
- ఫేస్ బుక్ లో క్యాంపెయిన్
- పేర్లు నమోదు చేసుకున్న 4 లక్షల మంది
- నిషిద్ధ ప్రాంతమని హెచ్చరించిన యూఎస్ ఎయిర్ ఫోర్స్
‘ఏరియా 51ని ముట్టడిద్దాం, ఏలియన్స్ ను చూసొద్దాం’ అని ఫేస్ బుక్ నిర్వహిస్తున్న క్యాంపెయిన్ లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నట్లు 4 లక్షల మంది యూజర్లు ప్రతిజ్ఞ చేశారు. సెప్టెంబర్ 20న తెల్లవారుజామున 3 గంటలకు జరిగే ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు 4.16 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మరో 4.28 లక్షల మంది ఆసక్తి చూపారు. ఫేస్ బుక్ లోని ఈ ఈవెంట్ పేజీలో ఇప్పటి వరకు 21 వేల పోస్టులు పెట్టారు.
అమెరికాలోని నెవాడ ఎడారిలోఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో డిజిటల్ గ్లోబ్ శాటిలైట్ ఇమేజ్ ఏరియాను ఏరియా 51గా పిలుస్తారు. ఇది నిషిద్ధ ప్రాంతం. 1955లో నిఘా విమానాన్ని పరీక్షించినప్పటి నుంచి ఏలియన్స్ పై స్టడీకి ఇది వేదికగా మారినట్లు సమాచారం. ఏలియన్స్ అవశేషాలు, వాళ్ల టెక్నాలజీని ఇక్కడ స్టోర్ చేసి రీసెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏలియన్స్ అస్తిత్వంపై సాక్ష్యాలను యూఎస్ గవర్నమెంట్ దాచి పెడుతోందనే ఆరోపణలున్నాయి. 2013వరకు ఏరియా 51 ఉన్నట్లు ఒప్పుకునేందుకు అమెరికా నిరాకరిస్తూ వచ్చింది. యూఎఫ్ఓ (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ )లను కనిపెట్టేందుకు రహస్య కార్యక్రమానికి 22 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్లు 2017లో పెంటగాన్ కన్ఫర్మ్ చేసింది. ఈ ప్రాంతాన్ని ముట్టడించి ఏలియన్స్ ను చూద్దాం అని ఫేస్ బుక్ లో క్యాంపెయిన్ మొదలైంది.
దీనిపై స్పందించిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి ఏరియా 51 ప్రాంతం ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ అని ఇక్కడ ఎవరైనా చొరబడితే సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాళ్ల బులెట్ల కన్నా మనం వేగంగా ముందుకు కదులుదాం అంటూ క్యాంపెయిన్ ఆర్గనైజర్లు పిలుపునిచ్చారు. ” హలో యూఎస్ గవర్నమెంట్. ఇది ఒక జోక్. ఈ ప్లాన్ తో ముందుకెళ్లే ఉద్దేశం నాకు లేదు. ఇది తమాషాగా ఉంటుందని ఆలోచించా. ఏరియా 51ని ఎవరైనా ముట్టడిస్తే నా బాధ్యత కాదు” అనే పోస్టును కూడా ఫేస్ బుక్ ఈవెంట్ పేజ్ లో పెట్టారు.