ఒంటరితనం ఒక ఆధునిక వ్యాధి : జిష్ణు దేవ్ వర్మ

ఒంటరితనం ఒక ఆధునిక వ్యాధి : జిష్ణు దేవ్ వర్మ
  • వృద్ధులకు డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
  • మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒంటరితనం అనేది ఒక ఆధునిక వ్యాధిగా మారిందని రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో శనివారం జరిగిన మెడికల్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన డాక్టర్లు, వాలంటీర్లను సత్కరించారు. ఈ అవార్డులు సమాజం తరఫున ప్రేమ, కృతజ్ఞతతో ఇచ్చే గుర్తింపని గవర్నర్  తెలిపారు. వృద్ధుల కోసం డేకేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారితో మానవ సంబంధాలను మెరుగుపర్చాలని పిలుపునిచ్చారు. 

హైదరాబాద్‌లో త్వరలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 1.6 లక్షల మంది యువ వాలంటీర్లు ఉండడం గర్వకారణమని వివరించారు.  రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ భీమ్ రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటి, నిమ్స్ డైరెక్టర్ డా. బీరప్ప, ఐఎంఏ చైర్మన్ డా. ద్వారకానాథ్ 
పాల్గొన్నారు.