30 ఏండ్ల తర్వాత రోడ్డు విస్తరణ.. రోడ్డు వెడల్పు బాధితులకు టీడీఆర్!

30 ఏండ్ల తర్వాత రోడ్డు విస్తరణ.. రోడ్డు వెడల్పు బాధితులకు టీడీఆర్!
  • భవిష్యత్తులో ఉపయోగపడుతుందంటున్న మున్సిపల్ ఆఫీసర్లు
  • లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్న బాధితులు

వనపర్తి, వెలుగు: వనపర్తి పట్టణంలో టీడీఆర్(ట్రాన్స్​ఫర్​ ఆఫ్​ డెవలప్​మెంట్​ రైట్స్)పై చర్చ నడుస్తోంది. 30 ఏళ్ల తరువాత వనపర్తిలో రోడ్ల విస్తరణ చేపట్టారు. పట్టణంలోని గోపాల్​పేట, ఖిల్లాగణపురం, పాన్​గల్, కొత్తకోట, పెబ్బేరు రోడ్ల విస్తరణ చేపడుతున్నారు. పెబ్బేరు రోడ్డు విస్తరణ ఇంకా ప్రారంభం కాలేదు. ఎమ్మెల్యే, కలెక్టర్లు ఇటీవల ఆ ప్రాంతంలోని వ్యాపారులతో మాట్లాడి విస్తరణకు సహకరించాలని కోరారు. విస్తరణకు ముందుకొచ్చే వారికి టీడీఆర్​ ఇస్తామని చెప్పారు. అందుకు కొందరు ఒప్పుకున్నా, స్థలం పూర్తిగా కోల్పోతున్న వారు వెనుకాడుతున్నారు.

టీడీఆర్​తో లాభం ఏమిటి?

ఉదాహరణకు 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌×40 చదరపు అడుగుల దుకాణంలో 10 చదరపు అడుగులు రోడ్డు విస్తరణలో కోల్పోతే, మున్సిపాలిటీ 10 చదరపు అడుగులకు నాలిగింతలు అంటే 40 చదరపు అడుగులు సరెండర్​ చేసినట్లు టీడీఆర్​ సర్టిఫికెట్​ ఇస్తుంది. ఆ తరువాత ఎక్కడైనా జీ ప్లస్​ ఫోర్​ అపార్ట్​మెంట్​ కట్టుకుంటే, ఐదో అంతస్తుకు అనుమతి లేకున్నా సదరు బాధితుడు ఈ సర్టిఫికెట్​ను ఉపయోగించుకొని పర్మిషన్​ తీసుకోవచ్చు. బాధితులు అపార్ట్​మెంట్​ కట్టుకోకున్నా, ఈ టీడీఆర్​ సర్టిఫికెట్​లోని స్థలాన్ని రిజిస్ట్రేషన్​ ధరకు వేరే ఎవరికైనా అమ్ముకోవచ్చు. అంటే తాను కోల్పోయిన స్థలంపై నాలుగింతల రేటు బాధితుడికి వస్తుందన్న మాట. 

వనపర్తిలోని పాలిటెక్నిక్​ కాలేజీ నుంచి రామాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా విస్తరణలో స్థలాలు కోల్పోయే వారు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. స్థలం కోల్పోతున్న వారు లాభనష్టాలను బేరీజు వేసుకొని, ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక పట్టణంలోని వివేకానంద చౌరస్తా నుంచి బస్​ డిపో వరకు 94 షాపులు ఉన్నాయి. ఈ రూట్​లో రోడ్​ను 80 ఫీట్లు వెడల్పు చేయాలని మార్కింగ్​ ఇచ్చారు. దీంతో ఎడమ వైపు ఉన్న షాపులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. విస్తరణలో 10 ఫీట్లు పోయే షాపులు నాలుగు ఉండగా,  నాలుగైదు ఫీట్ల స్థలం మిగిలే షాపులు 25 దాకా ఉన్నారు. వీరు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

టీడీఆర్​ పరిధి పెంచాలి..

టీడీఆర్ ను​వనపర్తి మున్సిపాలిటీకే పరిమితం చేయకుండా, ఇతర మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీలో చెల్లుబాటు అయ్యేలా ఇవ్వాలని కోరుతున్నారు. ఒక్క వనపర్తిలోనే టీడీఆర్​ ఉపయోగించుకొని అపార్ట్​మెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాలు కట్టుకునే పరిస్థితి లేదని అంటున్నారు. పెద్ద మొత్తంలో స్థలాలు కోల్పోతున్న వారిలో కొందరికే  టీడీఆర్​తో ప్రయోజనం కలుగుతుందని పేర్కొంటున్నారు.

టీడీఆర్​ కోసం ముందుకొస్తున్రు..

వనపర్తిలో రోడ్ల విస్తరణలో స్థలం కోల్పోతున్న వారు టీడీఆర్​ కోసం ముందుకొచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తులను పరిశీలించి టీడీఆర్​ ఇస్తాం. పాలిటెక్నిక్​ నుంచి రామాలయం వరకు ఉన్న రోడ్​లో స్థలాలు కోల్పోతున్న వారిలో ఐదుగురు స్వచ్ఛందంగా తమ స్థలాలు అప్పగించేందుకు ముందుకొచ్చారు. విస్తరణలో నష్టపోయిన వారికి టీడీఆర్​ ఉపయోగకరంగా ఉంటుంది.- వెంకటేశ్వర్లు, మున్సిపల్​ కమిషనర్