సింగరేణి ఆస్పత్రుల్లో మందుల కొరత : సలెంద్ర సత్యనారాయణ

సింగరేణి ఆస్పత్రుల్లో మందుల కొరత : సలెంద్ర సత్యనారాయణ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోందని, ఫలితంగా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ అన్నారు. బుధవారం మందమర్రిలోని సంఘం ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 

రామకృష్ణా పూర్​ సింగరేణి ఏరియా ఆస్పత్రి, మందమర్రి కేకే1 డిస్పెనర్సీల్లో దీర్ఘకాలిక వ్యాధులైన గుండె, కిడ్నీ, బీపీ, షుగర్, విటమిన్​-డి, కాల్షియం మందులు లభించడం లేదన్నారు. కార్మికుల సంక్షేమానికి రూ.కోట్ల ఫండ్స్ కేటాయిస్తున్నామని యాజమాన్యం గొప్పలు చెప్తోందే కానీ మందులు ఇవ్వడం లేదన్నారు. కొరతగా ఉన్న మందులను వెంటనే సప్లై చేసి కార్మిక కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. సమావేశంలో బ్రాంచి వైస్ ప్రెసిడెంట్​భీమనాథుని సుదర్శనం, లీడర్లు బాణయ్య, ఆంటోని దినేశ్, సుదర్శన్​రెడ్డి, శర్మ తదితరులు పాల్గొన్నారు.