హాస్ట‌ల్ పైనుంచి దూకి 25 ఏళ్ల‌ డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌

హాస్ట‌ల్ పైనుంచి దూకి 25 ఏళ్ల‌ డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌

ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో జూనియ‌ర్ డాక్ట‌ర్‌గా ఉన్న 25 ఏళ్ల యువ‌కుడు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్‌గా ఉన్న అనురాగ్ కుమార్ హాస్ట‌ల్ బిల్డింగ్ పైనుంచి దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. అనురాగ్ కుమార్ శుక్ర‌వారం సాయంత్రం ఐదు గంట‌ల స‌మ‌యంలో ఎయిమ్స్ హాస్ట‌ల్ – 18లోని ప‌దో అంత‌స్తు పైకెక్కి దూకేశాడ‌ని చెప్పారు. తీవ్ర గాయాల‌పాలైన అత‌డిని ఎయిమ్స్ ఆస్ప‌త్రి ఎమ‌ర్జెన్సీ వార్డులోకి త‌ర‌లించి చికిత్స చేస్తుండ‌గా రాత్రి ప్రాణాలు కోల్పోయాడ‌ని తెలిపారు. హాస్ట‌ల్ బిల్డింగ్ పైన అనురాగ్ సెల్ ఫోన్ దొరికింద‌ని, దాన్ని స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని చెప్పారు పోలీసులు. అతడు డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని తెలుస్తోంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్నామ‌ని చెప్పారు.

కాగా, ఇటీవ‌లే ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో క‌రోనా చికిత్స పొందుతూ 37ఏళ్ల జ‌ర్న‌లిస్ట్ బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. క‌రోనా బారిన‌ప‌డిన ఆ జర్న‌లిస్ట్ ఆరోగ్యం క్షీణించ‌డంతో అత‌డు త‌ట్టుకోలేక జూన్ 6‌న బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.