పహల్గామ్ దాడి వెనుక ఎవరున్నారు?..ఉగ్రదాడి తర్వాత ప్రధాని ఫస్ట్ క్వశ్చన్ఇదే: అజిత్ దోవల్

పహల్గామ్ దాడి వెనుక ఎవరున్నారు?..ఉగ్రదాడి తర్వాత ప్రధాని ఫస్ట్ క్వశ్చన్ఇదే: అజిత్ దోవల్

న్యూఢిల్లీ: ‘ఆ దాడి వెనుక ఎవరున్నారు? అది నాకు వెంటనే తెలియాలి’.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ  తనను అడిగిన తొలి ప్రశ్న అదేనని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్​ఎస్​ఏ) అజిత్ దోవల్ తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరు, ఆపరేషన్ సిందూర్ విశేషాలను ఆయన పంచుకున్నారు. 

‘పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. దాడి సమాచారం తెలిసిన వెంటనే ఆయన తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తిరిగొచ్చారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులోనే తనతో పాటు విదేశాంగ కార్యదర్శిని కలిశారు. ఈ దాడి వెనుక ఎవరున్నారు? బాధ్యులు ఎవరనే దానిపై స్పష్టమైన వివరాలు తనకు తక్షణమే కావాలని మోదీ ప్రధాని హోదాలో తొలి ప్రశ్నగా తనను అడిగారు’ అని దోవల్ వెల్లడించారు. 

టెర్రరిజంపై భారత్ ఎంతటి కఠిన వైఖరితో ఉందనేది ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలని ప్రధాని భావించినట్టు ఆయన తెలిపారు. భారత్ సహనాన్ని బలహీనతగా భావించకూడదని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా, తీవ్ర పరిణామాలనైనా ఎదుర్కోవడానికి వెనుకాడబోమని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను, ముఖ్యంగా పహల్గామ్ దాడికి సంబంధం ఉన్న కేంద్రాలను ధ్వంసం చేయడమే 88 గంటల పాటు సాగిన సైనిక చర్య ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఉగ్రవాదానికి పాక్ సైన్యం అందిస్తున్న మద్దతును భారత్ సహించబోదని స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా మే 7న ప్రారంభమైన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో రూపొందించిన ‘డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్’ అనే రెండు భాగాల డాక్యుసిరీస్ డిస్కవరీ ఛానెల్, డిస్కవరీ+ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది.