
- కార్మికుల సొంతింటి పథకం విధి విధానాలు ఖరారుకు కమిటీ
- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
నస్పూర్, వెలుగు: సింగరేణికి కొత్త బొగ్గు బ్లాగులు వస్తేనే సంస్థ మనుగడ సాధ్యమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ అన్నారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థకు గత ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాలను ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలన్నారు. నూతన ట్రాన్స్ ఫర్ పాలసీని సులభతరం చేయాలని, రెండు సంవత్సరాలు సర్వీస్ కలిగిన కార్మికులను మెడికల్ బోర్డుకు పిలిచి అన్ ఫిట్ చేయాలని కోరారు.
కోల్ ఇండియా మాదిరిగా సింగరేణి ఉద్యోగులకు యూనిఫామ్ కోసం రూ.12,500 చెల్లించాలన్నారు. ప్రాతినిధ్య సంఘానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్చేశారు. గుర్తింపు సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారానికికృషి చేస్తామని, అవసరమైతే సమ్మెకు సిద్ధమని స్పష్టం చేశారు. కొన్ని కార్మిక సంఘాలు తమపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు.
మారుపేర్ల సమస్య పరిష్కారానికి త్వరలో సీఎం, మంత్రులను కలుస్తామని తెలిపారు. కార్మికుల సొంతింటి పథకం విధి విధానాలు ఖరారు చేయడానికి యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీ రావు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్.ప్రకాశ్, కేంద్ర కార్యదర్శి జూపాక రాంచందర్, స్థానిక నాయకులు బాజీ సైదా, కొట్టె కిషన్ రావు, అఫ్రోజ్ ఖాన్, చంద్రశేఖర్, సురేశ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.