ఒక్క రాత్రిలోనే ఆగంజేసిన ఆకేరు .. రూపు రేఖలు కోల్పోయిన రాకాసి తండా

ఒక్క రాత్రిలోనే ఆగంజేసిన ఆకేరు .. రూపు రేఖలు కోల్పోయిన రాకాసి తండా

ఖమ్మం, వెలుగు: ఒక్క రాత్రి ఖమ్మం జిల్లాలోని రాకాసితండా రూపు రేఖలనే మార్చివేసింది. భారీ వర్షాల కారణంగా తండాకు అర కిలోమీటర్‌‌ దూరంలో ఉన్న ఆకేరు వాగు పోటెత్తడంతో తండాలోకి వచ్చిన వరద 70 కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేసింది. ఇంట్లోని సామాన్లు, వడ్లు, బియ్యం, దుస్తులు, బంగారం, డబ్బులతో పాటు పశువులు, మేకలు, కోళ్లు అన్నీ కొట్టుకుపోవడంతో తండావాసులు కట్టుబట్టలతో మిగిలారు. తండాలో ఏ ఒక్కరిని పలుకరించినా కన్నీళ్లే తప్ప మాటలు బయటకు రావడం లేదు. పరామర్శించడానికి వచ్చిన బంధువులకు తమ గోడు చెప్పుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో తెలియక, కొత్త జీవితాన్ని ఎలా మొదలు పెట్టాలో అర్థంగాక గ్రామస్తులు అయోమయంలో పడిపోయారు. 

మొండి గోడలు.. తేలిన పునాదులు

రాకాసి తండాలో 56 ఇండ్లు ఉండగా 77 కుటుంబాలు నివసిస్తున్నాయి. తండాలోని ఐదు ఇండ్లు పూర్తిగా కొట్టుకుపోగా మిగిలినవన్నీ దెబ్బతిన్నాయి. కొన్ని ఇండ్ల పైకప్పులు కొట్టుకుపోయి మొండిగోడలు దర్శనం ఇస్తుండగా, మరికొన్ని ఇండ్ల కింద మట్టి కొట్టుకుపోయి పిల్లర్లు, పునాదులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వరద తగ్గడంతో పొద్దునంతా ఇండ్లను క్లీన్‌‌ చేసుకొని రాత్రి జల్లేపల్లిలోని ప్రభుత్వ రిలీఫ్‌‌ క్యాంప్‌‌కు వెళ్లి పడుకుంటున్నారు. ఇండ్లలో ఏ ఒక్క వస్తువు కూడా మిగలకపోవడంతో ఆహారం, తాగునీటి అవసరాలకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వంపైనే ఆధారపడుతున్నారు. మరో వైపు గ్రామానికి వెళ్లే రోడ్డుతో సహా తండాలోని రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట పొలాల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసింది. 

 అసలేం జరిగింది..?

భారీ వర్షానికి ఆకేరు వాగు ఉప్పొంగడంతో ఆదివారం తెల్లవారుజామున 4.30కి ప్రజలంతా నిద్రలో ఉన్న టైంలో తండాలోకి వరద రావడం ప్రారంభమైంది. గ్రామానికి చెందిన బానోత్‌‌ మోహన్‌‌ అనే యువకుడు వరదను గమనించి పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులందరినీ నిద్ర లేపాడు. చిన్న ఊరు కావడం, నాలుగే వీధులు ఉండడంతో కాసేపట్లోనే అందరికీ పరిస్థితి అర్థమైంది. అరగంటలోనే పది అడుగుల ఎత్తులో వరద రావడంతో 56 మంది తండాలోని డాబాలపైకి ఎక్కగా, మరో 100 మంది సమీపంలోని గుట్టలపైకి వెళ్లిపోయారు. 

సామాన్లు సర్దుకునే టైం కూడా లేకపోవడంతో ఎక్కడి వాటిని అక్కడ వదిలేసి పరుగులు తీశారు. ఆ తర్వాత క్రమంగా వరద పెరగడంతో ఇండ్లన్నీ ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు మధ్యాహ్నం నుంచి బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. సాయంత్రానికి ఎన్డీఆర్‌‌ఎఫ్‌‌ బృందాలు చేరుకొని 56 మందిని పడవల ద్వారా వరద నుంచి బయటకు తీసుకొచ్చారు.

రూ.5 లక్షల వరకు నష్టపోయా 

ఆకేరు వరద కారణంగా రూ.5 లక్షల వరకు నష్టపోయా. తిండి కోసం ఇంట్లో దాచుకున్న 24 బస్తాల వడ్లు తడిసిపోయాయి. మంచి రేటు వస్తే అమ్ముకుందామని ఇంటి ముందు నిల్వ చేసిన 15 బస్తాల పత్తి వరదలో కొట్టుకుపోయింది. ఈ ఏడాది మూడెకరాల్లో పత్తి సాగు చేస్తే ఆనవాళ్లు కూడా లేకుండా చేను మొత్తం కోతకు గురైంది. ఇంట్లో సామాన్లు మొత్తం కొట్టుకుపోయి మొండి గోడలే మిగిలాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – బానోత్ రవి

ఊర్లో ఉండాలంటేనే భయమేస్తోంది 

మా ఇంట్లో ఐదు బస్తాల వడ్లతో పాటు మూడు బర్రెలు, 5 మేకలు, కోళ్లు కూడా కొట్టుకుపోయాయి. 10, 12 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలు ఉన్నరు. మాకు కొంత భూమి తప్ప ఏ ఆధారమూ లేదు. వరద వల్ల ఇంట్లోని సామాన్లన్నీ కొట్టుకుపోయినయ్‌‌. ఈ ఊర్లో ఉండాలంటేనే భయమేస్తోంది. మళ్లీ వరదొస్తే మా పరిస్థితేంటో తెలుస్తలే.
– బానోత్ అనిత


పెళ్లి కోసం దాచిన బంగారం కొట్టుకుపోయింది 


మా అమ్మాయికి ఈ మధ్యనే లగ్గం పెట్టుకున్నం. శనివారం జ్వరం రావడంతో ఖమ్మం ఆస్పత్రిలో ఉన్నాం. తెల్లారి ఊర్లోకి వచ్చే పరిస్థితి లేదు. సోమవారం వచ్చి చూస్తే ఇంట్లో ఏమీ లేవు. వచ్చే నెలలో అమ్మాయి పెళ్లి ఉందని తెచ్చి పెట్టుకున్న తులం బంగారం, 20 తులాల వెండి పట్టీలు, డబ్బులు, బర్లు, మేకలు అన్నీ కొట్టుకుపోయినయ్‌‌. ఇప్పుడు పిల్ల పెండ్లి ఎట్ల చేయాలో అర్థంకావట్లే.
– జర్పుల లీల