ఉక్రెయిన్‎కు ప్రపంచ దేశాల నుంచి సాయం

ఉక్రెయిన్‎కు ప్రపంచ దేశాల నుంచి సాయం

ఉక్రెయిన్‎కు ప్రపంచ దేశాల నుంచి సాయం అందుతోంది. యుద్ధంలోకి నాటో దేశాలు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రొమేనియా నుంచి 40 వేల మంది సైనికులు, ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలు, 4 ఫైటర్ జెట్‎లు... బ్రిటన్ నుంచి అత్యాధునిక యుద్ధ సామాగ్రితో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్‎కు చేరుకున్నాయి. రష్యాపై పెంటగాన్ అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. 95శాతం దళాలను రష్యా రంగంలోకి దింపిందన్నారు. ఇప్పటి వరకు 600 క్షిపణులతో ఉక్రెయిన్ పై దాడి చేసిందన్నారు. కీవ్ శివార్లలో రష్యా దళాలు బారులు తీరాయని పెంటగాన్ అధికారి ప్రకటించారు.

ఉక్రెయిన్‎పై దాడులను రష్యా మరింత తీవ్రం చేసింది. 12వ రోజు కూడా బాంబులతో విరుచుకుపడుతోంది. భారీ స్థాయిలో క్షిపణి, బాంబు దాడులకు దిగింది. సెంట్రల్ ఉక్రెయిన్‎లోని విమానాశ్రయం రష్యా క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. పోర్ట్ సిటీ, మారియుపోల్, వోల్నోవఖా నగరాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా నిన్న కొంత సేపు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా.. ఆ తర్వాత మళ్లీ కాల్పులతో విరుచుకుపడింది. ప్రాణ భయంతో ఇప్పటి వరకు 15 లక్షల మంది పౌరులు ఉక్రెయిన్‎ను వీడారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. శరణార్థుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని తెలిపింది. తీవ్రమైన చలి, ఆకలితో శరణార్థులు పొరుగుదేశాలకు వలస వెళ్తున్నారు. 

దాడుల తీవ్రత పెంచుతూ.. కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ సేనలు ముందుకు కదులుతున్నాయి. ప్రధాన నగరాలే టార్గెట్‎గా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఖార్కీవ్, చెర్నిహివ్‎తో పాటు.... కీవ్, మికోలేవ్, సమీ తదితర నగరాలను రష్యా పూర్తిగా చుట్టుముట్టింది. రష్యా సైనికులు నగరాల్లోకి రాకుండా ఉక్రెయిన్ సైనికులు అడ్డుకుంటున్నారు. నిన్న రష్యా విమానాన్ని కూల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. పోర్ట్ సిటీలో రష్యా దళాల దాడిని ఉక్రెయిన్ ఎదుర్కొంటుంది. ప్రతి నగరంలోనూ రష్యా సేనలపై పౌరులు దాడులకు దిగాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. దీంతో పెద్ద సంఖ్యలో పౌరులు ఆయుధాలు పడుతున్నారు. ఉక్రెయిన్ లోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటామని జెలెన్ స్కీ ప్రకటించారు. 

ప్రస్తుత పరిస్థితికి ఉక్రెయినే కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. నిన్న ఫ్రెంచ్ అధ్యక్షుడితో గంట సేపు మాట్లాడిన పుతిన్... యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ప్రకటించారు. తమ డిమాండ్లను ఉక్రెయిన్ అంగీకరించే దాకా యుద్ధం కొనసాగిస్తామన్నారు. తీరు మారకపోతే ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలపైనా పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశమైనా ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‎గా ప్రకటిస్తే ఆ దేశం కూడా యుద్ధంలో పాల్గొన్నట్లు పరిగణిస్తామని అన్నారు.

ఫేక్ న్యూస్ పైనా రష్యా కఠినంగా వ్యవహరిస్తోంది.  టిక్ టాక్ లైవ్ స్ట్రీమింగ్‎ను రష్యా నిలిపివేసింది. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, యాప్ స్టోర్‎ను బ్యాన్ చేసింది. అయితే ఉద్రిక్తత పరిస్థితల కారణంగా మరోసారి రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మాస్కోలో మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఇవాళ అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఇటు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కూడా అత్యవసరంగా ఇవాళ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభంపై మరోసారి భద్రతామండలిలో చర్చ జరగనుంది.