ఆ ఇద్దరూ ఏం చేస్తరో!

ఆ ఇద్దరూ ఏం చేస్తరో!
  • ఫామ్‌‌‌‌లో లేని స్టాండిన్‌‌‌‌  కెప్టెన్‌‌‌‌ అజింక్యా రహానె
  • మూడేళ్లుగా సెంచరీ కొట్టని పుజారా
  • స్టార్​ ప్లేయర్లు లేని టైమ్‌‌‌‌లో వీళ్లపైనే భారం

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌‌‌)

న్యూజిలాండ్‌‌‌‌తో  పోటీ  ఎప్పుడూ సవాలే.  టెస్టుల్లో ఆ టీమ్‌‌‌‌ను కొట్టడం అంత ఈజీ కాదు. క్లాసిక్‌‌‌‌ ప్లేయర్లతో నిండిన బ్లాక్‌‌‌‌క్యాప్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈ ఫార్మాట్లో నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లో ఉంది. జూన్‌‌‌‌లో జరిగిన వరల్డ్‌‌‌‌ టెస్ట్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఫైనల్లో ఇండియాకు షాకిచ్చి టైటిల్‌‌‌‌ నెగ్గిందా జట్టు. ఇప్పుడు చాంపియన్‌‌‌‌ హోదాలో ఇండియాతో రెండు టెస్టుల సిరీస్‌‌‌‌కు రెడీ అయింది.  వరల్డ్​ కప్​ ఓటమి, టీ20 సిరీస్‌‌‌‌లో ఇండియా చేతిలో  వైట్‌‌‌‌వాష్‌‌‌‌ నేపథ్యంలో గురువారం మొదలయ్యే టెస్టు సిరీస్‌‌‌‌లో టీమిండియాను ఓడించాలని కివీస్​ కసిగా ఉంది. మరోవైపు సొంతగడ్డపై ఆడటం అడ్వాంటేజే అయినా కెప్టెన్‌‌‌‌ కోహ్లీ (ఫస్ట్ టెస్టుకు), సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న రోహిత్‌‌‌‌, కేఎల్​ రాహుల్‌‌‌‌, పంత్‌‌‌‌తో పాటు పేసర్లు బుమ్రా, షమీ లేకుండా బరిలోకి దిగుతున్న ఇండియా కాస్త వీక్‌‌‌‌గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌, వైస్‌‌‌‌ కెప్టెన్లు అయిన  అజింక్యా రహానె, చతేశ్వర్‌‌‌‌ పుజారాపై బ్యాటింగ్‌‌‌‌ భారమంతా పడనుంది. కెప్టెన్సీ టాస్క్‌‌‌‌ మాత్రమే కాకుండా బ్యాట్‌‌‌‌తో  కూడా ఈ సీనియర్లు టీమ్‌‌‌‌ను ముందుండి నడిపించాల్సి ఉంది. కానీ, వీళ్లు పెద్దగా ఫామ్‌‌‌‌లో లేకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. రహానె ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు.  

గతేడాది ఆసీస్‌‌‌‌పై మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా ఉన్న రహానె సూపర్‌‌‌‌ సెంచరీతో ఇండియాను గెలిపించాడు. ఆ తర్వాత ఆడిన 11 టెస్టుల్లో 372 రన్స్‌‌‌‌ మాత్రమే చేశాడు. అందులో రెండే ఫిఫ్టీలు ఉండగా... యావరేజ్‌‌‌‌ 19.57 మాత్రమే. కివీస్‌‌‌‌తో డబ్ల్యూటీసీ ఫైనల్​తో పాటు ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌లో ఫ్లాఫ్‌‌‌‌ అయ్యాడు. ఇంగ్లండ్​లో వరుసగా 5, 1, 61, 18, 10, 14, 0 స్కోర్లతో ఫెయిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఎంత సీనియర్‌‌‌‌ అయినా వరుసగా ఫెయిలైతే అజింక్యా మరోసారి టీమ్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ కోల్పోనున్నాడు. ఇప్పటికే లిమిటెడ్‌‌‌‌ ఓవర్ల టీమ్స్‌‌‌‌కు దూరమైన అతను ఇంత చెత్త ఫామ్‌‌‌‌లో ఉన్నా ఇంకా టెస్టుల్లో కొనసాగడం, కోహ్లీ లేని టైమ్‌‌‌‌లో కెప్టెన్సీ కూడా చేపట్టడం అదృష్టం తప్ప మరోటి కాదని మాజీ క్రికెటర్‌‌‌‌ గంభీర్‌‌‌‌ విమర్శించాడు.  పైగా మిడిలార్డర్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ కోసం టీమ్‌‌‌‌లో పోటీ చాలా ఉంది. విహారితో పాటు కొత్తగా శ్రేయస్‌‌‌‌, సూర్యకుమార్​  రేసులోకి వచ్చాడు. గిల్‌‌‌‌ను కూడా మిడిల్‌‌‌‌లోకి తెచ్చి ప్రయోగం చేయాలని కొత్త కోచ్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌ భావిస్తున్నాడు. అయితే, గాయంతో లోకేశ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ సిరీస్‌‌‌‌కు దూరం కావడంతో గిల్‌‌‌‌ను ఓపెనర్‌‌‌‌గానే పంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌‌‌‌లో అజింక్యానే టీమ్​కు పెద్ద దిక్కు కానున్నాడు. ఏదేమైనా ఈ సిరీస్‌‌‌‌లో ఫెయిలైతే తన  టెస్టు కెరీర్‌‌‌‌ రిస్క్‌‌‌‌లో పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌‌‌‌లో రహానెపై అందరి ఫోకస్‌‌‌‌ ఉండనుంది. తను ఎలా ఆడతాడో చూడాలి.

పుజారాపై భారీ అంచనాలు..

రహానెతో పోలిస్తే  పుజారా  ఫామ్​ ఫర్వాలేదు. కానీ, తను  సెంచరీ చేసి మూడేళ్లు అవుతోంది. చివరగా 2019 జనవరి మూడో తేదీన సిడ్నీలో ఆస్ట్రేలియాపై సెంచరీ (193) చేసిన పుజారా  అప్పటి నుంచి 22 మ్యాచ్‌‌‌‌లు ఆడినా మళ్లీ  త్రీ డిజిట్‌‌‌‌ స్కోరు అందుకోలేకపోయాడు. తన అల్ట్రా డిఫెన్స్‌‌‌‌ స్టయిల్‌‌‌‌కు భిన్నంగా   ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌లో ఫియర్‌‌‌‌లెస్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో  టచ్‌‌‌‌లోకి వచ్చాడు. అయితే, అతను చేస్తున్న 50–60, 80–90 స్కోర్లు .. మిగతా ప్లేయర్లు కూడా రాణించినప్పుడే టీమ్‌‌‌‌కు  ఉపయోగపడుతున్నాయి. బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలించే ఇండియా పిచ్‌‌‌‌లపై భారీ స్కోర్లు అవసరం. పైగా, రెగ్యులర్‌‌‌‌ ఓపెనర్లు రోహిత్‌‌‌‌, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ఇద్దరూ లేకపోవడంతో టాపార్డర్‌‌‌‌ వీకైంది. యంగ్‌‌‌‌ ఓపెనర్లు మయాంక్‌‌‌‌, గిల్‌‌‌‌ టాలెంటెడ్‌‌‌‌ ప్లేయర్లే. కానీ, వీళ్లు తొందరగా ఔటైతే కివీస్‌‌‌‌ పేసర్లు ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌, టిమ్‌‌‌‌ సౌథీ న్యూబాల్‌‌‌‌ సవాల్‌‌‌‌ను ఎదుర్కొంటూ.. ఇన్నింగ్స్‌‌‌‌ను బిల్డ్‌‌‌‌ చేయాల్సిన బాధ్యత పుజారాపై ఉంది.  

సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్​ విషయం

‘సెంచరీ రావాల్సిన టైమ్‌‌‌‌లో వస్తుంది. నా పని టీమ్‌‌‌‌ కోసం బాగా బ్యాటింగ్‌‌‌‌ చేయడమే. అలాగని నేను రన్స్‌‌‌‌ చేయడం లేదని కాదు. 80–90 స్కోర్లు చేస్తున్నా. అవి టీమ్‌‌‌‌ విజయానికి పనికొస్తుంటే సెంచరీ గురించి పట్టించుకోబోను. ఎందుకంటే అది (సెంచరీ) ఒక్క ఇన్నింగ్స్‌‌‌‌కు సంబంధించిన విషయం. నా టెక్నిక్‌‌‌‌ను పెద్దగా మార్చుకోకపోయినా.. నిర్భయంగా ఆడటం ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌లో హెల్ప్‌‌‌‌ అయింది. దాన్నే కంటిన్యూ చేస్తా. అంతే తప్ప నాపై  ప్రెజర్‌‌‌‌ పెంచుకోను. రహానె  గ్రేట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌. పెద్ద స్కోరు చేసేందుకు తను కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్‌‌‌‌ దూరంలో ఉన్నాడని నేను నమ్ముతున్నా. ఓ బిగ్‌‌‌‌ సెంచరీ కొడితే తను మళ్లీ ఫామ్‌‌‌‌లోకి వస్తాడు’ అని పుజారా అన్నాడు.