నా పేరు సిపాయి

నా పేరు సిపాయి

ఎప్పుడూ నిప్పులు కురిపిస్తున్నట్టుగా ఉండే అజయ్ దేవగన్ కళ్లు కన్నీళ్లతో తడిశాయి. అది చూసి అక్షయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ కళ్లు కూడా చెమ్మగిల్లాయి. ఇదేదో సినిమాలోని సన్నివేశం కాదు. నిన్న నిజంగానే జరిగింది. కార్గిల్‌ యుద్ధంలో మరణించిన వీర సైనికుడిగా ‘భుజ్‌‌‌‌’ సినిమాలో కనిపించబోతున్న అజయ్.. కార్గిల్ దివస్ సందర్భంగా సైనికుల గొప్పదనాన్ని వివరిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. అందులో మనోజ్‌‌‌‌ ముదసిర్ రాసిన ‘సిపాహీ’ అనే కవితను ఎంతో ఎమోషనల్‌‌‌‌గా చదివాడు. ఆ వీడియో చూసిన అక్షయ్‌‌‌‌  కదిలిపోయాడు. ‘ఎంత గొప్పగా చెప్పావు? ఇలాంటి వాటితో ఎన్నిసార్లు మా మనసులు దోచుకుంటావు’ అంటూ కామెంట్ చేశాడు.

ఆ కవిత ఇలా ఉంది..

‘‘తుపాకీ గుళ్లు తగిలి నా ఊపిరి ఆగిపోతే.. నా దేహాన్ని మా అమ్మ దగ్గరికి పంపించండి. తనకి చాలా ఆశ. నేను వీరమరణం పొందినప్పుడు డప్పులు మోగాలని. అలాగే కానివ్వండి. నన్ను పల్లకి ఎక్కించండి. ఊరంతా తిప్పండి. డప్పులు వాయించండి. మా అమ్మతో చెప్పండి.. నీ కొడుకు వరుడిగా వచ్చాడు. కోడల్ని తీసుకురాకపోతే ఏమైంది, సందడినైతే తెచ్చాడు కదా అని. మా నాన్నగారు చెప్పేవారు. బాబూ జెండాని ఎగరేసి రా.. లేదంటే జెండాని కప్పుకునైనా రా అని. ఆయనతో చెప్పండి.. నేను తన మాటని నిలబెట్టానని. శత్రువుకి వెన్ను చూపించలేదని. చివరి తూటాకి సైతం నా గుండెనే చూపించానని. నా తమ్ముడిని అడగండి.. వాడు నా మాటని నిలబెడతాడా అని. ఎందుకంటే నేను సరిహద్దుల్లో చెప్పి వచ్చాను. ఒక బిడ్డ పోతే ఏంటి, ఇంకో బిడ్డ వస్తాడని. నా చెల్లెలికి చెప్పండి.. తనడిగిన బహుమతి నాకు గుర్తుందని. కానీ రాఖీ కట్టించుకోడానికి ముందే ఈ అన్నయ్య వెళ్లిపోయాడని.
ఆ వీధి చివర ఉంది కదా ఓ ఇల్లు.. అక్కడ రెండు క్షణాలు తప్పకుండా ఆగండి. అక్కడే తను ఉంటుంది.. బతుకైనా చావైనా నీతోనే అని నేను తనకి మాటిచ్చాను. తనకి చెప్పండి.. భారత మాతకి చేయందించే ప్రయత్నంలో తన చేతిని వదిలేశానని. ఒక ప్రమాణం కోసం.. మరో 
ప్రమాణాన్ని నిలబెట్టుకోలేకపోయానని. చివరగా ఒక చిన్న మాట. నా చిట్టచివరి కోరిక. నా మరణాన్ని చూసి ఎవరూ బాధపడకండి. ఎందుకంటే ఇలా జరగాలనే నేను కోరుకున్నాను. నేను మరణించడానికే జీవించాను. నా పేరు.. సిపాయి.’’