
బాలీవుడ్ నటి , మాజీ ప్రపంచ సుందరి ఐశ్వరర్య రాయ్ బచ్చన్ తన వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై పోరాటం చేపట్టారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలను వాణిజ్య ప్రకటనలు, అశ్లీల కంటెంట్ కోసం ఉపయోగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే వాటిని నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నమించారు.
ఐశ్వర్య రాయ్ తరపు న్యాయవాది సందీప్ సేథి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అనేక వెబ్‌సైట్‌లు ఆమె పేరు, చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొన్నారు. aishwaryaworld.com వంటి వెబ్‌సైట్‌లు "ఐశ్వర్య రాయ్ అధికారిక వెబ్‌సైట్" అని చెప్పుకుంటూ ఎలాంటి అనుమతి లేకుండా ఆమె చిత్రాలతో వస్తువులను విక్రయిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జనరేటెడ్ ఫోటోలు, మార్ఫింగ్ చేసిన వీడియోలను కూడా సృష్టిస్తున్నారని తెలిపారు. వాటిని కొన్ని అశ్లీల వెబ్‌సైట్‌లలో సైతం ఉపయోగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇలాంటి నీచమైన చర్యలపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం.. ఐశ్వర్యకు అనుకూలంగా తాత్కాలిక ఉత్తర్తులు జారీ చేసింది. ఆమె వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే వెబ్‌సైట్‌లపై ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ అనధికారిక కంటెంట్‌ను తొలగించడానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించనున్నట్లు కోర్టు తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏదాది జనవరి 15న జరగనుంది.