
- సిరిసిల్లలో 6500 మంది కార్మికులకు ఉపాధి
- మూడు షిఫ్టుల్లో పని చేస్తున్న కార్మికులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వడంతో కార్మికులకు చేతినిండా పని దొరికింది. మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడిన వస్త్ర పరిశ్రమ ఇందిరా మహిళ శక్తి చీరల ఉత్పత్తితో గాడిలో పడింది. చీరల ఉత్పత్తికి సంబంధించిన యారన్ ప్రభుత్వమే అందించడంతో అటు ఆసాములకు, ఇటు కార్మికులకు చీరల క్లాత్ ను ఉత్పత్తి చేయడం ఈజీగా మారింది. ఉత్పత్తి చేసిన చీరల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎస్హెచ్ జీ గ్రూప్ మహిళలకు ఆగస్టు 15న పంచేందుకు రెడీ అవుతోంది.
నెలకు 20 వేల వరకు రాబడి
రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా పని కల్పిచేందుకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి కోసం ఈ సంవత్సరం జనవరిలో రూ. 2.12 కోట్ల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇచ్చింది. రెండో విడత కింద మార్చి నెలలో రూ. 2.18 కోట్లు క్లాత్ ఆర్డర్, రెండు కలిపి రూ. 4.30 కోట్ల మీటర్ల క్లాత్ ను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పని దొరికింది. ప్రస్తుతం ఒక్కో పవర్‌లూం కార్మికుడు రోజుకు ఒక పవర్ లూం మీద 25 మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేస్తారు.
ఒక కార్మికుడు రోజుకు దాదాపు 6 పవర్ లూమ్స్ మీద 150 మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తారు. ఒక్కో మీటరు క్లాత్ ఉత్పత్తిపై కార్మికునికి రూ. 5.25 పైసలు కూలీ లభిస్తోంది. దీంతో రోజుకు ఒక్కో కార్మికుడికి దాదాపు రూ. 787 కూలీ అందుతోంది. ప్రతి నెల ఒక్కో కార్మికుడు దాదాపు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నారు. దీంతో కార్మికుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది.
ఏడాదంతా పని
సిరిసిల్ల నేత కార్మికులకు ఏడాదంతా పని దొరికేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి చీరలతో 8 నెలల పాటు ఉపాధి లభిస్తోంది. రాజీవ్ విద్యా మిషన్ కింద స్కూల్ యూనిఫామ్స్ కోసం రూ. 70 లక్షల మీటర్ల క్లాత్ ను సిరిసిల్ల నేతన్నలకే ఆర్డర్లు ఇచ్చింది. దీని ద్వారా రెండు నెలల పని దొరికింది. వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ సంక్షేమ హాస్టల్స్ యూనిఫాం, సర్వశిక్ష అభియాన్ యూనిఫాం, అంగన్వాడీ వర్కర్స్ కోసం చీరల క్లాత్ ఉత్పత్తి ఆర్డర్ ద్వారా మరో రెండు నెలల పని దొరకుతోంది. దీంతో సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా పని దొరకడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బకాయిలన్నీ క్లియర్
గత బీఆర్‌ఎస్ సర్కార్ బతుకమ్మ చీరల క్లాత్ ను సిరిసిల్ల నేతన్నలతో ఉత్పత్తి చేయించుకుని దాదాపు రూ.280 కోట్లు బకాయి పెట్టింది. దీంతో సిరిసిల్ల నేతన్నలు అప్పుల్లో కూరుకుపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం బకాయిలన్నీ క్లియర్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నెల రోజులకే రూ. 50 కోట్లు రిలీజ్ చేసింది. విడతల వారీగా సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ క్లియర్ చేసేసింది. రాజీవ్ విద్యా మిషన్ కింద యూనిఫాం అమౌంట్ సైతం రిలీజ్ చేసింది. తాజాగా ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు యారన్ ప్రభుత్వమే సరఫరా చేయడంతో ఉత్పత్తిలో నేతన్నలు బిజీబిజీగా
మారారు.
పని దొరుకుతోంది
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరా మహిళ శక్తి చీరల ఆర్డర్ ఇచ్చింది. దీంతో నాకు పని దొరికింది. రోజుకు నేను 150 మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నాను. ఒక్కో మీటర్ పై రూ.5.25 పైసలు కూలీ లభిస్తోంది. రోజుకు దాదాపు 750 వరకు సంపాదిస్తున్నా. నెలకు ర. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు వస్తున్నాయి. - మ్యాన సతీశ్, సిరిసిల్ల, పవర్‌లూం కార్మికుడు
నెలకు రూ. 20వేలు సంపాదిస్తున్నా
ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తిలో వైపని చేస్తున్నాను. బీములు నింపుటం ద్వారా ఉపాధి పొందుతున్నాను. ఒక్కో బీము నింపటం ద్వారా రూ.600 వస్తున్నాయి. ఒక్కో రోజు రెండు బీములు కూడా నింపడంతో రూ.1200 వరకు వస్తున్నాయి. - ఆడేపు సత్యనారాయణ, వైపని కార్మికుడు, సిరిసిల్ల