ఇది మెడలో వేసుకుంటే.. చెడుగాలి సోకదు!

ఇది మెడలో వేసుకుంటే..  చెడుగాలి సోకదు!

చాలామంది సెలబ్రిటీలు ఈ మధ్య ఓ గాడ్జెట్​ వాడుతున్నారు. ఎక్కడికెళ్లినా దాన్ని మెడలో వేసుకొనే వెళ్తున్నారు. చూడ్డానికి అది సెల్​ఫోన్​లాగే ఉంటుంది. కానీ అది చేసే పనివేరు.
ఎవరైతే దాన్ని మెడలో వేసుకుంటారో.. వాళ్లకు చెడుగాలి ఏదీ సోకదు. అదేమన్నా తాయెత్తా.. చెడు గాలి సోకకుండా ఉండడానికి! అనేకదా? అవును…
అది తాయెత్తే. కాకపోతే మంత్రాలు, తంత్రాలతో  చేసిన తాయెత్తు కాదు టెక్నాలజీతో చేసిన తాయెత్తు.

ఫ్యూచర్​ అంతా పొల్యూషన్​దే.  గాలి, నీరు, భూమి, ఆకాశం.. ఇలా అన్నీ పొల్యూట్​ అయిపోతాయి. ఎక్కడికెళ్లినా పొల్యూషన్​బారిన పడకుండా ఉండటం కష్టమే. ఎయిర్​ ప్యూరిఫయర్లు పెట్టుకొని ఇంట్లోనే ఉంటే తప్ప. మరి అలాంటప్పుడు బయటకెళ్తే మన పరిస్థితి ఏంటి. మాస్క్​లు పెట్టుకొని తిరగాల్సిందేనా? ఇంకో మార్గమే లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకేఒక్క గాడ్జెట్​. అదే పర్సనల్​ ఎయిర్​ ప్యూరిఫయర్​.

శశిథరూర్​ మెడలో..

ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్​ నేత శశిథరూర్​. చాలాసార్లు వార్తల్లోకెక్కుతుంటారు. తాజాగా కూడా మీడియా ఆయన గురించే మాట్లాడుకుంటోంది. కారణం.. ఆయన మెడలో కనిపిస్తున్న ఓ గాడ్జెట్. నిజానికి ఆయన ఆ గాడ్జెట్​ను ఎంతోకాలంగా మెడలో వేసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడే దానిగురించి మాట్లాడుకోవడానికి కారణం మాత్రం కరోనా అనే చెప్పొచ్చు.

ట్విటర్​తో వెలుగులోకి..

పార్లమెంట్​లో హేమమాలినితో శశిథరూర్​ మాట్లాడుతున్న ఓ ఫొటోను పోస్ట్​ చేస్తూ ఒకతను.. ‘సర్​ మీ మెడలో ఉన్న సెల్​ఫోన్​ మోడల్​ ఏంటి?’ అని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ… ‘అది సెల్​ఫోన్​ కాదు. పర్సనల్​ ఎయిర్​ ప్యూరిఫయర్. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉన్నందున దానిబారిన పడకుండా ఉండేందుకు ఇలా పర్సనల్ ఎయిర్​ ప్యూరిఫయర్​ను వాడుతున్నా’నని సమాధానమిచ్చారు. దీంతో అతని ఫాలోయర్లంతా అసలు పర్సనల్​ ఎయిర్​ ప్యూరిఫయర్​ అంటే ఏంటి? దాని ధర ఎంత ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎందుకంటే.. కరోనా వైరస్​ మనదేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఒకవేళ ఈ గాడ్జెట్​ వైరస్​ నుంచి కూడా కాపాడుతుందేమోననే అభిప్రాయంతో ఇంటర్​నెట్​లో సెర్చ్​ చేస్తున్నారు.

ఆన్​లైన్​లో కొనుక్కోవచ్చు..

పర్సనల్​ ఎయిర్​ ప్యూరిఫయర్లను నెగెటివ్​ అయొనైజర్​ అని కూడా పిలుస్తారు. ఆన్​లైన్​లో అన్ని ఈ– కామర్స్​ వెబ్​సైట్లలో అందుబాటులో ఉంది. సెలబ్రిటీలు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి దీని ధర ఎక్కువగా ఉంటుందనుకోవచ్చు. నిజమే, ధర మాత్రం కాస్త ఎక్కువే ఉంది. సుమారుగా పదివేల రూపాయలకు అటుఇటుగా ఉంది. కానీ.. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో వినోదం కోసం వాడే సెల్​ఫోన్​ కోసమే ఇంతకు నాలుగైదురెట్లు ఖర్చుపెడుతున్నాం. అలాంటిది ప్రాణం కోసం పదివేల రూపాయలు ఖర్చుపెట్టుకోలేమా’’ అంటున్నారు కొందరు. అయితే కొనేవాళ్ల సంఖ్య పెరిగితే ఫ్యూచర్​లో దీని ధర కూడా తగ్గే అవకాశముంది.

సెలబ్రిటీలే కాదు..

శశిథరూర్​ ట్విటర్​లో రిప్లై ఇచ్చిన తర్వాత గమనిస్తే ఇలాంటి గాడ్జెట్​ను చాలామందే యూజ్​ చేస్తున్నారు. సాఫ్ట్​వేర్​ ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయిస్​ చాలామంది ఈ గాడ్జెట్​ను యూజ్​ చేస్తున్నారు. ఎప్పుడూ ఏసీ రూమ్​లలోఉండేవాళ్లు బయటకి వస్తే తప్పనిసరిగా పొల్యూషన్​ ఎఫెక్ట్​ చూపిస్తుంది. అందుకే వాళ్లంతా ఈ గాడ్జెట్​ను వాడుతున్నారు.

ఫ్యూచర్​లో కంపల్సరీ గాడ్జెట్​..

ఒకప్పుడు ల్యాండ్​ఫోన్​ వాడినవాళ్లు ఇప్పుడు సెల్​ఫోన్​ వాడుతున్నారు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్​ఫోనే కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో ఎయిర్​ ప్యూరిఫయర్లు వాడుతున్నారు. అలాగే ఫ్యూచర్​లో ఈ ఎయిర్​ ప్యూరిఫయర్లు చేతిలోకి రావడం ఖాయం. ఎందుకంటే… పొల్యూషన్​ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప, తగ్గడంలేదు. అందుకే పర్సనల్​ ఎయిర్​ ప్యూరిఫయర్లకు ఫ్యూచర్​లో డిమాండ్​ బాగా పెరుగుతుంది.

వైరస్​ల నుంచి కాపాడుతుందన్న ఉద్దేశంతో కూడా..

పర్సనల్ ఎయిర్​ ప్యూరిఫయర్లను వాడేవాళ్లలో చాలామంది అవి తమను గాలిద్వారా వ్యాపించే వైరస్​లు, బ్యాక్టీరియాల నుంచి కూడా కాపాడతాయని అనుకుంటున్నారు. అందుకే పెద్దగా కాలుష్యం లేని ప్రాంతాలకు వెళ్లినా కూడా వీటిని మెడలో వేసుకొని వెళ్తున్నారు. కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తున్నందున ఇప్పుడు కొనుక్కొని మరీ వేసుకుంటున్నారు. కిందటేడాది అక్టోబర్​లో మన రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఫిలిప్పీన్స్​లో ఐదురోజులు పర్యటించారు. ఆ సమయంలో ఫిలిప్పీన్స్​ అధ్యక్షుడు రోడ్రిగో కూడా మెడలో ఎయిర్​ ప్యూరిఫయర్​తో కనిపించారు. దీంతో ‘అదేంటి?’ అని మీడియా అడగడంతో రోడ్రిగో పీఏ సాల్వడార్​ పానెలో దీనిపై వివరణ ఇచ్చారు. ‘అదొక పర్సనల్​ ఎయిర్​ ప్యూరిఫయర్​. జలుబు, దగ్గు ఉన్నవారెవరైనా చుట్టూ ఉంటే వారి నుంచి వైరస్, బ్యాక్టీరియాలు మనకి సోకకుండా కాపాడుతుంద’ని చెప్పారు.

ఎయిర్​టేమర్​ ఏమంటోందంటే..

పర్సనల్ ఎయిర్​ ప్యూరిఫయర్లను తయారుచేస్తున్న ప్రముఖ ఎయిర్​టేమర్​ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… ‘ మాకంపెనీ తయారుచేసే పర్సనల్​ ఎయిర్​ ప్యూరిఫయర్లు చుట్టూ ఉన్న గాలిలోని కాలుష్యాన్ని తొలగిస్తాయి. ధూళితోపాటు పొగ, దుర్వాసనలను అడ్డుకుంటాయి. అన్నింటికీ మించి వైరస్​, బ్యాక్టీరియాలను కూడా అడ్డుకుంటాయ’ని చెప్పారు.

ఎంతవరకు పనిచేస్తుంది?

పర్సనల్ ఎయిర్​ ప్యూరిఫయర్​ మెడలో వేసుకుంటే మనచుట్టూ ఉన్న పది అడుగుల వాతావరణాన్ని ఇది శుభ్రం చేస్తుంది. గాలిలోని నెగెటివ్ అయాన్లను హెల్తీ ఆయాన్లుగా మారుస్తుంది.  పెద్దగా బరువు కూడా ఉండదు కాబట్టి ఓ ట్యాగ్​ సాయంతో మెడలో వేసుకోవచ్చు. ఒకసారి చార్జింగ్​ చేస్తే 40 గంటలపాటు పనిచేస్తుంది. అయితే ఫీచర్లు ఎక్కువగా ఉన్న ప్యూరిఫయర్లు మాత్రం కాస్త ఎక్కువ ధర ఉంటాయి.

కరోనా నుంచి కాపాడుతుందా?

ఈ గాడ్జెట్ కరోనా వైరస్ నుంచి కాపాడుతుందా? అని చాలామంది ఆరా తీస్తున్నారు. వైరస్​, బ్యాక్టీరియాలను అడ్డుకుంటుంది కాబట్టి కరోనా వంటి ప్రాణాంతకమైన వైరస్​ల నుంచి కూడా కాపాడుతుందనే చెబుతున్నారు. అయితే కరోనా ను అడ్డుకుంటుందా? లేదా? అనే కోణంలో ఇప్పటిదాకా ఎలాంటి రీసెర్చ్​ జరగలేదు.

ఇదెలా పనిచేస్తుందంటే…

ఇంట్లో టేబుల్​పై పెట్టుకునే ఎయిర్​ ప్యూరిఫయర్లతో పోలిస్తే ఇది మరింత మెరుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోకంటే బయట పొల్యూషన్​ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. పైగా ఇది ఎక్కడికైనా తీసుకెళ్లేలా సైజులో చిన్నగా, తేలిగ్గా కూడా ఉండాలి. అంతేకాదు.. బయటకు వెళ్లినప్పుడు చార్జింగ్​ ఫెసిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఒకసారి చార్జింగ్​ చేస్తే గంటల తరబడి పనిచేయాలి. మనం ఇక్కడ చెప్పుకుంటున్న పర్సనల్​ ఎయిర్​ ప్యూరిఫయర్​లో ఈ ఫెసిలిటీస్​ అన్నీ ఉన్నాయి. పైగా దీనిని కొన్నిరోజులు వాడిన తర్వాత మళ్లీ మళ్లీ వాడటానికి ఎలాంటి ఫిల్టర్లు కొనాల్సిన అవసరం లేదు. జీరో మెయింటెనెన్స్​ గాడ్జెట్​ ఇది. నెగెటివ్​ అయాన్స్​ను పాజిటివ్​ అయాన్స్​గా మార్చడమే ఇందులో ఉన్న టెక్నాలజీ. ఇందుకోసం ఇది ఇన్​విజిబుల్​ ఎయిర్​ బబుల్స్​ను క్రియేట్​ చేస్తుంది. ఇది క్రియేట్​ చేసే ఈ బబుల్స్​ను మాత్రమే మనం పీల్చుకుంటాం.
అంటే వేరే ఏ కాలుష్యపూరిత గాలిని మన బ్రీథింగ్​ లెవెల్​కు రానీయకుండా బబూల్స్​  అడ్డుకుంటాయి.  నిజంగా ఇది పొల్యూటెడ్​ ఎయిర్​ను దూరంగా నెట్టేస్తుందా? అని పరీక్షించిన వీడియోలు యూట్యూబ్​లో ఎన్నో ఉన్నాయి. స్వయంగా వాటిని చూసి కూడా దీని పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.