టార్గెట్ 15 సీట్లు..అందరూ కష్టపడి పని చేయండి : కేసీ వేణుగోపాల్

 టార్గెట్ 15 సీట్లు..అందరూ కష్టపడి పని చేయండి : కేసీ వేణుగోపాల్
  •     కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం
  •     తెలంగాణలో బీజేపీకి చాన్స్ ఇవ్వొద్దు 
  •     చేరికలను స్పీడప్ చేయాలని సూచన   
  •     పెండింగ్​లోని మూడు సీట్లకు ఇయ్యాల అభ్యర్థుల ప్రకటన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ముఖ్య నేతలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు గోపాల్ దిశా నిర్దేశం చేశారు. ఇందుకోసం రానున్న నెల రోజులు అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. ఆదివారం శంషాబాద్​లోని నోవాటెల్ హోటల్​లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొందరు నేతల తీరుపై వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలె తప్ప.. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి, ఎంపీ ఎన్నికల్లోనూ గెలుస్తామనే ధీమాతో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. 

చేరికలను స్పీడప్ చేయాలి.. 

నార్త్ లో బీజేపీ హవా తగ్గిందని, అందుకే ఆ పార్టీ ఇప్పుడు సౌత్ పై ఫోకస్ పెట్టిందని వేణుగోపాల్ అన్నారు. ‘‘తెలంగాణలో బీజేపీ నుంచి మనకు ముప్పు పొంచి ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, వాళ్లు ఇక్కడ పాగా వేస్తారు. వారికి ఆ అవకాశం మనం ఇవ్వవద్దు. మనం అనుకున్న సీట్లలో గెలవాలంటే, ఈ క్షణం నుంచే గ్రౌండ్ లోకి వెళ్లాలి. ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుంటే రాష్ట్రంలో స్వీప్ చేయవచ్చు” అని సూచించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్షణికావేశంలో  కొందరు పార్టీకి దూరమయ్యారు. ఆ నేతలందరూ ఇప్పుడు తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. 

అయితే వాళ్లు రావొద్దంటూ పార్టీలోని కొందరు నేతలు అడ్డుపడడం సరైంది కాదు. ఎవరు కూడా చేరికలను అడ్డుకోవద్దు. పార్టీలోకి వస్తామన్నోళ్లను మనం వద్దంటే, వాళ్లు బీజేపీలోకి వెళ్తారు. దీంతో ఆ పార్టీని మనమే పరోక్షంగా బలోపేతం చేసినవాళ్లమవుతాం. ఇప్పటి నుంచి చేరికలను ఎవరూ అడ్డుకోవద్దు. ఇంకింత స్పీడప్ చేయాలి. పదేండ్ల బీజేపీ పాలనను జనంలో ఎండగట్టాలి. సమన్వయంతో పని చేయాలి” అని దిశానిర్దేశం చేశారు. రాహుల్ ను ప్రధాని చేయడంలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉండాలన్నారు. 

నియోజకవర్గాల వారీగా సమీక్ష.. 

సమావేశంలో పాల్గొన్న ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు లోక్ సభ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులు, గెలుపు అవకాశాలు, ప్రచారం సాగుతున్న తీరు, వంద రోజుల పాలనపై ప్రజల నుంచి వస్తున్న స్పందన తదితర అంశాలపై ఎంపీ సెగ్మెంట్లకు ఇన్ చార్జులుగా ఉన్న మంత్రులను అడిగి వేణుగోపాల్ తెలుసుకున్నారు. పార్టీలో అందరూ సహకరిస్తున్నారా? ప్రచారంలో అన్ని స్థాయిల్లోని నేతలు పాల్గొంటున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీశారు. 

సమావేశంలో ముందుగా అందరితో కలిసి మాట్లాడిన వేణుగోపాల్.. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా విడివిడిగా సమీక్ష చేశారు. సెగ్మెంట్ల ఇన్ చార్జులు, అభ్యర్థులకు సూచనలు చేశారు. కాగా, రాహుల్, ప్రియాంక, సీఎం రేవంత్ పర్యటనలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, పీసీ విష్ణునాథ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ ఎంపీ అభ్యర్థులు గడ్డం వంశీకృష్ణ, జీవన్ రెడ్డి, కడియం కావ్య, వంశీచంద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి, ఆత్రం సుగుణ, నీలం మధు, రంజిత్ రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, పార్టీ నేతలు మధుయాష్కీ, మైనంపల్లి హన్మంతరావు, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

నేడు పెండింగ్ సీట్లపై క్లారిటీ.. 

పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై సమావేశంలో చర్చించారు. ఏ సీటును ఏ సామాజికవర్గానికి ఇవ్వాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. సామాజిక సమీకరణల్లో భాగంగా ఈ మూడు సీట్లపై పూర్తి స్థాయిలో చర్చించి, సోమవారం సాయంత్రానికల్లా అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కాగా, అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేసీ వేణుగోపాల్ కు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు.