- క్లీన్ ఎయిర్ కోసం అదనపు ఖర్చుకూ జనం రెడీ
న్యూఢిల్లీ: లగ్గమంటే ఫంక్షన్ హాల్, ఫుడ్, డెకరేషన్, బ్యాండ్, డీజే.. ఇట్ల అన్ని మాట్లాడాల్సి ఉంటది. అయితే ఢిల్లీలో వీటన్నింటికి తోడు.. ఇంకొక్కటి తప్పనిసరి అయింది. అదే ఎయిర్ ప్యూరిఫయర్.. అవును మరి అక్కడి పరిస్థితి అట్లున్నది. ఢిల్లీలో తీవ్రమైన గాలి కాలుష్యం కారణంగా.. ఈ సీజన్‌లో వివాహాలు, ఇతర వేడుకలు చేసుకునేటోళ్లు అతిథుల కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫంక్షన్ నిర్వహించే చోట తప్పనిసరిగా ఎయిర్ ప్యూరిఫయర్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. తద్వారా అతిథులకు క్లీన్ ఎయిర్ అందిస్తున్నారు. ఇందుకోసం అదనంగా రూ.20 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తున్నారు. అలాగే అతిథుల కోసం మాస్క్‌లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
బ్రాండ్‌ను బట్టి రెంట్..
మ్యారేజ్ ఆర్డర్స్ ఇస్తున్నోళ్లు తప్పనిసరిగా ఎయిర్ ప్యూరిఫయర్స్ అడుగుతున్నారని వివాహ్ లగ్జరీ వెడ్డింగ్స్‌కు చెందిన మోహ్సిన్ ఖాన్ తెలిపారు. ముఖ్యంగా ఇండోర్ ఫంక్షన్స్ చేసేవాళ్లు అడుగుతున్నారని చెప్పారు. ‘‘ఒక్కో ఎయిర్ ప్యూరిఫయర్ రెంట్ బ్రాండ్‌ను బట్టి రూ.3 వేల నుంచి రూ.4 వేలు ఉంటుంది. ఫంక్షన్‌ను బట్టి ఐదు నుంచి పది ఏర్పాటు చేయాలంటే.. రూ.20 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం భరించేందుకు ఆర్డర్స్ ఇస్తున్నోళ్లు సిద్ధమంటున్నారు. ఫంక్షన్‌కు వచ్చే అతిథులకు క్లీన్ ఎయిర్ అందించడమే ముఖ్యమని చెబుతున్నారు” అని చెప్పారు.
కొన్ని ఫ్యామిలీలు ఇంకొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదని తమ ఫంక్షన్లను ఓపెన్ లాన్స్‌లో నిర్వహిస్తున్నాయని, మరికొన్ని ఫ్యామిలీలైతే సిటీకి బయట ముస్సోరి, చండీగఢ్ లాంటి చోట డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నాయని వెల్లడించారు. ఇక కొంతమంది ఎన్‌ఆర్ఐలు అయితే తమ వివాహాలు ఈ సీజన్‌లో కాకుండా, వేరే సీజన్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మెగా వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్‌కు చెందిన మేఘా జిందాల్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లికూతురు, పెళ్లికొడుకు మ్యాచింగ్ మాస్క్‌లు వేసుకుంటున్నారు. అతిథులు కూడా చాలామంది మాస్క్‌లు పెట్టుకునే ఫంక్షన్లకు వస్తున్నారు” అని తెలిపారు.
