సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
  • 6న బొగ్గు గనులు, 8న జీఎం ఆఫీసుల ఎదుట ధర్నాలు, నిరసనలు 
  • ఏఐటీయూసీ స్టేట్​ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్​కుమార్

కోల్​బెల్ట్​/గోదావరిఖని,వెలుగు: స్ట్రక్చర్ మీటింగ్ ల్లో కార్మికుల సమస్యలపై సింగరేణి యాజమాన్యం ఆమోదించినవి వెంటనే పరిష్కరించకుంటే సమ్మెకైనా సిద్ధమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ -ఏఐటీయూసీ (గుర్తింపు సంఘం) స్టేట్​ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ స్పష్టంచేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి యూనియన్ ఆఫీస్​, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 

సింగరేణిలో 2014 నుంచి 2023 వరకు కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగ్ లు జరగలేదని, రాజకీయ జోక్యంతోనే ప్రకటనలు చేసేవారని పేర్కొన్నారు. 2023 లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత వివిధ స్థాయిల్లో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో యూనియన్ పెట్టిన కార్మికుల సమస్యల్లో  కొన్ని యాజమాన్యం పరిష్కరించినా కానీ.. అమలులో విఫలమైందని విమర్శించారు. కార్మికుల సొంతింటి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి కమిటీ వేసి కూడా అమలు చేయలేదని, అలవెన్సులపై ఇన్ కమ్ ట్యాక్స్ సింగరేణి చెల్లించాలని డిమాండ్ చేస్తే దాటవేత ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. 

వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. మెడికల్ ఫిట్ అయిన300 మందికిపైగా డిపెండెంట్లకు నియామక పత్రాలకు ఏండ్లు గడిచినా ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పిస్తామంటూ సింగరేణి నాన్చివేత  ధోరణి అవలంభిస్తుందని ఆరోపించారు. కొత్తగూడెం రీజియన్ పరిధి వీకే కోల్ మైన్, జేకే ఎక్స్‌‌‌‌టెన్షన్ ఓసీలను పర్మనెంట్ ఉద్యోగులతోనే నడపాలని, మారుపేర్లతో  చేస్తున్న వారి సమస్యలను పరిష్కరించి, విజిలెన్స్ ద్వారా విచారణ చేసి పెండింగ్ వారికి చాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కార్మికుల పెండింగ్​డిమాండ్ల సాధనకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈనెల 6న  సింగరేణి వ్యాప్తంగా అన్ని బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై, 8న జీఎం ఆఫీసుల ఎదుట నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 8 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలుస్తామన్నారు. సమస్యలను వివరించి పరిష్కరించకుంటే కార్మిక సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు.  జనవరి తర్వాత సమ్మెకు పిలుపునిస్తామన్నారు. 

ఆయా సమావేశాల్లో ఏఐటీయూసీ కేంద్ర సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్.ప్రకాశ్,ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లా గౌడ్, వై.వి.రావు, మందమర్రి, బెల్లంపల్లి, రామగుండం-2 బ్రాంచీల సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ,దాగం మల్లేశ్​,జీగురు రవిందర్​, భీమనాథుని సుదర్శనం,సీనియర్​లీడర్లు చిప్ప నర్సయ్య,శ్రీనివాస్, అశోక్, రాజేశం, వెంకటయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు