250 పాయింట్లు దాటిన గాలి నాణ్యత సూచీ.. ఢిల్లీలో దిగజారుతున్న పరిస్థితులు

250 పాయింట్లు దాటిన గాలి నాణ్యత సూచీ.. ఢిల్లీలో దిగజారుతున్న పరిస్థితులు

దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింత దిగజారుతోంది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 286 పాయింట్ల వద్ద 'పూర్' కేటగిరీలో ఉన్నట్టు  SAFAR తెలిపింది. ఇదే సమయంలో, నోయిడా AQI 255 వద్ద ఉందని, గురుగ్రామ్‌లో గాలి నాణ్యత AQI 200 వద్ద కొంచెం మెరుగ్గా ఉందని చెప్పింది.

దీపావళికి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత ఈ స్థితిలో ఉంటే.. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందోనని అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ మధ్యాహ్నానికి 330కి చేరుకుంటోంది. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ తప్పదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ వాతావరణం మరింత దిగజారుతుండటంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. జనం ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం స్టేజ్-3కి చేరుకుంటే, బీఎస్‌-III, బీఎస్‌-IV వాహనాలను నిషేధించే అవకాశం ఉంది.