హై అలర్ట్: ఎయిరిండియాకు హైజాక్ వార్నింగ్

హై అలర్ట్: ఎయిరిండియాకు హైజాక్ వార్నింగ్

న్యూఢిల్లీ: ‘‘పాకిస్థాన్ కు మీ విమానాన్ని హైజాక్ చేసి తీసుకెళ్తాం. ఇవాళే హైజాక్ చేస్తాం’’ అంటూ ఫోన్ కాల్.. ముంబైలోని ఎయిర్ పోర్టు ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ కు ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఎయిరిండియా విమానాలే తమ టార్గెట్ అని అందులో వార్నింగ్ ఇచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో దేశంలోని ఎయిర్ పోర్టులన్నింటిలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం.

విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని సీఐఎస్ఎఫ్ అధికారులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఆదేశించింది. టెర్మినల్ బిల్డింగ్ లోకి రాకపోకలను స్ట్రిక్ట్ గా నియంత్రించాలని సూచించింది. కారు బాంబులాంటి అటాక్స్ జరిగే ప్రమాదం ఉందని, పార్కింగ్ ఏరియాలో అన్ని వాహనాలను క్షుణ్ణంగా చెక్ చేయాలని చెప్పింది. ప్రతి ప్రయాణికుడిని, సిబ్బందిని పూర్తిగా చెక్ చేశాకే లోపలికి అనుమతించాలని పేర్కొంది. కార్గో, లగేజీలనూ బాగా తనిఖీ చేయాలని, ఎయిర్ పోర్టులోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని నిరంతరం పరీక్షించాలని బీసీఏఎస్ ఆదేశించింది. గతంలో 1999లో జరిగిన కాందహార్ హైజాక్ ఘటన తర్వాత భారత ప్రభుత్వం యాంటీ హైజాకింగ్ చట్టం తెచ్చింది. దానిలోని నిబంధనల ప్రకారం ఎయిర్ పోర్టుల్లో సెక్యూరిటీ అలర్ట్ చేయాలని బీసీఏఎస్ సూచించింది.

నాటి హైజాక్ ఫలితమే పుల్వామా దాడి

1999 డిసెంబర్ 24న జైషే మహ్మద్ చీఫ్ మజూద్ అజార్ సహా మరో ముగ్గురు ఉగ్రవాదులను విడిపించుకునేందుకు పాక్ ఉగ్ర సంస్థ హర్కతుల్ ముజాహిద్దీన్ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ను హైజాక్ చేసింది. ఆ విమానంలోని ప్రయాణికులను కాపాడడం కోసం భారత ప్రభుత్వం ఏడు రోజుల చర్చల తర్వాత జైల్లో ఉన్న ఉగ్రవాదులను విడిచిపెట్టింది. నాడు విడిచి పెట్టిన మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థే ఫిబ్రవరి 14న పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడి నాటి హైజాక్ ఫలితమే.