంటర్ఇచ్చింది. బీజేపీ సీనియర్ లీడర్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ.. గెహ్లాట్, ఇతర కాంగ్రెస్ నాయకులు దర్యాప్తు సంస్థ చర్యను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
‘‘అశోక్ గెహ్లాట్ అవినీతికి సంబంధించిన అన్ని హద్దులు దాటారు. రాజస్థాన్‌లో లక్షల మంది యువకుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిగింది. ప్రభుత్వం తన అవినీతిని కప్పిపుచ్చుతోంది. ఈ కేసులో విచారణ జరగకుండా క్లీన్ చిట్ ఇస్తూ, నిలిపివేశారు. పెద్ద చేపలను పట్టుకోకుండా ప్రభుత్వం అడ్డుకునేదని రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ రిటైర్డ్ బ్యూరో చీఫ్ బీఎల్ సోనీ అంగీకరించారు. ఇప్పుడు ఈడీ పెద్ద చేపలపై గురి పెట్టడం ప్రారంభించింది. అందుకే ప్రభుత్వంలో కూర్చున్న వారి కుర్చీ కదులుతోంది”అని అన్నారు.