కల మిగిలిపోయింది..అందుకే జట్టులో స్థానం కోసం పోరాడుతున్నా: రహానే

కల మిగిలిపోయింది..అందుకే జట్టులో స్థానం కోసం పోరాడుతున్నా: రహానే

అజింక్యా రహానే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలంగా భారత టెస్టు జట్టులో కీలక ప్లేయర్ గా రాణించిన ఈ వెటరన్ ప్లేయర్.. ప్రస్తుతం భారత జట్టులో చోటు కోసం పరితపిస్తున్నాడు. ఈ క్రమంలో  దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించేందుకు సిద్ధంగా ఉన్నాడు.  35 ఏళ్ళ రహానే టెస్టు జట్టులో అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా టూర్‌ లో భాగంగా టెస్టు జట్టు నుంచి ఈ సీనియర్ ప్లేయర్ ను పక్కన పెట్టిన సెలక్టర్లు..స్వదేశంలో ఈ నెల 25 నుంచి జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక కాలేదు. అయితే తన లక్ష్యమేంటో ఈ  ముంబై బ్యాటర్ బయటపెట్టాడు. 
 
ముంబైకి రంజీ ట్రోఫీ అందించడంతో పాటు, భారత్ తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాలనే రెండు లక్ష్యాలున్నాయని రహానే వెల్లడించాడు. ప్రస్తుతం తన దృష్టాంతా ముంబైను విజేతగా నిలపడంపైనే ఉందని వరుసగా రెండో విజయం సాధించిన తర్వాత రహానే విలేకరులతో అన్నారు. ఈ మాజీ టెస్ట్ వైస్-కెప్టెన్ 85 టెస్టుల్లో 38.46 సగటుతో 5077 పరుగులు చేసాడు. 12 సెంచరీలు చేసిన రహానే అత్యధిక స్కోర్ ఇండోర్ లో 188 పరుగుల అత్యధిక స్కోర్ ను నమోదు చేసాడు.

 రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో  జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.