చార్జీలు పెంచుతామన్న ఎయిర్​టెల్

చార్జీలు పెంచుతామన్న ఎయిర్​టెల్

బార్సెలోనా: తమ అన్ని ప్లాన్ల ధరలను ఈ ఏడాది పెంచుతామని ఎయిర్​టెల్​ చైర్మన్​ సునీల్​ మిట్టల్​ప్రకటించారు. కంపెనీ పోయిన నెలలోనూ 28 రోజుల సర్వీస్​ ప్లాన్​ రీచార్జ్​ రేటును 57 శాతం పెంచడంతో రూ.155లకు చేరింది. స్పెయిన్​ సిటీ బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్​ వరల్డ్​ కాంగ్రెస్​(ఎండబ్ల్యూసీ)లో మిట్టల్​ మాట్లాడుతూ క్యాపిటల్​పై వచ్చే రాబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి కాబట్టే టారిఫ్​ను పెంచబోతున్నామని అన్నారు. భారీ మొత్తంలో క్యాపిటల్​ను సర్దడం వల్లే కంపెనీ బ్యాలెన్స్​షీట్​బలంగా ఉందని పేర్కొన్నారు. అయితే టారిఫ్​ను భారీగా పెంచబోమని తెలిపారు. ఇతర వస్తువులపైన పెడుతున్న ఖర్చుతో పోలిస్తే జనం టెలికం సర్వీసులకు పెడుతున్న ఖర్చు తక్కువగానే ఉందన్నారు. ‘‘జీతాలు, అద్దెలు పెరిగాయి. అయినా జనానికి సమస్య లేదు. టెలికం టారిఫ్​ పెరిగేతేనే సమస్యనా ?! కస్టమర్లు నెలకు 30జీబీ డేటాను ఉచితంగా వాడుతున్నారు. ఇక నుంచి మనదేశంలో వొడాఫోన్​ ఐడియా వంటి పరిస్థితులు రాకూడదు. మనకు బలమైన టెలికం కంపెనీలు అవసరం. డిజిటల్​ ఎకానమీ బలపడాలని అందరం కోరుకుంటున్నాం. ఈ విషయంపై ప్రభుత్వంతోపాటు రెగ్యులేటర్లూ ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌పై దృష్టి పెట్టడం వల్ల భారతదేశానికి  చాలా ప్రయోజనాలు లభిస్తున్నాయి”అని వివరించారు. ఇదిలా ఉంటే, కంపెనీ తన కనీస రీఛార్జ్ ప్లాన్ రూ. 99ని నిలిపివేసింది.  దీని కింద సెకనుకు రూ. 2.5 పైసల చొప్పున వసూలు చేసేది.