సొంత ఇళ్లు ఎక్కడున్నా గుర్తించేలా సాఫ్ట్వేర్
జిల్లాలో 279 మంది అనర్హుల గుర్తింపు
నిజామాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను మరింత పారదర్శకంగా అమలు చేస్తూ పేద కుటుంబాలు మాత్రమే లబ్ది పొందేలా ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ వాడుతోంది. మంజూరు చేసిన ప్రతీ ఇంటికి జియో ట్యాగింగ్ చేసి నిర్మాణం దశలో ఉందో ఏఐ ద్వారా క్రాస్‌చెక్ చేస్తూ బిల్స్ రిలీజ్ చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్ల ఫొటోలు గరిష్టంగా 3 మీటర్ల దూరం నుంచి తీస్తేనే అప్లోడ్ అయ్యేలా రూపొందించిన సాఫ్ట్వేర్ అక్రమాలకు కళ్లెం వేస్తోంది. గతంలో మాదిరి ఒక ఇంటిని చూపి మరో ఇంటిపై బిల్ డ్రా చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. బోగస్ వివరాలు సమర్పించి ఇండ్లు శాంక్షన్ పొందిన వారిని గుర్తిస్తుంది.
279 అనర్హుల గుర్తింపు
నిజామాబాద్ జిల్లాలో 18,167 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అందులో 13,636 గ్రౌండై వివిధ స్టేజ్ల్లో పనులు నడుస్తున్నాయి. 630 ఇండ్ల నిర్మాణం ముగిసి గృహప్రవేశాలు జరిగాయి. ఏప్రిల్‌లో 2,761, జూన్‌లో 2,694 కలిపి మరో 5,455 ఇండ్లు కంప్లీట్ చేసే దిశగా హౌసింగ్ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. లబ్దిదారుల ఇబ్బందులు తొలగించి ఇంటి నిర్మాణాలు వీలైనన్ని ఎక్కువ పూర్తి చేయించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సర్కార్ బోగస్ వ్యక్తులు లబ్ధి పొందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఒక్కో ఇంటి నిర్మాణానికి అందిస్తున్న రూ.5 లక్షల సాయం పేద కుటుంబాలకే దక్కాలనే గట్టి సంకల్పంతో పనిచేస్తోంది. జిల్లాలో 279 మంది అనర్హులు లిస్ట్‌లో ఉన్నట్లు వారం కింద తేలింది. సొంత ఇండ్లున్న 95 మంది శాంక్షన్ పొందినట్లు నిర్దారించారు. గతంలో ప్రభుత్వ స్కీమ్ కింద ఇండ్లు మంజూరైన 120 మందిని, సొంత కార్లున్న 64 మందిని ఏఐ గుర్తించింది.
అనర్హత విలువ రూ.13.95 కోట్లు
ప్రజాపాలన దరఖాస్తులు, విలేజ్ సెక్రటరీ ఫీల్ట్ వెరిఫికేషన్ ప్రామాణికంగా బీపీఎల్ కుటుంబాలకు ఎక్కువ సంఖ్యలో ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. కొందరు అనర్హులు తప్పుడు వివరాలతో ఎంపికయ్యారు. వారిని ఆధార్ నంబర్లతో సహా ఏఐ పట్టుకుంది. ఆ రకంగా గుర్తించిన 279 ఇండ్ల స్కీమ్ విలువ రూ.13.95 కోట్లు కాగా ఆ డబ్బును ఇతర ఎలిజిబుల్ బీపీఎల్ కుటుంబాల ఇండ్ల నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. ఇక నుంచి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లిస్ట్ ప్రిపరేషన్లో ఏఐ కీ రోల్ పోషించనుంది. సర్కార్ సాయంతో నిర్మించిన ఇండ్ల జియో ట్యాగింగ్, బిల్స్ రిలీజ్లో ఏఐ ద్వారా లబ్ధిదారులకు మేలు కలుగుతోంది. గతంలో ఒకరి ఇంటి నిర్మాణ స్టేజ్‌ను మరొకరు వాడి బిల్ డ్రా చేసిన ఉదంతాలున్నాయి. ఇప్పడు అమలు చేస్తున్న 3 మీటర్లలోపు ఫొటో అప్లోడింగ్, ఏఐ క్రాస్ చెకింగ్ స్కీమ్‌ను అవినీతికి దూరం చేశాయి.
పేదల పథకంలో బోగస్‌కు స్థానం లేదు
ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసినం. ఏఐ మనుషులు చేయలేని అద్భుత పనులు చేసి జిల్లాలో 279 మంది అనర్హులను దొరకబట్టింది. ఏఐ మాకు మేలు చేయడంతో పాటు లబ్దిదారులకు చాలా ఉపయోగపడుతున్నది. స్పీడ్‌గా బిల్స్ రిలీజ్ కావడం అందులో భాగం.
- గంగాధర్, ఇన్చార్జి డీఎం, హౌసింగ్
