
- ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం .. పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
- 322కు పెరిగిన ఏక్యూఐ
- 12 గంటల్లోనే 100 పాయింట్లు పైకి..
- భారీగా పటాకులు కాల్చిన ఢిల్లీ వాసులు
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా ఢిల్లీ ప్రజలు పేల్చిన టపాసుల మోతతో ఎయిర్ క్వాలిటీ భారీగా పడిపోయింది. సోమవారం ఉదయానికి ఢిల్లీని దట్టమైన పొగ కమ్మేసింది. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాలో కూడా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిన్నది. ఢిల్లీలో గత 8 ఏండ్లతో పోలిస్తే ఆదివారం బెస్ట్ ఎయిర్ క్వాలిటీ రికార్డయింది. సాయంత్రం 4 గంటల నాటికి ఏక్యూఐ 218గా ఉంది. రాత్రి నుంచి టపాసులు పేల్చడం ప్రారంభించడంతో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతూ పోయింది. సోమవారం పొద్దున 7 గంటలకు ఏక్యూఐ 275 ఉండగా, మధ్యాహ్నం 12 గంటలకు ఏకంగా 322కు పెరిగింది. చాలా చోట్ల ఏక్యూఐ 300 దాటింది. పోయిన ఏడాది దీపావళి రోజు ఢిల్లీలో ఏక్యూఐ యావరేజ్‌గా 312 ఉండగా.. ఈసారి 322కు పెరిగింది. ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్కు అగ్ని ప్రమాదాలకు సంబంధించి మొత్తం 208 కాల్స్ వచ్చాయి. తిలక్‌నగర్‌లో 6 షాపులు కాలిపోయాయి. 89 మంది కాలిన గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.
పంజాబ్, హర్యానాపైనా ప్రభావం
పంజాబ్, హర్యానాలోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. హర్యానాలోని ఫరీదాబాద్, గుర్గావ్ ఏరియాల్లో ఏక్యూఐ 300కు పైగా రికార్డయింది. రెండు రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే పేల్చాలని ఆదేశించినా ఎవరూ పట్టించుకోలేదు. ‘పూర్’, ‘వెరీ పూర్’ కేటగిరీలో పంజాబ్, హర్యానా నిలిచాయి.
పొల్యూషన్‌పై బీజేపీ, ఆప్ విమర్శలు
ఢిల్లీ కాలుష్యంపై బీజేపీ, ఆప్ లీడర్లు పరస్పరం విమర్శించుకుంటున్నారు. బీజేపీ లీడర్లే క్రాకర్స్ కాల్చేందుకు ప్రోత్సహించారని ఢిల్లీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్ విమర్శించారు. అందుకే ఏక్యూఐ100 పాయింట్లకు పైగా పెరిగిందన్నారు. యూపీ, హర్యానా నుంచి పటాకులు తీసుకొచ్చి ఢిల్లీలో కాల్చారని ఆరోపించారు. ఏక్యూఐ 450 దాటితే సరి, బేసి సంఖ్య అమలు చేస్తామని ప్రకటించారు. పొల్యూషన్ అరికట్టడం చేతగాక బీజేపీపై ఆప్ సర్కార్ విమర్శలు చేస్తున్నదని ఢిల్లీ బీజేపీ సెక్రటరీ హరీశ్ ఖురానా విమర్శించారు. పంజాబ్‌లో వ్యవసాయ వ్యర్థాలు
కాల్చడంతోనే ఢిల్లీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
ఢిల్లీ బాటలో కోల్‌కతా, ముంబై
దీపావళి ఎఫెక్ట్ కారణంగా దేశంలోని కాలుష్య నగరాల్లో ఢిల్లీతో పాటు మరో రెండు నగరాలు కూడా చేరాయి. స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఇండియా నుంచి 3 నగరాలు నిలిచాయి. 420 ఏక్యూఐతో ఢిల్లీ టాప్‌లో ఉండగా.. 196 ఏక్యూఐతో కోల్‌కతా నాల్గో ప్లేస్‌లో, 163 ఏక్యూఐతో ముంబై 8వ స్థానంలో నిలిచింది.
ముంబైలో సౌండ్ పొల్యూషన్
ముంబైలో దీపావళి సందర్భంగా సౌండ్ పొల్యూషన్ పెరిగింది. ఆదివారం రాత్రి 10 గంటల దాకే పటాకులు కాల్చాలని బాంబే కోర్టు ఆదేశించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో 117 డెసిబెల్స్ సౌండ్ రికార్డైంది. మెరైన్ డ్రైవ్‌లో సీరియల్, ఏరియల్ పటాకులు కాల్చడంతో రాత్రి 9.55 గంటలకు అత్యధికంగా 82 నుంచి 117 డెసిబెల్స్ రికార్డయింది.
Also Read:- హోటల్ వర్కర్‌పై గ్యాంగ్ రేప్