ఎయిర్​టెల్​తో చేతులు కలిపిన మెటా

ఎయిర్​టెల్​తో చేతులు కలిపిన మెటా

న్యూఢిల్లీ: హైస్పీడ్​ డేటాకు, డిజిటల్​ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్​ తీర్చడానికి టెలికం ఇన్​ఫ్రాస్ట్రక్చర్​లో ఉమ్మడిగా ఇన్వెస్ట్​ చేస్తామని సోషల్​ మీడియా కంపెనీ మెటా ఫ్లాట్​ఫామ్స్​, టెల్కో భారతీ ఎయిర్​టెల్​ ప్రకటించాయి. గ్లోబల్​ కనెక్టివిటీ ఇన్​ఫ్రా, ‘కమ్యూనికేషన్స్​ ప్లాట్​ఫామ్ ​యాజ్ ​ఏ సర్వీస్’ (సీపాస్​) కోసం ఇవి డబ్బులు ఖర్చు చేస్తాయి. అంతేగాక సబ్​సీ కేబుల్​ సిస్టమ్, 2ఆఫ్రికా పరల్స్​ ప్రాజెక్టుల కోసం ఎయిర్​టెల్​...మెటా, సౌదీ టెలికం కంపెనీతో కలసి పనిచేస్తుంది. 2ఆఫ్రికా పరల్స్ ను ఇండియాకు తీసుకొస్తామని 2021 సెప్టెంబరులో మెటా ప్రకటించింది.

ఒప్పందం ప్రకారం ఎయిర్​టెల్​, మెటాలు సీకేబుల్​ సిస్టమ్​ను ముంబైలోని ఎయిర్​టెల్​ ల్యాండింగ్​ స్టేషన్ ​వరకు తీసుకొస్తాయి. మెటా తన వాట్సాప్​ సర్వీసుతో సీపాస్​ను ఇంటిగ్రేట్​ చేస్తుంది. ఎయిర్​టెల్​, మెటాలు ఓపెన్​ రేడియో యాక్సెస్​ నెట్​వర్క్​(ర్యాన్​) ప్రాజెక్టులో సభ్యులు. అనలిటిక్స్​, ఏఐ, మెషీన్​ లెర్నింగ్​ మోడల్స్​ ద్వారా రేడియో నెట్​వర్క్స్​ను ఆటోమేట్​ చేయడం దీని ఉద్దేశం. ఎయిర్​టెల్​ ప్రస్తుతం హర్యానాలోని కొన్ని నగరాల్లో 4జీ,5జీ ఓపెన్​ ర్యాన్​టెక్నాలజీపై ట్రయల్స్​ చేస్తోంది. తదనంతరం వీటిని ఇతర నగరాలకూ విస్తరిస్తుంది.