యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో ఉన్న పీహెచ్‌సీని కాంగ్రెస్ ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్ గా మార్చాలని అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్ డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పీహెచ్‌సీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గురువారం పీహెచ్‌సీ ఎదుట ఏఐవైఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పావనికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 వేల జనాభా ఉన్న యాదగిరిగుట్ట మున్సిపల్ తో పాటు యాదగిరిగుట్ట మండల ప్రజలకు, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అత్యవసరం వైద్యం అవసరం పడితే.. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్న హాస్పిటల్ అందుబాటులో లేక ప్రాణాలు పోతున్నాయన్నారు. ప్రస్తుతం ఆరు పడకలతో ఉన్న పీహెచ్సీలో అన్ని రకాల వైద్య సేవలు, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో.. ట్రీట్మెంట్ కోసం భువనగిరి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
అంతేకాకుండా ప్రస్తుత పీహెచ్సీలో నైట్ షిఫ్ట్ డాక్టర్ లేకపోవడంతో.. రాత్రి వేళల్లో పేషెంట్లు భువనగిరి వెళ్లాల్సి వస్తుందన్నారు. పీహెచ్సీలో వెంటనే నైట్ డ్యూటీ డాక్టర్ ను నియమించి 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి వెంకటేష్, ఏఐవైఎఫ్ నాయకులు నరసింహ, రాజు, వెంకటేష్, మహేష్, అరవింద్ తదితరులు ఉన్నారు.
