
చెన్నయ్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్‌తో పాటు పాక్ అక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. అయితే.. ఆపరేషన్ సిందూర్లో భారత్‌కు కూడా భారీ నష్టం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆపరేషన్ సిందూర్లో భారత రాఫెల్ యుద్ధ విమానాలు కుప్పకూలాయని.. వాటి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌పై విమర్శలు చేసే వారిపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫైర్ అయ్యారు.
శుక్రవారం (జూలై 11) చెన్నైలోని ఐఐటి మద్రాస్ 62వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అజిత్ దోవల్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్ అంతర్భాగంలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను భారత్ అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. కేవలం టార్గెట్ చేసుకున్న లక్ష్యాలను మాత్రమే నాశనం చేశాం. ఆపరేషన్ సిందూర్లో భారత్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. భారత్ ఏమి కోల్పోలేదు. ఎలాంటి పొరపాటు లేకుండా మొత్తం ఆపరేషన్ 23 నిమిషాల్లో పూర్తి చేశాం.
ఆపరేషన్ సిందూర్లో భారత్ కు నష్టం జరిగిందనే వారు.. దానికి సంబంధించిన ఒక్క ఫొటో అయినా నాకు చూపించండి” అని సవాల్ విసిరారు అజిత్ దోవల్. భారత దేశ నిఘా, సైనిక దళాల అత్యంత కచ్చితమైన కార్యచరణకు ఆపరేషన్ సిందూర్ నిదర్శమని అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ పై తప్పుడు వార్తలు రాసిన అంతర్జాతీయ మీడియా సంస్థలపైన అజిత్ దోవల్ నిప్పులు చెరిగారు.
'ది న్యూయార్క్ టైమ్స్' వంటి ప్రముఖ వార్త సంస్థలు ఆపరేషన్ సిందూర్‌పై విస్తృతంగా వార్తలు రాశాయి కానీ ఉపగ్రహ చిత్రాలు వేరే వాస్తవాన్ని చూపించాయన్నారు. భారత స్థావరాలపై ఒక్క గీత కూడా పడలేదని.. శాటిలైట్ చిత్రాలపై ద్వారా ఈ విషయం స్పష్టమైందన్నారు. ఆపరేషన్ సిందూర్ భారత దేశ రక్షణ శక్తి సామర్థ్యాలను ప్రపంచదేశాలకు చాటిచెప్పిందన్నారు.